జ‌గ‌న్ చెబితే ఐటీ దాడులేంటి ర‌మేష్?

Update: 2018-10-12 07:43 GMT
టీడీపీ నాయకుడు - రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ఆఫీసుల్లో - ఇళ్ల‌లో ఆదాయపన్ను శాఖ అధికారులు శుక్రవారం నాడు సోదాలు చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. హైదరాబాద్‌ - విజయవాడల‌తో పాటు ర‌మేష్ సొంత గ్రామంలో ఇయ‌న ఇల్లు - బంధువుల ఇళ్ల‌లో కూడా సోదాలు జరుగుతున్నాయి. సీఎం ర‌మేశ్ కు ఎక్కువ‌గా కాంట్రాక్టులు ద‌క్కుతున్నాయ‌ని టీడీపీ నాయకులు కూడా గ‌త నాలుగేళ్లుగా గుస‌గుస‌లాడుకుంటున్న నేప‌థ్యంలో ఈ సోదాలకు ప్రాధాన్య‌త ఏర్పడింది. తాజాగా, ఈ సోదాల‌పై ర‌మేష్ స్పందించారు. ఆ సోదాల వెనుక జగన్ కుట్ర దాగుందని ఆరోపించారు. జగన్ - విజయసాయి రెడ్డిలు తనపై కుట్ర ప‌న్ని ప్రధాని నరేంద్ర మోదీతో ఐటీ దాడులు చేయిస్తున్నారన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎదుగుతున్నవారిని టార్గెట్ చేస్తూ ఐటీ - సీబీఐ - ఈడీ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు.

అయితే, జ‌గ‌న్ పై ర‌మేష్ చేస్తున్న ఆరోప‌ణ‌లు హాస్యాస్పదంగా ఉన్నాయి. జ‌గ‌న్ కోరుకున్న వారిపై ఐటీ - ఈడీ - సీఐడీ దాడులు జ‌రిపించ‌డానికి ఆయ‌నేమన్నా దేశ‌ప్ర‌ధానా? లేక  ఐటీ డిపార్ట్ మెంట్ క‌మీష‌న‌రా?. అయినా, ర‌మేష్ కంపెనీల‌లో లావావేవీల‌న్నీ పార‌ద‌ర్శ‌కంగా ఉండి ఉంటే సోదాల‌పై భ‌య‌మెందుకు? నిజాయితీగా లెక్క‌లు మెయింటెన్ చేస్తున్న‌పుడు ఒక‌రికి భ‌య‌ప‌డాల్సి అవ‌స‌ర‌మేముంది? గుమ్మ‌డికాయల దొంగెవ‌రంటే భుజాలు త‌డుముకున్న‌ట్లు ర‌మేష్ మాట్లాడ‌డం ఏమిటి?టీడీపీ నేత‌ల అడ్డ‌గోలు విమ‌ర్శ‌ల‌కు అడ్డూ అదుపు లేకుండా పోతోంది.

మోడీ ఆదేశాల‌ను జ‌గ‌న్ పాటిస్తున్నార‌ని ఆరోపించిన టీడీపీ నేత‌లే....జ‌గ‌న్ చెప్పిన‌ట్లు మోడీ వింటార‌ని  ఆరోప‌ణ‌లు చేయ‌డం వారి అజ్ఞానానికి నిద‌ర్శ‌నం. చంద్ర‌బాబు మాకు ఎప్ప‌టికీ మిత్రుడేన‌ని పార్ల‌మెంటు సాక్షిగా రాజ్ నాథ్ సింగ్ ప్ర‌క‌టించిన విష‌యం ర‌మేష్ మ‌ర‌చిన‌ట్లున్నారు. మోదీ-బాబుల ఫెవికాల్ చీక‌టి ఒప్పందం గురించి తెలిసి కూడా జ‌గ‌న్ పై తెలుగు త‌మ్ముళ్లు ఇటువంటి ఆరోప‌ణలు చేయ‌డం....ఆకాశంపై ఉమ్మి వేయ‌డం ఒక‌టే.
Tags:    

Similar News