కరోనా వేళ మరణించిన హాస్యనటుడి పేరును ఆ వీధికి పెట్టిన సీఎం స్టాలిన్

Update: 2022-05-03 05:19 GMT
తమిళ సినిమాల్లో హాస్య నటుడిగా వందలాది సినిమాల్లో నటించి.. తన హాస్యచతురతతో ప్రేక్షకులకు నవ్వులు పంచిన హాస్యనటుడు వివేక్ ఆ మధ్యన మరణించటం తెలిసిందే. మహమ్మారి కరోనా బారిన పడి.. ఆ తర్వాత మరణించిన ఎంతో మంది ప్రముఖుల్లో హాస్య నటుడు వివేక్ ఒకరు. తెలుగు ప్రేక్షకులకు వివేక్ పేరు పెద్దగా రిజిస్టర్ కాకున్నా.. ఆయన్ను చూసినంతనే ఇట్టే గుర్తు పట్టేసే ఆయనకు తెలుగు ప్రేక్షకుల్లోనూ చాలామంది అభిమానులు ఉన్నారు.

తాను జీవించినంత కాలం సినిమాల్లో తన నటనతో హాస్యాన్ని పండించిన వివేక్.. కరోనా బారిన పడటం.. కోలుకున్న తర్వాత గుండెపోటుతో అర్థాంతరంగా తనువు చాలించారు. ఆయన మరణం అప్పట్లో కోలీవుడ్ కు షాకింగ్ గా మారింది.

చిన్న వయసులోనే అకాల మరణం పొందిన వివేక్ ఉదంతాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోయారు. ఇదిలా ఉంటే తాజాగా వివేక్ సతీమణి సీఎం స్టాలిన్ ను కలిశారు.

తన భర్త పేరును ఆయన నివసించిన ప్రాంతంలోని వీధికి పెట్టాల్సిందిగా వివేక్ సతీమణి ఆరుల్ సెల్వి కోరారు. సీఎం స్టాలిన్ ను కలిసిన సందర్భంలో ఆమెతో పాటు కుమార్తె కూడా ఉన్నారు. దీనికి స్పందించిన సీఎం స్టాలిన్..  చెన్నైలోని విరుగంబాక్కం ప్రాంతంలో నివసించిన వివేక్ పేరును ఒక వీధీకి 'చిన్న కలైవరన్ వివేక్' రోడ్డుగా పేరు పెడుతూ నిర్ణయం తీసుకున్నారు.

దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వును గ్రేటర్ చెన్నైకార్పొరేషర్ సిఫార్సు చేయటంతో ఆడ్మినిస్ట్రేషన్.. వాటర్ సప్లయి విభాగం జారీ చేసింది. తన భర్త పేరును ఆయన నివసించిన వీధికి పెట్టాలంటూ వారం క్రితం సీఎం స్టాలిన్ ను కలవటం.. తన భర్తకు గౌరవంగా పేరు పెట్టాలన్న అభ్యర్థనకు సానుకూలంగా స్పందించి.. వాయువేగంతో ఆ పని పూర్తి చేయటం నిజంగా గొప్పనే చెప్పాలి.

ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారన్న మాట చాలామంది నోటి నుంచి వింటాం. కానీ.. అందుకు భిన్నంగా కోరిన పనిని కోరుకున్నట్లుగా పూర్తి చేయటం.. అది కూడా ఏడురోజుల వ్యవధిలోనే కావటం విశేషంగా చెప్పక తప్పదు.
Tags:    

Similar News