త్వ‌ర‌లో కేసీఆర్ మార్క్ సైన్యం వ‌చ్చేస్తోంది

Update: 2017-07-06 05:22 GMT
కొత్త కొత్త ఆలోచ‌న‌లు చేయ‌టం తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు అల‌వాటే. ఆయ‌న ఆలోచ‌న‌లు నిజంగా వ‌ర్క్ వుట్ అవుతాయా? లేదా? అన్న విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. ఏదో జ‌రుగుతుంద‌న్న హ‌డావుడి అయితే మాత్రం చేయ‌గ‌లుగుతారు. ఏడాది క్రితం ఇదే వ‌ర్షాకాలంలో హ‌రిత‌హారం అంటూ ఆయ‌న చేసిన హ‌డావుడి అంతా ఇంతా కాదు. వంద‌లాది కోట్ల రూపాయిలు ఖ‌ర్చు చేసి కోట్ల చెట్ల‌ను నాట‌ట‌మేకాదు.. టార్గెట్లు పెట్టి మ‌రీ గులాబీద‌ళాల్ని రోడ్ల మీద‌కు తీసుకొచ్చారు.

గల్లీ స్థాయి నేత‌లు మొద‌లు కొని రాష్ట్ర స్థాయి నేత‌లు.. ఆ మాట‌కు వ‌స్తే ముఖ్య‌మంత్రివ‌ర్యులు సైతం మొక్క‌లు నాటే ప్రోగ్రాం మీద ఫోక‌స్ చేశారు. రాష్ట్ర మంతా మొక్క‌లు నాటిన త‌ర్వాత తాను స్వ‌యంగా తిరుగుతాన‌ని.. నాటిన మొక్క‌ల్ని స‌ర్వే చేసి చూస్తాన‌ని చెప్పారు. ఇలాంటి మాట‌లు విన్న‌ప్పుడు కేసీఆర్ విజ‌న్ ఎంతో అని మురిసిపోతాం. కానీ.. వాస్త‌వంగా చూస్తే మాత్రం అందుకు భిన్నంగా జ‌రుగుతుంటుంది.

నాటిన కోట్లాది మొక్క‌ల్ని తాను స్వ‌యంగా చూస్తాన‌ని చెప్పిన‌ప్పటికీ ఆచ‌ర‌ణ‌లో అదేమీ సాధ్యం కాలేద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. మ‌ళ్లీ వ‌ర్షాకాలం వ‌చ్చేశాయి. ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు మొక్క‌ల మీద కొత్త ఆలోచ‌న‌లు వ‌చ్చేశాయి. కోట్లాది రూపాయిల ఖ‌ర్చుతో మొక్క‌ల్ని నాటాల‌న్న హ‌డావుడి మ‌ళ్లీ మొద‌లైంది. కాకుంటే ఈ సారి హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హ‌రిత సైన్యాలు ఏర్పాటు చేయాల‌ని డిసైడ్ చేశారు.

ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 12 నుంచి ప్రారంభ‌మ‌య్యే హ‌రిత‌హారం కార్య‌క్ర‌మాన్ని స‌క్సెస్ చేసేందుకు వీలుగా మొక్క‌లు నాట‌టం మాత్ర‌మే కాదు.. వాటిని సంర‌క్షించే బాధ్య‌త‌ను చేప‌ట్టాల‌ని.. అందుకు అధిక ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని పిలుపునిచ్చారు.

క‌రీంన‌గ‌ర్ ప‌ట్ట‌ణంలో ల‌క్ష మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మాన్ని తానే ప్రారంభిస్తాన‌ని చెప్పిన ఆయ‌న‌.. తొలిరోజు 25వేల మొక్క‌లు.. ఆ త‌ర్వాతి రోజు నుంచి ఐదు వేల చొప్పున 15 రోజుల‌పాటు మొక్క‌లు నాటే ప‌ని చేప‌ట్టనున్న‌ట్లు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికార గ‌ణాన్ని ఆదేశించారు. గుంత‌లు తీయ‌టం.. మొక్క‌లు నాట‌టం.. వాటిని సంర‌క్షించేందుకు వీలుగా ట్రీ గార్డును ఏర్పాటు చేయ‌టం.. వ‌ర్షాలు లేన‌ప్పుడు ట్యాంక‌ర్ల ద్వారా నీళ్ల‌ను పోసేందుకు వీలుగా కార్యాచ‌ర‌ణ‌ను సిద్ధం చేయాల‌ని కేసీఆర్ చెబుతున్నారు.

క‌రీంన‌గ‌ర్ లోని ప్ర‌తి డివిజ‌న్‌ కు ఒక అధికారి లేదంటే ఒక ప్ర‌జాప్ర‌తినిధిని హ‌రిత సైనికాధికారిగా నియ‌మించాల‌ని.. స్కూలు విద్యార్థుల్ని ఈ కార్య‌క్ర‌మంలో భాగ‌స్వామ్యం చేయాల‌ని చెబుతున్నారు. ఈ గ్రీన్ ఆర్మీ ముచ్చ‌ట వ‌ర్క్ వుట్ అయితే.. రాష్ట్రవ్యాప్తంగా అమ‌లు చేయాల‌ని కేసీఆర్ భావిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. మ‌రీ.. గ్రీన్ ఆర్మీ హ‌డావుడి ఎంత కాలం సాగుతుందో చూడాలి.

Tags:    

Similar News