వేరీజ్ కేసీఆర్ ప్రచారానికి భలేగా సమాధానం ఇచ్చేసిన సారు!

Update: 2020-07-09 07:00 GMT
కొద్ది రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ? అన్న ప్రశ్న అందరి నోట వినిపించటమే కాదు.. చివరకు ఒక రోజున ట్విట్టర్ లో మోస్ట్ ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్ గా నమోదైంది కూడా.ఆయన ఎలా ఉన్నారన్న విషయంపై పలు సందేహాలు వ్యక్తం కావటమే కాదు.. ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న విషయాన్ని తెలియజేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.

మిగిలిన పాలకులకు భిన్నం కేసీఆర్. ఆయన్ను ప్రేమగా అడిగితే.. కొండ మీద కోతినైనా తెచ్చిస్తారు. అదే సమయంలో డిమాండ్ చేసినట్లుగా కనిపిస్తే.. అదెంత చిన్న కోరికైనా సరే దాన్ని ఓకే చేసేందుకు ససేమిరా అనే లక్షణం ఆయనలో ఎక్కువని చెబుతుంటారు. కేసీఆర్ కనిపించట్లేదన్న ప్రచారానికి విరుగుడుగా.. ప్రెస్ మీట్ పెట్టటమో.. వీడియోకాన్ఫరెన్సు నిర్వహించటం లాంటివి చేసి.. మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ సాగుతున్న ప్రచారానికి చెక్ పెట్టొచ్చు. అలా చేస్తే.. ఆయన కేసీఆర్ ఎందుకు అవుతారు చెప్పండి?

తనపై జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టేందుకు వీలుగా తెలంగాణ సీఎం వినూత్నంగా వ్యవహరించారు. బుధవారం రాత్రి జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం వెంకట్రావుపేట మాజీ సర్పంచ్.. రైతుసమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడారు. ముఖ్యమంత్రే స్వయంగా సీన్లోకి వచ్చి ఏం తెలుసుకున్నారు? ఏయే అంశాల్ని మాట్లాడారన్న విషయాన్ని చూస్తే.. ఇటీవల కాలలో కొందరు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావించారు.

వరద కాలువ ద్వారా నీళ్లు అందని గ్రామాలు.. నాన్ ఆయకట్టు గ్రామాల నీటిసమస్య గురించి స్వయంగా అడిగి తెలుసుకున్న కేసీఆర్.. వారి సమస్యను నాలుగు నెలల్లో పరిష్కరిస్తానన్న హామీని ఇచ్చారు. ఇంతకీ సదరు నేతకు.. సీఎంకు మధ్య జరిగినట్లుగా చెబుతున్న సంభాషణ మీడియాలో వచ్చింది. దాన్ని యథాతధంగా చూస్తే..ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు 350 మీటర్ల ఎత్తులో మేడిపల్లి మండలం ఉందని.. వరద కాలువకు ఎత్తిపోతల ద్వారా మండలంలోని పన్నెండు గ్రామాలకునీరు అందించి చెరువులు నింపాలన్నారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించారు.

సీఎం కేసీఆర్.. రైతు నేత శ్రీపాల్ రెడ్డి మధ్య సాగిన ఫోన్ కాల్ సంభాషణ ఇదే..

శ్రీపాల్‌ రెడ్డి: బ్రహ్మాండంగా నీళ్లు కనిపిస్తున్నాయి సార్‌. తమరు విడిచిపెట్టి మూడురోజులైంది.

కేసీఆర్‌: సమస్య పరిష్కారం చేసుకోవాలంటే చింతకుంట అనే గ్రామం చెరువు, ఇంకేదో చెరువుకు లిఫ్ట్‌ పెట్టేస్
తే బ్రహ్మాండంగా పది గ్రామాలకు వస్తాయ్‌ సార్‌ అని భూమయ్య చెప్పాడు.

శ్రీపాల్‌ రెడ్డి: వందశాతం పక్కా సార్‌. కాళేశ్వరానికి 350 మీటర్ల పైన మేడిపల్లి మండలం ఉంది.

కేసీఆర్‌: ఏయే నియోజకవర్గాల్లో ఈ బాధ ఉంది?

శ్రీపాల్‌ రెడ్డి : సార్‌, వేములవాడ నియోజకవర్గంలో మేడిపల్లి, కథలాపూర్‌. జగిత్యాల జిల్లాలో మల్యాల. నాన్‌ ఆయకట్టు మండలాలు సార్‌.

కేసీఆర్‌: ఇబ్రహీంపట్నమా? ఏ ఊరు అది?

శ్రీపాల్‌ రెడ్డి: మెట్‌ పల్లిలోని కొన్ని గ్రామాలుంటాయి సార్‌. విద్యాసాగర్‌ రావు గారి నియోజకవర్గం అది.

కేసీఆర్‌:మంత్రి ప్రశాంత్‌ రెడ్డి గారి నియోజక వర్గం బాల్కొండ కూడా ఉంటుంది కదా?

శ్రీపాల్‌ రెడ్డి: ఉంటది సార్‌.

కేసీఆర్‌: మరి మీరంతా రావాల్సి ఉంటది?

శ్రీపాల్‌ రెడ్డి: అయ్యా... మీరు ఎప్పుడంటే అప్పుడు. రేపు అంటే రేపే వస్తాం సార్‌.

కేసీఆర్‌: మీరంతా ఉంటే... సమగ్రంగా మాట్లాడి.. ప్రత్యామ్నాయంగా వరద కాలువ ఒకటి తీసుకుంటే ఈ బాధ పర్మనెంటుగా పోతది కదా?

శ్రీపాల్‌ రెడ్డి: మీరు అనుకుంటే పెద్ద సమస్య కాదు సార్‌.

కేసీఆర్‌: నాలుగు నెలల్లో చేపిద్దాం. ఇష్యూ కాదు.

శ్రీపాల్‌ రెడ్డి: సార్‌ సార్‌.

కేసీఆర్‌: మీరు అక్కడ లోకల్‌ గా ఉన్న నాయకులను ఎంబడి పడి చేయించుకుంటారు. ఒక సమావేశంలో మాట్లాడి కొంత చేస్తే బాగు చేసుకోవచ్చు.

శ్రీపాల్‌ రెడ్డి: వినోద్‌ కుమార్‌ సారుకి అప్పచెప్పండి సార్‌. ఆయన దగ్గర చాలా సార్లు వినతి పత్రాలు ఇచ్చాం.
Tags:    

Similar News