‘నన్ను టచ్ చేసి చూడు’ నుంచి ‘ఫాం హౌస్ కు వస్తే ముక్కలు చేస్తా’

Update: 2021-11-09 05:47 GMT
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈ విషయం మీద అవగాహన ఉన్న వారు.. కాలం తో పాటు వస్తున్న మార్పుల్ని గుర్తిస్తుంటారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ కు ఇప్పుడు అలాంటి పరిస్థితే ఎదురవుతోంది. ఒకప్పుడు ఆయన నోటి నుంచి ఒక మాట వస్తే.. దాని ప్రతి స్పందన తెలంగాణ సమాజం లో స్పష్టం గా కనిపించేది. మీడియా ముందుకు ఎప్పుడో ఒక సారి కాని రాని కేసీఆర్.. అందుకు భిన్నం గా రెండు రోజుల పాటు వరుస పెట్టి ప్రెస్ మీట్లు పెడుతున్న వైనం ఆసక్తికరం గా మారింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. రెండు ప్రెస్ మీట్లను నిశితంగా పరిశీలించినప్పుడు ఒక కొత్త విషయం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.

మొదటి ప్రెస్ మీట్ ఆదివారం సాయంత్రం.. మరింత స్పష్టం గా చెప్పాలంటే రాత్రి ఏడు గంటల వేళ లో మొదలై సుదీర్ఘం గా సాగటం తెలిసిందే. ఆ సందర్భం గా తనను అరెస్టు చేయిస్తానంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తరచూ చేసే వ్యాఖ్యల్ని ప్రస్తావించిన సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. నన్ను టచ్ చేస్తావా? టచ్ చేసి బతికి బట్టగలవా? అంటూ ఘాటు గా రియాక్టు కావటమే కాదు.. తనను అరెస్టు చేస్తే తెలంగాణ సమాజం ఊరుకోదని.. తీవ్రం గా రియాక్టు అవుతుందన్న అర్థం వచ్చేలా మాట్లాడటం తెలిసిందే.

ఈ ప్రెస్ మీట్ జరిగిన దానికి 24 గంటల లోపే.. అంటే.. సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయం లో మరో ప్రెస్ మీట్ పెట్టటం తెలిసిందే. ఈ సందర్భం గా మరో సారి బండి సంజయ్ మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. ఆయన చేసిన ప్రతి వ్యాఖ్యకు కౌంటర్ ఇచ్చేలా కేసీఆర్ ప్రెస్ మీట్ సాగింది. ఈ సందర్భం గా బండి సంజయ్ చేసిన పాదయాత్ర లో తరచూ తన ఫాంహౌస్ గురించి ప్రస్తావిస్తుంటారని.. ఫాంహౌస్ దున్నుతానని చేసే వ్యాఖ్యలకు తన వద్ద పని చేసే వారు.. బండి సంజయ్ కు పని లేదా? అని మాట్లాడారంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.

అంత లోనే.. ఫాంహౌస్ వద్దకు వస్తే ఆరు ముక్కలవుతావ్ అంటూ గీత దాటిన వ్యాఖ్య చేయటం పై అభ్యంతరం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న కేసీఆర్.. ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఉద్దేశించి ఈ తరహా వ్యాఖ్య చేయటమా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. రెండు రోజుల వ్యవధిలో రెండు ప్రెస్ మీట్లు పెట్టిన సందర్భంగా కేసీఆర్ మాటల్లో తేడా కొట్టొచ్చినట్లు కనిపించటం గమనార్హం. మొదటి రోజు తనను టచ్ చేస్తే తెలంగాణ సమాజం ఊరుకోదని.. ప్రజల రియాక్షన్ తీవ్రంగా ఉంటుందన్న మాటలు మాట్లాడిన కేసీఆర్.. రెండో రోజు వచ్చేసరికి.. తెలంగాణ ప్రజలు కాదు.. తానే రియాక్టు అవుతానన్న అర్థం వచ్చేలా చేసిన వ్యాఖ్యల్ని చూసినోళ్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

ఎందుకిలా అంటే.. సాధారణంగా కేసీఆర్ మాటలకు ఉండే శక్తి.. ఆయన ఏదైనా విషయం మీద తక్షణమే స్పందించే తెలంగాణ సమాజం.. ఇప్పుడు మాత్రం మౌనంగా ఉంటాన్ని కేసీఆర్ గుర్తించి.. తానే మరో అడుగు ముందుకు వేసి మరింత తీవ్రం గా వ్యాఖ్యలు చేశారని చెప్పాలి. కేసీఆర్ మాటలకు ఇట్టే రియాక్టు అయ్యే తీరు తెలంగాణ సమాజం లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంటుంది. అందుకు భిన్నంగా.. తాజాగా మాత్రం అసలు స్పందించకుండా ఉన్న వైనం చూస్తే.. కేసీఆర్ గ్రాఫ్ ప్రజల్లో పడిపోయిన వైనాన్ని స్పష్టం చేస్తుందంటున్నారు. ఏడున్నరేళ్లుగా అధికారాన్ని చేతిలో పెట్టుకొని వ్యవహరిస్తున్న తీరుపై ప్రజల్లో క్లారిటీ వచ్చిందంటున్నారు. గులాబీ బాస్ చెప్పే మాటలకు.. చేతలకు ఉండే వైరుధ్యం పై స్పష్టమైన అవగాహనకు తెలంగాణ సమాజం వచ్చిందన్న మాట వినిపిస్తోంది. ఇదే నిజమైతే.. కేసీఆర్ కు అపశకునమే అవుతుంది.
Tags:    

Similar News