రచ్చ రచ్చ తర్వాత పళని పాసయ్యారు

Update: 2017-02-18 10:39 GMT
ఉత్కంఠ వీడిపోయింది. చివరిక్షణాల్లో ఎలాంటి అద్భుతం చోటు చేసుకోలేదు. అక్కడెక్కడో జైల్లో కూర్చొన్న చిన్నమ్మ గీసిన స్కెచ్ కు తగ్గట్లే తుది ఫలితం వెలువడింది. మొత్తంగా బలనిరూపణ పరీక్షలో పళనిస్వామి ముఖ్యమంత్రిగా పాస్ అయ్యారు. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఆయన.. గవర్నర్ ఆదేశాలకు తగ్గట్లే తనకు పూర్తిస్థాయి మెజార్టీ ఉందన్న విషయాన్ని తాజా పరీక్షలో నిరూపించుకున్నారు.

శనివారం ఉదయం ప్రత్యేకంగా సమావేశమైన తమిళనాడు అసెంబ్లీలో అసాధారణ పరిణామాలు చోటు చేసుకోవటం.. రెండుసార్లు సభ వాయిదా పడిన అనంతరం..మొదలైన సభలో బలనిరూపణ వ్యవహారం ప్రశాంతంగా పూర్తి అయ్యింది. డీఎంకే సభ్యుల తీరుతో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరిని స్పీకర్ సస్పెండ్ చేయటం.. సభలో ఉన్న కాంగ్రెస్ నేతలు.. ముస్లింలీగ్ సభ్యులు వాకౌట్ చేశారు.

అనంతరం నిర్వహించిన డివిజన్ ఓటింగ్ లో పళని స్వామికి అనుకూలంగా 122 ఓట్లు రాగా.. వ్యతేకంగా 11 ఓట్లు (పన్నీర్ వర్గం) వేశాయి. దీంతో.. బలనిరూపణ పరీక్షలో పళనిస్వామి పాస్ అయినట్లుగా స్పీకర్ ధన్ పాల్ ప్రకటించారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య రచ్చ రచ్చగా మొదలైన బలనిరూపణ పరీక్ష చివరకు మాత్రం ఎలాంటి ఆటంకాలు లేకుండానే బలనిరూపణ పరీక్ష పూర్తి అయ్యింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News