గృహ నిర్మాణంలో జగన్ కొత్త చరిత్ర

Update: 2020-03-07 06:19 GMT
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దూసుకెళ్తున్నారు. ఇప్పుడు మరో చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడు లేనట్టు పెద్ద సంఖ్యలో పేదలకు ఇళ్లను నిర్మించి ఇవ్వనున్నాడు. ఈ మేరకు త్వరలోనే పనులు మొదలు పెట్టే అవకాశం ఉంది. గృహ నిర్మాణ శాఖపై శుక్రవారం ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి లోని తన క్యాంపు కార్యాలయం లో సీఎం జగన్ సంబంధిత శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు, అధికారులతో సమావేశమై ఇళ్ల నిర్మాణం పై చర్చించారు. ఇల్లు లేని పేదలకు సొంతింటి కలను 2024 నాటికి తీర్చేలా ప్రణాళికలను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఈ ఉగాదికి పేదలకు 26.6 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి ఏర్పాట్లు ముమ్మరం చేయాలని సూచించారు. ఈ పట్టాల పంపిణీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని జగన్ స్వయంగా ఆహ్వానించారు. ప్రధాని వస్తే ఈ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించాలని భావిస్తున్నారు.

నాలుగేళ్లలో రాష్ట్రంలో 30 లక్షల గృహాలు నిర్మించి పేదలకు ఇవ్వాలని గొప్ప సంకల్పాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఈ మేరకు శరవేగంగా చర్యలు చేపట్టింది. నాలుగేళ్లలో వీటి నిర్మాణం పూర్తి పేదలకు అందించేందుకు పనులు వేగిరం చేయాలని సీఎం ఇంజనీర్లు, అధికారులకు ఆదేశించారు. ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు నిర్మించి ఇవ్వాల్సిన ఇళ్లపై పూర్తి స్థాయిలో అధికారులతో చర్చించారు. ఈ సందర్భం గా రాష్ట్రంలో ఎంతమందికి నివాసాలు ఉన్నాయి? కేంద్రం ద్వారా ఎన్ని పూర్తయ్యాయి? గత ప్రభుత్వంలో ఏ మేరకు ఉన్నాయి? ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయనే అంశాలను అధికారులతో అడిగి తెలుసుకున్నారు.

ప్రస్తుతం పట్టాలు పొందే పేదలతో పాటు సొంతంగా ఇళ్ల స్థలాలున్న వారికి ఇళ్లు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆ ఇంటిలో ఒక పడక గది, వంట గది, వరండా, మరుగుదొడ్డి ఉండేలా చూసుకోవాలని సీఎం జగన్ డిజైన్‌ తయారీ చేసి చూపించారు. ఆ ఇళ్లన్నీ ఒకే నమూనాలో నాణ్యంగా, అందంగా ఉండేలా నిర్మించాలని చెప్పారు. ఆ నిర్మించిన ఇళ్లకు వైఎస్సార్‌ జగనన్న కాలనీల పేరు పెట్టాలని సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. పేదల కోసం నిర్మిస్తున్న కాలనీల్లో పెద్ద ఎత్తున మొక్కల పెంపకంతో పాటు సమగ్ర మురుగునీటి వ్యవస్థ ఏర్పాటు చేయాలని, కాలనీల్లో విద్యుత్, తాగునీటి సదుపాయాలు కల్పించాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఆదర్శవంతంగా ఆ ఇంటి నిర్మాణాలను తీర్చిదిద్ది ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉండేలా చేయాలని జగన్ తెలిపారు.
Tags:    

Similar News