వచ్చేస్తున్నాడు.. జూనియర్ టెండూల్కర్.. నేడే ఐపీఎల్ అరంగేట్రం

Update: 2022-04-30 09:30 GMT
వ్యాపారాల్లో అయినా, రాజకీయాల్లో అయినా, క్రీడల్లో అయినా.. తండ్రికి తగ్గ తనయులు కొద్దిమందే ఉంటారు. తండ్రి అధిరోహించిన శిఖరాలు, సాధించిన ఘనతలు, రికార్డులు ఏవైనా సరే అందుకోగలిగేవారు అతికొద్దిమందే ఉంటారు. అయితే, ఇక్కడ అసలు తండ్రితో కొడుకును పోల్చడం చాలా తప్పు. ఎవరి తరం వారిది. ఎవరి ప్రత్యేకత వారిది. ఒకరు సాధించినదానిని మరొకరు సాధించాలని ఏమీ లేదు.

కానీ, మన సమాజంలో ఎక్కువ శాతం చేసేది తండ్రీ కొడుకులను పోల్చడమే. ఇదంతా ఎందుకు అంటే.. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ శనివారం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అరంగేట్రం చేయనున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగే మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆల్ రౌండర్ అర్జున్ టెండూల్కర్ బరిలో దిగనున్నాడు.

గుజరాత్ చేజారి.. ముంబైకి చిక్కి 22 ఏళ్ల అర్జున్ టెండూల్కర్ ఇప్పటివరకు ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా 2 టి0ల్లో ముంబైకి ప్రాతినిధ్యం వహించాడు. గతేడాది హరియాణతో జరిగిన మ్యాచ్ లో అర్జున్ అరంగేట్రం చేశాడు. రెండు మ్యాచ్ ల్లో రెండు వికెట్లు పడగొట్టాడు. పరుగుల ఎకనామీ 9.57. వికెట్ సగటు 33.5. ఏవిధంగా చూసినా ఈ ప్రదర్శన సాదాసీదానే. ఇక 2018 అండర్ 19 ప్రపంచ కప్ లో అర్జున్ తొలిసారిగా టీమిండియా స్థాయిలో ప్రాతినిధ్యం వహించాడు. అన్ని మ్యాచ్ లు అడే అవకాశం రాకున్నా.. బరిలో దిగిన మ్యాచ్ ల్లోనూ అతడు పెద్దగా రాణించింది లేదు.

పొడగరి.. ఎడమచేతివాటం ఆల్ రౌండర్ సచిన్ ఎత్తు 5.5 అడుగులకు కాస్త పైన . బౌలింగ్ కుడిచేతి వాటం. కానీ, రోజువారీ జీవితంలో ఎడమచేతివాటం అధికం. అయితే, అతడి శిఖర సమాన ప్రతిభకు ఇవేమీ అడ్డుకాలేదు. ఒకవిధంగా చెప్పాలంటే ఎందులోనూ వంకపెట్టలేని బ్యాటింగ్ ప్రతిభ అతడిది. అందుకే క్రికెట్ దేవుడు అయ్యాడు. ఇక తన అనుభవాలను, భవిష్యత్ క్రికెట్ అవసరాలను గుర్తించాడో ఏమో.. తన కుమారుడు అర్జున్ ను సచిన్ క్రికెట్ లో భిన్నంగా తీర్చిదిద్దాడు. అంతేకాదు.. అర్జున్ టెండూల్కర్ ఎత్తు 6.2 అడుగులు (1.91 మీటర్లు). మంచి పేసర్ కు ఉండాల్సిన ఎత్తు ఇది. ఇక అర్జున్ ఎడమచేతి వాటం బౌలర్. ఎడమచేతివాటం పేసర్.

ప్రతిభ చాటింది అంతంతే ఎంత సచిన్ కుమారుడు అయినా.. ప్రతిభ ఉంటేనే గుర్తింపు. ఈ విషయంలో అర్జున్ కు అంత పేరు రాలేదనేది స్పష్టం. అతడు రాణించింది కూడా గొప్పగా ఏమీ లేదు. కేవలం సచిన్ కుమారుడు అయినందుకే ఈ దశ వరకు వచ్చాడనే విమర్శలూ ఉన్నాయి. ఒక విధంగా చూస్తే ఇవి ఇప్పటికి వాస్తవమే. అయితే ,అర్జున్ ఐపీఎల్ లో రాణిస్తే వీటికి అడ్డుకట్ట వేయొచ్చు. ఇక శనివారం నాటి మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్‌ జట్టులో మార్పులు తథ్యమని తెలుస్తోంది.

పేసర్ జయదేవ్ ఉనద్కత్‌ను తప్పిస్తారని తెలుస్తోంది. అతని స్థానంలో క్రికెట్ దిగ్గజం, ముంబై ఇండియన్స్ మెంటర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ రావచ్చు. అతను ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా ఆడకపోవడంతో సోషల్ మీడియాలో ముంబైపై ట్రోలింగ్ పెరిగింది. మరోవైపు అర్జున్ ను ఈ సారి మెగా వేలంలో గుజరాత్ దక్కించుకోవాలని చూసింది. చివరకు రూ.30 లక్షలకు ముంబై సొంతం చేసుకుంది. ఇప్పటికే 8 మ్యాచ్ ల్లో 8 పరాజయాలతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ముంబై రాతను కొంతైనా అర్జున్ మారుస్తాడేమో?
Tags:    

Similar News