షాకింగ్ అప్ డేట్... కింగ్ చార్లెస్ పట్టాభిషేకానికి ఖర్చెంతో తెలుసా?

యునైటెడ్ కింగ్ డమ్ కింగ్ చార్లెస్ పట్టాభిషేకానికి అక్షరాలా 72 మిలియన్ పౌండ్లు ఖర్చు చేసిన విషయం అధికారంగా వెలుగులోకి రావడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది

Update: 2024-11-22 23:30 GMT

యునైటెడ్ కింగ్ డమ్ కింగ్ చార్లెస్ పట్టాభిషేకానికి అక్షరాలా 72 మిలియన్ పౌండ్లు ఖర్చు చేసిన విషయం అధికారంగా వెలుగులోకి రావడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు డిపార్ట్ మెంట్ ఫర్ కల్చర్, మీడియా అండ్ స్పోర్ట్స్ (డీసీఎంఎస్) కీలక విషయాలు వెల్లడించింది! ఒక తరంలో ఒక్కసారే జరిగే కార్యక్రమంగా దీన్ని అభివర్ణించింది.

అవును... కింగ్ చార్లెస్ పట్టాభిషేకానికి 72 మిలియన్ పౌండ్లు ఖర్చు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. అంటే... భారతీయ కరెన్సీ ప్రకారం అక్షరాలా రూ.765 కోట్లు అన్నమాట. ఈ మేరకు డీసీఎంఎస్ కీలక విషయాలు వెల్లడించింది. ఇందులో భాగంగా... 50 మిలియన్ పౌండ్లు డీసీఎంఎస్ ద్వారా ఖర్చు చేసినట్లు తెలిపింది.

ఇదే సమయంలో.. మిగిలిన 22 మిలియన్ పౌండ్లు పోలీసింగ్ కు ఖర్చు అయినట్లు వెల్లడించింది. అయితే... పట్టాభిషేకానికి నెల ముందు "యూగోవ్" నిర్వహించిన పోల్ లో సుమారు 52% మంది లండన్ ప్రజలు.. ఈ పట్టాభిషేకానికి పన్ను చెల్లింపుదారులు చెల్లించాల్సిన అవసరం లేదని తేలిందని అంటున్నారు.

తాజాగా డీసీఎంఎస్ విడుదల చేసిన వార్షిక అకౌంట్స్ నివేదిక ప్రకారం... పట్టాభిషేకాన్ని సుమారు 125 దేశాలలో రెండు బిలియన్ల మంది ప్రపంచ ప్రేక్షకులు తిలకించారని తెలిపింది. ఇది ప్రపంచానికి తమ జాతీయ గుర్తింపును ప్రదర్శించడానికి ఓ ప్రత్యేకమైన అవకాశాన్ని అందిపుచ్చుకోవడంగా పేర్కొంది.

మరోపక్క... ఈ పట్టాభిషేకాన్ని అర్ధరహితమైన, పురాతనమైన కవాతుగా పేర్కొంటూ.. ఖర్చు చేసిన డబ్బును ఉచిత పాఠశాల భోజనం కోసం చెల్లించవచ్చని క్యాంపెయిన్ గ్రూప్ రిపబ్లిక్ పేర్కొంది. చాలామంది ప్రజలు జీవన వ్యయ సంక్షోభంతో పోరాడుతున్న సమయంలో ఈ అర్ధంలేని కోలాహలం సిగ్గుచేటని పేర్కొంది!

కాగా... బ్రిటన్ కింగ్ చార్లెస్ పట్టాభిషేకం వెస్ట్ మినిస్టర్ అబే లో 2023 మే 6న జరిగిన సంగతి తెలిసిందే. 2022 సెప్టెంబర్ లో తల్లి ఎలిజబెత్-2 మరణించడంతో చార్లెస్.. రాజు అయ్యారు. వెస్ట్ మినిస్టర్ అబేలో సాంప్రదాయబద్ధంగా ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు భారత ఉపరాష్ట్రపతి జగదీశ్ ధన్కర్ హాజరయ్యారు!

Tags:    

Similar News