వాళ్లందరికి శాపం పెట్టేసిన కేసీఆర్

Update: 2020-03-30 06:15 GMT
పురాణాల్లోనూ.. అప్పటి చందమామ కథల్లోనూ దేవతలు.. మునులు.. కొందరు శాపాలు పెట్టేయటం విన్నాం. ఇప్పుడున్న డిజిటల్ యుగాల్లో శాపాలు పెట్టేవారు కనిపించరు. కానీ.. అందుకు భిన్నంగా వ్యవహరించి అందరి కళ్లు తన మీద పడేలా చేశారు సీఎం కేసీఆర్. కరోనా వేళ.. సోషల్ మీడియాలో దుర్మార్గమైన ప్రచారం చేసే వారికి భయంకరమైన శిక్షలు ఉంటాయని.. అవెలా ఉంటాయో తాను చూపిస్తానని చెప్పారు.

తాము గొప్పోళ్లం.. ఎవరూ తమను పట్టుకోలేమని కొందరు మూర్ఖులు అనుకుంటారని.. అలాంటి వాళ్లు ఎలా చేస్తారో.. ఎంత చేస్తారో అంతకు వందరెట్లు శిక్ష అనుభవిస్తారన్నారు. ప్రపంచం ఆగమాగం అవుతున్న వేళ.. చిల్లర ప్రచారాలు చేస్తారా? అంటూ మండిపడ్డారు. సోషల్ మీడియాలో దుర్మార్గమైన ప్రచారం చేసే వారందరికి అందరికన్నా ముందు కరోనా సోకుతుందన్నారు. ఆ దుర్మార్గులకు ఆ వైరస్ కచ్ఛితం గా సోకాలన్నారు.

ప్రజల మనోభావాలతో ఆడుకోవటం.. ప్రశాంతంగా ఉన్న ప్రజల్ని మానసికంగా హింసించటం మంచి పద్దతి కాదన్నారు. ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తారో.. వారిని కరోనా పట్టుకోవాలని తాను శాపం పెడుతున్నట్లు చెప్పారు. తప్పుడు ప్రచారాల మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్న ముఖ్యమంత్రి.. తనదైన శైలిలో శాపం పెట్టేసిన తీరు రోటీన్ కు భిన్నంగా సాగిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News