అబద్దాలు మాట్లాడతారా : సీఎం కేసీయార్ మీద సీఎం ఫైర్

Update: 2022-07-11 14:20 GMT
ఆయన కూడా సీఎం నే. దర్జాకు ఏమీ తక్కువ లేదు. ఆయన కూడా రాజకీయ నాయకుడే. ఇక ఢిల్లీలో కూడా మంచి పలుకుబడి కలిగిన నేత.  ఉమ్మడి ఏపీలో కూడా జనాల నోళ్లలో బాగానే కదిలే పేరు. ఆయనే సీఎం రమేష్. జనాలు ఇచ్చే సీఎం పదవిని ఆయన పుట్టుకతోనే తెచ్చేసుకున్నారు. అది ఆయన వెంటనే ఎప్పటికీ  ఉంటుంది. టీడీపీలో చురుకైన నేతగా ఉంటూ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన సీఎం రమేష్ బాబు గారి చలువతో రెండు సార్లు రాజ్యసభ మెంబర్ కాగలిగారు. ఆయన 2019లో ఇలా తెలుగుదేశం పార్టీ ఓడిందో లేదో అలా బీజేపీలోకి దూకేశారు. ప్రస్తుతం ఆయన బీజేపీ ఎంపీగానే చలామణీ అవుతున్నారు.

ఇదిలా ఉంటే ఆయన సడెన్ గా సీన్లోకి వచ్చి తెలంగాణా సీఎం కేసీయార్ మీద గుస్సా అయ్యారు. సీఎం గారు మీరు ఇలా మాట్లాడడం సబబేనా అంటూ మండిపడ్డారు. సీఎం స్థాయిలో ఉన్న వారు వాస్తవాలను తెలుసుకోకుండా ఇలా మాట్లాడుతారా అంటూ నిప్పులు చెరిగారు. ఇంతకీ ఆయన బాధ ఏంటి అంటే కేసీయార్ తాజాగా ప్రెస్ మీట్ పెట్టి బీజేపీని చెడా మడా తిట్టేశారు. ఆ ఫ్లోలో ఆయన చాలా మంది పేర్లు కూడా ప్రస్థావనకు తెచ్చారు.

బ్యాంక్  దొంగలకు బీజేపీ మద్దతు ఇస్తోందని కేసీయార్ ఫైర్ అయ్యారు. బయట పార్టీలలో ఉంటే వారు ఆర్ధిక నేరస్తులు,  అదే బీజేపీలో చేరితే మాత్రం వాషింగ్ పౌడర్ నిర్మా అన్న తరహాలో పునీతులు అయిపోతారు అని సెటైర్లు వేశారు. అలా బీజేపీలోకి దూకి కేసులు లేకుండా చేసుకున్న వారు అంటూ  తెలుగు నాట రాజకీయ నేతలైన సుజనా చౌదరిని, సీఎం రమేష్ పేరుని ఆయన ప్రస్తావించారు. దాంతోనే ఇపుడు సీఎం రమేష్ కి మండుకొచ్చింది అన్న మాట.

ఆయన కేసీయార్ మాటలకు ధీటుగా బదులిస్తూ అయ్యా కేసీయార్ గారు నేను అలాంటి వాడినా అంటూ నిలదీశారు. నాపైన ఒక్క కేసు అయినా ఉందా అని కూడా అడిగారు. తాను కేసుల భయంలో బీజేపీలో చేరినట్లుగా కేసీయార్ చేసిన కామెంట్స్ తప్పు అని అన్నారు. తన మీద ఎలాంటి కేసులు లేవని కూడా ఆయన చెప్పుకున్నారు. సీఎం స్థాయిలో ఉన్న కేసీయార్ నిజాలు తెలుసుకుని మాట్లాడితే మంచిదని కూడా సూచించారు.

కేసీయార్ తన వ్యాఖ్యలను సరిచేసుకోవాల‌ని, తన మీద కేసులు ఉంటే నిరూపించాలని కూడా సీఎం రమేష్ సవాల్ చేశారు. అవును మరి ఆయన అసలే సీఎం రమేష్. ఊరుకుంటారా. తన మీద కేసులు లేవని, బీజేపీ మీద ప్రేమతోనే ఆ పార్టీలో చేరానని చెప్పుకున్నారు. మరి దీని మీద కేసీయార్ ఏమంటారో.

ఏదేమైనా  కేసీయార్ మాటల ప్రవాహానికి అడ్డుపడి నిలదీసే వారు ఎవరూ పెద్దగా  ఉండరు. కానీ సీఎం రమేష్  మాత్రం నేను నిఖార్సైన వాడిని అని చెబుతున్నారు. ఇపుడు కేసీయార్ తాను అన్న మాటలు రేటో తప్పో చెప్పాల్సి ఉంటుందని అంటున్నారు.
Tags:    

Similar News