ఆ బ్యారేజీ పేరు మార్చేసిన కేసీఆర్

Update: 2020-02-13 05:15 GMT
టైమ్లీగా నిర్ణయాలు తీసుకోవటంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కున్న నేర్పు అంతా ఇంతా కాదు. ప్రజలు ఉండే మూడ్ ను గుర్తించి.. అందుకు తగ్గట్లుగా పాలనాపరమైన మార్పులు చేర్పులు చేస్తుంటారు. గడిచిన కొద్ది రోజులుగా వరుస పెట్టి రివ్యూలు చేస్తున్న సీఎం.. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించనున్న విషయం తెలిసిందే.

దీనికి సంబంధించి ముందస్తు రివ్యూను ముందు రోజు చేసిన కేసీఆర్.. కార్యక్రమం ఎలా జరగాలన్న విషయం మీద క్లారిటీ ఇచ్చేశారు. ఎవరికేం అర్థం కావాలో అది అర్థమయ్యేలా మీటింగ్ పెట్టిన ఆయన.. గోదావరి నది మీద నిర్మించే తుపాకుల గూడెం బ్యారేజీకి కొత్త పేరు పెట్టేశారు.

తెలంగాణ ఆదివాసీ వనదేవత సమ్మక్క పేరు పెట్టాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఆదేశాల్ని వెంటనే జారీ చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ఇటీవల ముగిసిన జాతర వేళలో.. ప్రజలంతా ఆ మూడ్ లో ఉన్న వేళ.. టైమ్లీగా తీసుకున్న నిర్ణయం ప్రజలు మెచ్చేలా చేస్తుందని చెప్పక తప్పదు.

అంతేకాదు.. మరో మూడునాలుగు నెలల తర్వాత మొదలయ్యే వర్షాకాలానికి సంబంధించిన ప్లాన్లను ఇప్పుడే సిద్ధం చేశారు. వర్షాకాలంలో వరద నీటి ప్రవాహం పెరుగుతుందని.. దాన్ని కాలువలకు మళ్లించే దిశగా నీటిపారుదల శాఖ ఇప్పటి నుంచే పనులు మొదలు పెట్టాలని సూచన చేశారు. మూడు.. నాలుగు నెలల తర్వాత జరిగే అంశాల్ని ముందే హెచ్చరించటం ద్వారా.. తనకున్న విజన్ ఎంతన్న విషయాన్ని అధికార గణానికి అర్థమయ్యేలా చేస్తున్నారు.


Tags:    

Similar News