కేసీఆర్ ఎన్నిక‌ను ర‌ద్దు చేయాలంటున్న సామాన్యుడు

Update: 2019-01-26 05:52 GMT
కోరుకున్న‌ది జ‌ర‌గాల‌ని.. అనుకున్న‌ది అనుకున్న‌ట్లు కావాల‌న్న సంక‌ల్పం కావొచ్చు.. త‌న‌కు తిరుగులేని రీతిలో ప‌రిస్థితులు ఉండాల‌న్న కోరిక‌తోనో.. ఇంకేదైనా కార‌ణంతో కావొచ్చుకానీ కేసీఆర్ చేప‌ట్టిన మ‌హా యాగం పూర్తి అయ్యింది. యాగం చివ‌రి రోజున‌.. ఊహించని ప‌రిణామం చోటు చేసుకుంది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎన్నిక‌ల చెల్ల‌దంటూ గ‌జ్వేల్ కు చెందిన ఓట‌రు ఒక‌రు హైకోర్టును ఆశ్ర‌యించ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఎన్నిక‌ల సంద‌ర్భంగా దాఖ‌లు చేసే నామినేష‌న్ లో కేసీఆర్ నిబంధ‌న‌ల్నిపాటించ‌లేదంటూ ఒక ఓట‌రు కోర్టుకు ఎక్క‌టం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. సిద్దిపేట జిల్లా ములుగు మండ‌లం మామిడాల గ్రామానికి చెందిన త‌మ్మాల శ్రీ‌నివాస్ అనే వ్య‌క్తి హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

ఈ కేసులో కేసీఆర్ తోపాటు.. ఎన్నిక‌ల్లో పోటీ చేసిన అభ్య‌ర్థులు.. ఎన్నిక‌ల అధికారులు..కేంద్ర‌.. రాష్ట్ర ఎన్నిక‌ల సంఘాల‌ను ప్ర‌తివాదులుగా చేర్చారు. కేసీఆర్ నామినేష‌న్ ప‌త్రాలు ప్ర‌జా ప్రాతినిధ్య చ‌ట్టం 1951 .. ఎన్నిక‌ల నిబంధ‌న‌లు 1961 ప్ర‌కారం లేవ‌న్న‌ది ఆయ‌న ఆరోప‌ణ‌.

కేసీఆర్ దాఖ‌లు చేసిన నామినేష‌న్లో ఆయ‌న‌పై ఉన్న కేసుల‌కు సంబంధించిన పూర్తి స‌మాచారం ఇవ్వ‌లేద‌ని ఆయ‌న చెబుతున్నారు. ఇలా చేయ‌టం ప్ర‌జాప్రాతినిధ్య చ‌ట్టంలోని సెక్ష‌న్ 125ఏ(3)ను ఉల్లంఘించిన‌ట్లేన‌ని ఆయ‌న వాదిస్తున్నారు. ఎన్నిక‌ల నిబంధ‌న‌ల ప్ర‌కారం పోటీచేసే ప్ర‌తి ఒక్క‌రూ త‌మ‌పై ఉన్న కేసుల వివ‌రాల్ని సంపూర్ణంగా ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేయ‌లేద‌న్న‌ది ఆరోప‌ణ కాగా.. దీంతోపాటు ఇత‌ర పార్టీల ఏజెంట్ల‌ను భ‌య‌పెట్టి పోలింగ్ బూత్ ల‌ను ఆక్ర‌మించి ఓట్లు వేయించుకున్నార‌ని.. అధికార దుర్వినియోగానికి పాల్ప‌డిన‌ట్లుగా ఆరోపిస్తున్నారు.

కుల సంఘాల భ‌వ‌నాల‌కు పాత తేదీల‌తో భూములు కేటాయించ‌టాన్ని ఆయ‌న త‌ప్పు ప‌ట్టారు. అఫిడ‌విట్ లో త‌ప్పుడు స‌మాచారం ఇచ్చినందుకు కేసీఆర్ నామినేష‌న్ ను తిరస్క‌రించాల‌ని.. ఆయ‌న ఎన్నిక చెల్ల‌ద‌ని వాదిస్తున్నారు. దీనిపై విచార‌ణ‌కు హైకోర్టు సోమ‌వారానికి కేసును వాయిదా వేసింది.
Tags:    

Similar News