కేసీఆర్ ను కలిసేందుకు గోడ దూకిన మహిళ..ఎందుకంటే?

Update: 2019-08-15 05:02 GMT
ఊహించని పరిణామం ఒకటి చోటు చేసుకుంది. వరంగల్ రూరల్ జిల్లా ప్రగతి సింగారం గ్రామానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామం సంచలనంగా మారింది. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తండ్రి చనిపోవటంతో.. ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు వారింటికి వెళ్లారు. ధర్మారెడ్డి ఇంట్లోకి సీఎం కేసీఆర్ ప్రవేశిస్తున్న వేళ.. ఒక మహిళ ఇంటి గోడను దూకి మరీ లోపలకు వచ్చే ప్రయత్నం చేశారు.

దీంతో అలెర్ట్ అయిన భద్రతా సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. అయినప్పటికీ మొండిపట్టుదలతో ఆమె భద్రతా సిబ్బందిని ఛేదించుకొని మరీ దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో మరింత అప్రమత్తమైన అక్కడి పోలీసు బలగాల్లోని మహిళా పోలీసులు ఆమెను కిందకు తోసేసి.. పట్టుకునే ప్రయత్నం చేశారు.

ఈ ఘటన కలకలం రేపటంతో పాటు.. ముఖ్యమంత్రి కేసీఆర్ చూసేలా చేసింది. దీంతో ఆయన భద్రతా సిబ్బందిని వారించి.. ఆమెను తన వద్దకు తీసుకురావాల్సిందిగా కోరారు. దీంతో సదరు మహిళను సీఎం కేసీఆర్ ను కలిసేందుకు అనుమతించారు. సీఎంను కలిసిన ఆమె.. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కారణంగా తనకు అన్యాయం జరిగినట్లుగా ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలి కోరారు. దీంతో.. స్పందించిన సీఎం కేసీఆర్ ఆమెకు న్యాయం చేయాలని చెబుతూ.. విచారణ ఆధారంగా చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎంను కలిసేందుకు గోడ దూకిన సదరు మహిళ ఉదంతం భద్రతా సిబ్బందికి షాకింగ్ గా మారిందని చెప్పక తప్పదు.


Tags:    

Similar News