ఏపీలో అధికార పార్టీగా కొనసాగుతున్న టీడీపీలో ఉన్న నేతల పరిస్థితిపై ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతోంది. బయటకు గొప్ప పోరాట యోధులుగా చెప్పుకుంటున్న ఈ పార్టీ నేతలు... కీలక విషయాలపై కనీస అవగాహన లేకుండానే బయటకు వచ్చేస్తున్న వైనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయిందని చెప్పక తప్పదు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగానే కాకుండా చట్టసభలో దొడ్డిదారిన అడుగుపెట్టి... ఏకంగా మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినట్లుగా విమర్శలు ఎదుర్కొన్న నారా లోకేశ్... మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే జరిగిన ఓ కీలక కార్యక్రమంలో పాలుపంచుకున్న సందర్భంగా నాలిక మడత పెట్టేశారు. ఆ ఘటనతో ఆయనను నెటిజన్లతో పాటు సామాన్య జనం కూడా బాగానే ఏసుకున్నారని చెప్పక తప్పదు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఏటా ఏప్రిల్ 14న నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సరిగ్గా ఏడాది క్రితం జరిగిన అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమంలో పాలుపంచుకున్న లోకేశ్... అంబేద్కర్ జయంతిని వర్ధంతిగా పలికి అభాసుపాయ్యారు.
జయంతికి, వర్ధంతికి తేడా తెలియని లోకేశ్ మంత్రి ఎలా అయ్యారోనన్న నాడు పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. అయితే అంతకుముందు కూడా తన నాలికను మడతపెట్టేసుకుని సొంత పార్టీ టీడీపీని నమ్మక ద్రోహం చేసిన పార్టీగా అభివర్ణించిన ఆయన తీరును గుర్తు చేసుకున్న జనం... లోకేశ్ నుంచి ఇంతకంటే ఎక్కువగా ఏం ఆశిస్తాంలే అన్న రీతిలో సెటైర్లు పేలిపోయాయి. సరిగ్గా... ఇప్పుడు కూడా అదే తరహాలో మరో టీడీపీ కీలక నేత నాలిక మడతపెట్టేసుకుని లోకేశ్ మాదిరే విమర్శల సుడిగుండంలో చిక్కుకుపోయారు. ఆయన మరెవరో కాదు... పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి అత్యంత సన్నిహితుడిగానే కాకుండా పార్టీ వ్యవహారాల్లో చక్రం తిప్పుతున్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్. తన సొంత జిల్లా కడపలో నిన్న జరిగిన అంబేద్కర్ జయంతి కార్యక్రమాల్లో రమేశ్ ఎంపీ హోదాలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడేందుకు అమితాసక్తి చూపిన సీఎం రమేశ్... లోకేశ్ మాదిరే అంబేద్కర్ జయంతిని వర్ధంతిని చేసేశారు. అయినా కూడా ఏమాత్రం తడబాటు లేకుండా ఆయన తనదైన శైలిలో ప్రసంగించుకుంటూ వెళ్లిపోయారు. ఇటీవలే రాజ్యసభ సభ్యత్వ గడువు ముగిసిన నేపథ్యంలో తన ప్రమేయం లేకుండానే రెండో దఫా కూడా రాజ్యసభ సభ్యత్వాన్ని దక్కించుకున్న సీఎం రమేశ్... జయంతిని వర్ధంతిగా అభివర్ణించేసిన తీరు ఇప్పుడు నిజంగానే ఆసక్తికరంగా మారింది.
రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్‌కు సంబంధించిన ముఖ్య కార్యక్రమాలను కూడా సరిగా గుర్తు పెట్టుకోలేని ఇలాంటి నేతనా టీడీపీ రెండో దఫా రాజ్యసభకు పంపిందన్న చర్చకూ ఇప్పుడు తెర లేచిందని చెప్పాలి. అయినా ఏ విషయంపైనా అంతగా అవగాహన లేని నేతలు అధికంగా ఉన్న పార్టీగా ఇప్పుడు టీడీపీ మరో అపకీర్తిని మూటగట్టుకున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో నాలిక మడత పెట్టేసుకున్న నారా లోకేశ్ ను నెటిజన్లు *పప్పు*గా అభివర్ణించిన వైనం మనకు తెలిసిందే కదా. ఆ వ్యాఖ్యలపై నాడు తమదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేశ్, ఇతర టీడీపీ నేతలు ఆ తర్వాత తప్పు మన దగ్గర పెట్టుకుని ఎదుటి వారిని ఏమంటాంలే అన్న కోణంలో సద్దుమణగక తప్పలేదన్న వాదన వినిపించింది. తాజాగా లోకేశ్ మాదిరే సీఎం రమేశ్ కూడా నాలిక మడపెట్టేసుకుని టీడీపీలో మరో *పప్పు*గా మారిపోయారన్న సెటైర్లు కూడా బాగానే వైరల్ అవుతున్నాయి. మొత్తంగా సీఎం రమేశ్ తన అజ్ఞానంతో పార్టీతో పాటు తన వ్యక్తిగత ప్రతిష్ఠను మంటగలిపేసుకోవడంతో పాటుగా మరోమారు లోకేశ్ నాలిక మడతను గుర్తు చేశారన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
వీడియో చూడటానికి క్లిక్ చేయండి