సీఎం కేసీఆర్ స్క్రీన్ ప్లే? కుట్ర బయటపెట్టేందుకు 4 రోజుల ముందే ప్లానింగ్?

Update: 2022-10-27 04:15 GMT
మొయినాబాద్ ఫాంహౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నలుగురిని తమ పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీకి చెందిన కొందరు మధ్యవర్తులు వేసిన ప్లాన్ బయటకు వచ్చేయటం.. ఎర వేయటానికి వచ్చినోళ్లను పోలీసులు అదుపులోకి తీసుకోవటం తెలిసిందే.

ఈ మొత్తం ఎపిసోడ్ ను చూసినప్పుడు చాలా జాగ్రత్తగా స్క్రీన్ ప్లే చేసినట్లుగా కనిపించక మానదు. అయితే.. ఒక ప్రధాన మీడియా సంస్థలో వచ్చిన ఒక కథనం ఆసక్తికరంగా మారింది. అందులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఈ మొత్తం ఎపిసోడ్ కు సంబంధించి నాలుగు రోజుల ముందు నుంచే పక్కా ప్లానింగ్ జరిగినట్లుగా చెబుతున్నారు.

తమను పార్టీ మారాలని నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర వేయటం.. దానికి సంబంధించిన డీల్ ను సీఎం కేసీఆర్ ను కలిసి ఆ నలుగురు ఆయనకు చెప్పినట్లుగా చెబుతున్నారు. దీంతో.. పోలీసుల్ని పిలిపించుకున్న ముఖ్యమంత్రి.. అధికార పార్టీని దెబ్బ తీసే కుట్రను ఛేధించాల్సిందిగా ఆదేశించినట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగా బేరసారాలకు పాల్పడే వారికి బెదురు పుట్టేలా చేయటం కోసం పక్కా ప్లాన్ ను సిద్ధం చేసినట్లుగా పేర్కొంటున్నారు.

తమను పార్టీ మారాలని ప్లాన్ చేసే వారిని అడ్డంగా బుక్ చేసేందుకు సీఎం కేసీఆర్ స్క్రీన్ ప్లే కు అనుగుణంగా వ్యవహరించినట్లుగా చెబుతున్నారు. బేరసారాలకు సంబంధించిన గంటన్నర ఎపిసోడ్ ను రికార్డు చేసినట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఆడియో.. వీడియోల్ని తీశారని.. అవి తర్వాత బయటకు వచ్చే వీలుందన్న మాట వినిపిస్తోంది.

ఎర వేసిన వారిని ట్రాప్ చేసేందుకు వీలుగా పక్కా ప్లాన్ సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగా.. ఫామ్ హౌస్ లో కెమేరాల్ని ఫిక్సు చేయటం దగ్గర నుంచి క్యాష్ ను లెక్క వేసేందుకు అవసరమైన మిషిన్లను కూడా సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. పోలీసు అధికారులతో పాటు.. రెవెన్యూ అధికారుల్ని కూడా సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు. మొత్తంగా చూసినప్పుడు నాలుగు వందల కోట్ల రూపాయిల డీల్ ను నాలుగు రోజులకు ముందే ప్లానింగ్ చేసి.. తమకు ఎర వేసినోళ్లను ఎర్రిముఖాలుగా చేయటంలో అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సక్సెస్ అయ్యారన్న మాట వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News