సీఎం యోగి స్టైలే వేరప్పా.. లాఠీ ఛార్జికి 'రిటర్న్ గిప్టు' పేరుతో ట్వీట్

Update: 2022-06-13 04:29 GMT
కారణం ఏదైనా కానీ.. నిరసనకారులు.. ఆందోళనకారులపై పోలీసులు జరిపే లాఠీ ఛార్జిపై వ్యతిరేకత వ్యక్తమవుతుంటుంది. పోలీసుల తీరును తీవ్రంగా తప్పు పట్టటం చూస్తుంటాం. అందుకు భిన్నంగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యవహరిస్తున్న ధోరణి రోటీన్ కు భిన్నంగా ఉంటోంది. ఇప్పటికే అల్లర్లు.. గొడవలకు పాల్పడే నిందితుల ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్న ఆయన.. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశారు.

ఇటీవల కాలంలో బీజేపీకి చెందిన నేతలు నూపుర్‌ శర్మ, జిందాల్‌(వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు) మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. దీనిపై  పెద్ద ఎత్తున నిరసనలు.. ఆందోనలు చోటు చేసుకుంటున్నాయి.

ఇందులో భాగంగా కొందరు చెలరేగిపోయి అల్లర్లకు దిగుతున్నారు. ఆస్తుల ధ్వంసానికి పాల్పడుతున్నారు. ఇలాంటి వాటిపై తీవ్రంగా రియాక్టు అయిన యోగి సర్కార్ తాజాగా వ్యవహరించిన ధోరణి రోటీన్ కు భిన్నంగా మారింది.

ప్రయాగ్ రాజ్.. కాన్పూర్ తదితర ప్రాంతాల్లో మొన్న శుక్రవారం జరిగిన అల్లర్లు.. విధ్వంస ఘటనలకు కారణమైన వ్యక్తుల అక్రమ నిర్మాణాల్ని అధికారులు బుల్ డోజర్లు పెట్టి కూల్చేస్తున్నారు. శనివారం మొదలైన ఈ కూల్చివేతలు.. ఆదివారం సైతం కొనసాగాయి. ప్రయాగ్ రాజ్ అల్లర్ల సూత్రధారి జావేద్ అహ్మద్ అక్రమంగా నిర్మించిన ఇంటిని సైతం కూల్చేశారు. అంతే కాదు.. షహరాన్ పూర్ లోనూ ఇద్దరు నిందితుల అక్రమ నిర్మాణాల్ని కూల్చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. మరో దూకుడు చర్యను యోగి సర్కారు చేపట్టింది.

నిరసనల పేరుతో చెలరేగిపోతున్న ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు లాఠీ చార్జి చేశారు. దీనికి సంబంధించిన 30 సెకన్ల వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనికి ట్యాగ్ లైన్ గా.. అల్లరిమూకలకు రిటర్న్ గిప్టు పేరుతో పోస్టు చేశారు. ఈ తీరుపై విస్మయం వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు పోలీసుల లాఠీ చార్జిలతో ప్రభుత్వాలకు తలనొప్పులు రావటం తెలిసిందే.

అందుకు భిన్నంగా యోగి మాష్టారు మాత్రం.. దాన్ని తనకు మైలేజీగా మార్చుకునే ప్రయత్నం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో పోస్టు చేసిన చిట్టి వీడియోపై మిశ్రమ స్పందన వచ్చిన తీరు చూస్తే.. ప్రభుత్వానికి.. ప్రభుత్వ చర్యలకు ప్రజల నుంచి కూడా అంతో ఇంతో మద్దతు ఉందనే చెప్పాలి. యోగి సర్కారా మజాకానా?
Tags:    

Similar News