జ‌గ‌న్ కేబినెట్‌ లోకి పోసాని...క‌న్ ఫర్మ్ చేసిన పృథ్వి

Update: 2019-08-04 16:13 GMT
ఇటీవ‌ల ఏపీలో జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌ల్లో సినీన‌టుల్లో చాలా మంది టీడీపీకే స‌పోర్ట్ చేశారు. ఇంకా చెప్పాలంటే ఇండ‌స్ట్రీ పెద్ద‌లు అంద‌రూ చంద్ర‌బాబే మ‌ళ్లీ ఏపీ సీఎం కావాల‌ని కూడా కోరుకున్నారు. వీరంతా బ‌య‌ట‌ప‌డి ప్ర‌చారం చేయ‌క‌పోయినా చంద్ర‌బాబుతో వాళ్ల‌కు ఉన్న అనుబంధం అలాంటిది. అయితే వీళ్ల ఆశ‌లు అడియాస‌ల‌య్యేలా ఏపీ ఓట‌రు షాకింగ్ తీర్పు ఇచ్చారు. జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి భారీ మెజార్టీతో ఏపీ సీఎం అయ్యారు. ఇండ‌స్ట్రీలో క‌మ్మ వ‌ర్గం వాళ్లు ఎక్కువుగా ఉండ‌డంతో స‌హ‌జంగానే వాళ్లంతా టీడీపీయే గెల‌వాల‌ని కోరుకున్నారు.

ఇండ‌స్ట్రీలో పెద్ద త‌ల‌కాయ‌ల‌ను ప‌క్క‌న పెడితే కొంద‌రు మాత్ర‌మే డేరింగ్‌ గా వైసీపీకి స‌పోర్ట్ చేశారు. వీరిలో 30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ పృథ్వి - పోసాని కృష్ణ‌ముర‌ళి - ఆలీ - జీవితా రాజ‌శేఖ‌ర్ దంప‌తులు - రాజా - సీనియ‌ర్ న‌టి జ‌య‌సుధ త‌దిత‌రులు వైసీపీకి స‌పోర్ట్ చేశారు. ఇక మోహ‌న్‌బాబుకు జ‌గ‌న్‌కు ఎలాగూ బంధుత్వం ఉండ‌డంతో ఆయ‌న కూడా చివ‌ర్లో పార్టీలో చేరి వైసీపీ కోసం ప్ర‌చారం చేశారు.

వీరంద‌రి క‌న్నా పృథ్వి - పోసాని మాత్ర‌మే చంద్ర‌బాబు - టీడీపీపై దారుణ‌మైన విమ‌ర్శ‌లు చేశారు. ఇక జ‌గ‌న్ కూడా అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ఎస్‌ వీబీసీ ఛానెల్ చైర్మన్‌ గా పృథ్వీని నియ‌మించారు. అనంత‌రం పృథ్వి మాట్లాడుతూ ఇండ‌స్ట్రీలో చాలా మంది ప్ర‌ముఖుల‌కు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం కావడం ఇష్టంలేదని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఇండ‌స్ట్రీ వాళ్లు ఎవ్వ‌రూ జ‌గ‌న్‌కు క‌నీసం శుభాకాంక్ష‌లు కూడా చెప్ప‌క‌పోవ‌డం కూడా ఈ వ్యాఖ్య‌ల‌కు ఊత‌మిచ్చేదే. ఆ త‌ర్వాత పృథ్వి సినిమా వాళ్లెవ్వ‌ర‌కు ఓట్లు కూడా వేయ‌వ‌ద్ద‌ని చెప్పారు.

ఇక ఇదే అంశంపై పోసాని మాట్లాడుతూ ఈ వ్యాఖ్యల్ని పోసాని కృష్ణమురళి ఖండించారు. పృథ్వి తొందరపడి మాట్లాడాడని వ్యాఖ్యానించారు. సురేష్‌ బాబు లాంటి వాళ్లు జ‌గ‌న్ అపాయింట్‌ మెంట్ కూడా తీసుకున్నార‌ని చెప్పారు. దీంతో పోసానికి - పృథ్వికి గ్యాప్ ఉంద‌న్న ప్ర‌చారం జ‌రిగింది. దీనిపై ఆదివారం ప్రెస్‌ మీట్ లో మాట్లాడిన పృథ్వి పోసాని కృష్ణమురళి నా సోదరుడి లాంటివాడ‌ని... వైసిపిలో తామంతా ఓ ఫ్యామిలీ... పోసాని నన్ను ఓ మాట అన్నా నాకు పర్వాలేదని చెప్పారు. అక్క‌డితో ఆగ‌కుండా జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి గారు త‌న కేబినెట్‌ లో పోసానికి చోటు క‌ల్పించినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఇక పోసాని మాత్రం త‌న‌కు ప‌ద‌వులు అవ‌స‌రం లేద‌ని గ‌తంలోనే చెప్పారు. అయితే ఆయ‌న గ‌తంలో రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ఎన్నిక‌ల్లో కూడా పోటీ చేశారు. ప్ర‌జారాజ్యం నుంచి చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. మ‌రి ఇప్పుడు వైసీపీలో యాక్టివ్‌ గా ఉన్నా జ‌గ‌న్ ఆయ‌న‌కు ఏదైనా ప‌ద‌వి ఇస్తారా ?  లేదా ? అన్న‌దానికి కాల‌మే స‌మాధానం చెప్పాలి.


Tags:    

Similar News