పునీత్ అంత్యక్రియలు పూర్తి.. పార్థీవదేహానికి ముద్దు పెట్టిన సీఎం

Update: 2021-10-31 04:32 GMT
గుండెపోటుతో అర్థాంతరంగా కన్నుమూసిన శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ పార్థీవ దేహానికి అంత్యక్రియలు ముగిశాయి. కంఠీరవ స్టూడియోలో ప్రభుత్వ లాంఛనాలతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. పునీత్ రెండో అన్న కొడుకు రాఘవేంద్ర రాజ్ కుమార్ తనయుడు వినయ్ రాజ్ కుమార్ చేతులమీదుగా అంత్యక్రియలు పూర్తి చేశారు.

ఈ కార్యక్రమాన్ని కర్ణాటక ప్రభుత్వం అధికార లాంఛనాలతో చేపట్టింది. దీనికి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ సీఎం సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మంత్రులు, సినీ పరిశ్రమ ప్రముఖులు,తోటి నటీనటులు హాజరయ్యారు.

తెల్లవారుజామున 4.15 నిమిషాలకు బసవరాజు బొమ్మై కంఠీరవ స్టేడియానికి చేరుకున్నారు. అంతిమయాత్ర ఏర్పాట్లను దగ్గరుండి చూశారు. ఆయన వెంట మంత్రులు, అధికారులు ఉన్నారు. శివరాజ్ కుమార్, యష్ తో మాట్లాడారు.

పార్థీవదేహం వద్దకు చేరుకొని గ్లాస్ కవర్ ను తొలగించాలని సీఎం బొమ్మై కోరారు. ఆ వెంటనే కన్నీటి పర్యంతం అయ్యారు. ఆప్యాయంగా పునీత్ రాజ్ కుమార్ పార్థీవదేశం నుదిటిని రెండు సార్లు ముద్దు పెట్టుకున్నారు. ప్రేమగా తలను నిమిరారు. చెంపలను తడిమారు. చేతులు జోడించి పార్థీవదేహానికి నమస్కరించారు. కన్నీరు పెట్టుకున్నారు.

తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు అంతిమయాత్ర మొదలైంది. ప్రభుత్వ వాహనంలో కంఠీరవ స్టేడియానికి చేరుకున్నారు. వాహనాన్ని పూలతో అలంకరించి అంతిమయాత్రను కొనసాగించారు.బెంగళూరు నగరంలోని ప్రధాన వీధుల గుండా అంతిమయాత్ర సాగింది. అనంతరం కంఠీరవ స్టేడియానికి చేరుకుంది. సీఎం బొమ్మై, పలువురు మంత్రులు, ప్రముఖులు హాజరై నిర్వహించారు. తండ్రి రాజ్ కుమార్ సమాధికి 125 అడుగులు, తల్లి పార్వతమ్మ సమాధికి 45 అడుగుల దూరంలో పునీత్ పార్థీవ దేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ప్రభుత్వ లాంఛనాలతో ముగిసింది. అభిమానులు దారిపొడువునా నిలిచి నివాళులర్పించారు.
Tags:    

Similar News