100 డేస్.. ఉద్ధ‌వ్ ఠాక్రే, హిందుత్వ మార్కు మొక్కు!

Update: 2020-03-07 04:06 GMT
ఒక‌వైపు కాంగ్రెస్, ఎన్సీపీల‌తో చేతులు క‌లిపింది శివ‌సేన‌. ఈ నేప‌థ్యంలో ఆ పార్టీ కాషాయ‌వాదం కొంత వ‌ర‌కూ వీగిపోయింద‌నే అభిప్రాయాలున్నాయి. బీజేపీతో క‌లిసి ఉంటూ వ‌చ్చింది సేన‌. కొన్ని కొన్ని అంశాల్లో క‌మ‌లం పార్టీతో విబేధించినా సేన కాషాయ‌వాద పార్టీగానే, హిందుత్వ పార్టీగానే సాగింది. అయితే అధికారం అందుకోవ‌డానికి శివ‌సేన చివ‌ర‌కు బీజేపీతో తెగ‌దెంపులు చేసుకుంది. బీజేపీ చిర‌కాల శ‌త్రువులు కాంగ్రెస్, ఎన్సీపీల‌తో సేన చేతులు క‌లిపింది.

అలా ప్ర‌భుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఎన్నిక‌ల్లో త‌మ‌తో క‌లిసి పోటీ చేసి కాంగ్రెస్, ఎన్సీపీల‌తో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన సేన‌ను బీజేపీ బ్లేమ్ చేస్తూ ఉంది. హిందుత్వ ఇమేజ్ ఇక త‌మ‌కే సొంతం అన్న‌ట్టుగా భార‌తీయ జ‌న‌తా పార్టీ స్పందిస్తూ ఉంది. అయితే ఆ ఇమేజ్ ను వ‌దులుకోవ‌డానికి సేన సిద్ధంగా లేద‌ని మాత్రం స్పష్టం అవుతోంది. హిందుత్వ ఓటు బ్యాంకును పూర్తిగా దూరం చేసుకోకుండా ఉండ‌టానికి సేన త‌న‌దైన ఎత్తుగ‌డ‌ల‌ను వేస్తున్న‌ట్టుగా ఉంది.

అందులో భాగ‌మే మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ ఠాక్రే అయోధ్య ప‌ర్య‌ట‌న అనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. మ‌హారాష్ట్ర‌లో కాంగ్రెస్, ఎన్సీపీ, శివ‌సేన‌ల కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల పాల‌న‌ను పూర్తి చేసుకుంది. ఈ నేప‌థ్యంలో అయోద్య‌ను సంద‌ర్శించి, అక్క‌డ జ‌రిగే కార్య‌క్ర‌మాల్లో పంచుకుంటున్నారు ఉద్ధ‌వ్ ఠాక్రే. త‌మ కూట‌మి ప్ర‌భుత్వం విజ‌య‌వంతంగా న‌డిస్తే అయోధ్య‌ను సంద‌ర్శిస్తానంటూ ప్ర‌భుత్వ ఏర్పాటు స‌మ‌యం లోనే ఉద్ధ‌వ్ ప్ర‌క‌టించార‌ట‌. ఈ నేప‌థ్యం లో వంద రోజులు పూర్తైన ప‌రిణామాల్లో.. ఆయ‌న యూపీ వెళ్లి అయోధ్య‌ను ద‌ర్శించుకుంటున్నారు. ఆయ‌న ప‌ర్య‌ట‌న‌ కు యూపీలోని యోగి ఆదిత్య‌నాథ్ స‌ర్కారు అన్ని ఏర్పాట్ల‌నూ చేసిన‌ట్టు గా స‌మాచారం.
Tags:    

Similar News