ఎల్.రమణ వర్సెస్ ఉమామాధవరెడ్డి

Update: 2015-12-02 06:45 GMT
తెలంగాణ టీడీపీ నేతల మధ్య వివాదాలు పెరుగుతున్నాయి. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టుగా మోత్కుపల్లి నర్సింహులు - ఉమామాధవరెడ్డిల మధ్య వివాదం కాస్తా టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ వైపు మళ్లింది.
    
నల్గొండ జిల్లాకు చెందిన టిడిపి రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులైన మోత్కుపల్లి నరసింహులు, ఎలిమినేటి ఉమామాధవరెడ్డిల మధ్య సాగుతున్న రాజకీయ ఆధిపత్య పోరు కాస్త ఎల్.రమణ మెడకు చుట్టుకుంది.  ఆలూలేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా ప్రతిపాదిత కొత్త జిల్లా కేంద్రాల వివాదం కాస్తా తీవ్రతరమైంది. రమణ మొదటి నుండి కూడా మోత్కుపల్లికి అనుకూలంగా వ్యవహరిస్తూ తమ వర్గానికి నష్టం చేకూర్చేలా వ్యవహరిస్తున్నాడన్న అసంతృప్తితో ఉన్న ఉమామాధవరెడ్డి చివరకు బహిరంగంగానే తన అసంతృప్తి గళాన్ని వినిపించడం టి.టిడిపిలో ప్రకంపనలు రేపింది.
   
యాదగిరిగుట్టను కొత్త జిల్లా కేంద్రంగా చేయాలని మోత్కుపల్లి - భువనగిరినే కొత్త జిల్లా కేంద్రంగా చేయాలని ఉమామాధవరెడ్డిలు కొంత కాలంగా డిమాండ్ చేస్తూ ఆందోళనలు సాగిస్తున్నారు. మోత్కుపల్లి ఒక అడుగు ముందుకేసి యాదాద్రి జిల్లా కోసం పాదయాత్ర చేపట్టి మంగళవారం గుట్టలో ఒక రోజు దీక్ష సైతం నిర్వహించారు. మోత్కుపల్లి దీక్షకు టి.టిడి పి అధ్యక్షుడు ఎల్. రమణ హాజరై యాదాద్రి జిల్లా కేంద్రం డిమాండ్‌కు టిడిపి మద్దతునిస్తున్నట్లుగా తెలిపారు. ఈ పరిణామం కాస్తా ఉమామాధవరెడ్డిని తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. రాష్ట్ర పార్టీలో చర్చించకుండా ఏకపక్షంగా రమణ యాదాద్రి జిల్లా కేంద్రం డిమాండ్‌ కు పార్టీ మద్దతునిస్తున్నట్లుగా ఎలా ప్రకటిస్తారంటూ ఉమా బహిరంగంగానే మీడియా ద్వారా నిలదీశారు. రెండు వర్గాల మధ్య వివాదాలు సాగుతున్నప్పడు రాష్ట్ర అధ్యక్షుడిగా సంయమనం పాటించాల్సిన రమణ ఏకపక్షంగా మోత్కుపల్లి నిర్ణయాలను అనుసరిస్తుండటం పరోక్షంగా తమను రాజకీయంగా నష్టపరచడమే అవుతుందంటూ ఆమె అసహనం వెళ్లగక్కింది. ఇప్పటికే రమణ ఏకపక్ష వైఖరిపై పార్టీ అధినేత ఎన్. చంద్రబాబునాయుడి దృష్టికి తీసుకెళ్లిన ఉమా మరోసారి తాజా పరిణామాలపై ఆయనకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లా కేంద్రానికి కావాల్సిన అన్ని హంగులు భువనగిరికి ఉన్నాయని అందుకే తాను భువనగిరిని కొత్త జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతున్నామని ఉమ వాదన. కేవలం పుణ్యక్షేత్రమన్న ఒకేఒక్క కారణంతో యాదాద్రిని జిల్లాగా మార్చాలన్న మోత్కుపల్లి వాదనకు రమణ మద్దతునివ్వడం అర్థరహితమ ని ఉమా అభ్యంతరం చెప్తున్నారు. ఈ నేపధ్యం లో మోత్కుపల్లి, ఉమల మధ్య సాగుతున్న కొత్త జిల్లా కేంద్రాల వివాదంలో ఇప్పుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ కూడా చేరిపోవడంతో ఈ పరిణామాలు టి.టిడిపిలో ఎలాంటి ముసలం పుట్టిస్తారో... అసలే ఆకర్షణ మంత్రం వేస్తున్న టీఆరెస్ దీన్ని ఎలా ఉపయోగించుకుంటుందో అన్న వాదన వినిపిస్తోంది.
Tags:    

Similar News