సామాన్యుడి ప్ర‌శ్న‌కు జ‌వాబు చెప్పండి క‌మ‌ల నాథులూ..?

Update: 2022-10-16 01:30 GMT
మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు గుర్రం ఎక్కాల‌ని.. త‌మ‌ను గెలిపించాల‌ని.. కోరుతున్న బీజేపీ నేత‌ల‌కు.. సామాన్యుల నుంచి ప్ర‌శ్నాస్త్రాలు ఎదుర‌వుతున్నాయి. గ‌తంలో పేర్కొన్న విదంగా అయినా.. క‌నీసం.. ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాకు బీజేపీ పెద్ద‌లు ఏమైనా.. చేశారా? అని నిల‌దీస్తున్నారు. అంతేకాదు.. ఏమొహం పెట్టుకుని.. ఓటు అడుగుతార‌ని.. నిల‌దీస్తున్నారు. వాస్త‌వానికి కొన్నిరోజులుగా బీజేపీ నేత‌లు.. మునుగోడులో ప్ర‌చారం పెంచారు. అది చేస్తాం.. ఇది చేస్తాం.. అని హామీల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టి వ‌ర‌కు.. గ‌తంలో ఇచ్చిన‌ హామీల‌ను సామాన్యులు ఎత్తి చూపిస్తున్నారు.  అవేంటో మ‌న‌మూ చూద్దాం..

ఫ్లోరైడ్ పీడిత పాలిత ప్రాంతానికి చేసింది ఏంటి?

దేశంలోనే అత్యధిక ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతంగా మునుగోడు నియోజకవర్గానికి పేరుంది. ఇక్కడ పూర్తిస్థాయిలో ఫ్లోరోసిస్‌ నియంత్రణకు పరిశోధన కేంద్రాన్ని నెలకొల్పాలని 2012లో అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. చౌటుప్పల్‌ మండలం మల్కాపురాన్ని ప్రతిపాదించింది. ఇందుకు రూ.100 కోట్ల నిధులిస్తామని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో.. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 8 ఎకరాల భూమిని కేటాయించింది. పరిశోధన కేంద్రం ఏర్పాటుకు నోడల్‌ ఏజెన్సీగా ఉన్న హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థకు సదరు స్థలాన్ని అప్పగించారు. ఇప్పటివరకు ఆ దిశగా అడుగు మాత్రం ముందుకు పడలేదు.

నేత‌న్న‌కు ద‌న్నేదీ?

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నలభై వేలకు పైగా చేనేత కుటుంబాలు ఉన్నాయి. అందులో ఎక్కువగా మునుగోడు నియోజకవర్గం లోనే ఉన్నాయి. జాతీయ భౌగోళిక గుర్తింపు పొందిన పుట్టపాక, పోచంపల్లి చీరల్లో ఎక్కువభాగం ఈ ప్రాంత నేతన్నల మగ్గాలపైనే తయారవుతాయి. వారి ఉపాధిని మెరుగుపర్చేందుకు ప్రభుత్వం 2005లో చౌటుప్పల్‌ మండలం మల్కాపురంలో ‘ఔళి పార్కు’ను ఏర్పాటుచేసింది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 50 ఎకరాల భూమిని సేకరించింది. కేంద్ర ప్రభుత్వం అప్పట్లో మంజూరు చేసిన రూ.3.31 కోట్లతో ఇక్కడ కొన్ని మౌలిక సదుపాయాలు కల్పించారు.

ఎగ్జిబిషన్‌ హాల్‌, బిజినెస్‌ రీసోర్సెస్‌, క్యాడ్‌ డిజైన్‌, కామన్‌ ఫెసిలిటీ కేంద్రాలు నెలకొల్పడంతో పాటు బ్యాంకు ఏర్పాటుచేస్తామంటూ అప్పట్లో ప్రతిపాదించారు. అవన్నీ ఏర్పాటై 110 యూనిట్లు పనిచేసేలా చూస్తే ఇప్పటికిప్పుడు కనీసం 5,000 మందికి ఉపాధి లభించే అవకాశముంది. ఆ దిశగా అడుగులు ముందుకు పడకపోవడంతో ఈ పార్కు ప్రస్తుతం నిరుపయోగంగా ఉంది. నియోజకవర్గంలోని కొయ్యలగూడెం, చౌటుప్పల్‌, సంస్థాన్‌ నారాయణపురం, పుట్టపాక, గట్టుప్పల్‌, తేరట్‌పల్లి, చండూరులలో చేనేత క్లస్టర్ల ఏర్పాటు ప్రతిపాదనా ఇప్ప‌టి వ‌ర‌కు అడుగు ముందుకు ప‌డ‌లేదు.

సాగునీటికి దిక్కేదీ?

నల్గొండ జిల్లాలో సాగునీటి ఆధారం లేని నియోజకవర్గం మునుగోడు ఒక్కటే. అందుకే 2015లో డిండి ఎత్తిపోతల పథకంతో ఈ ప్రాంతానికి సాగునీటి వసతి కల్పించే లక్ష్యంతో చర్లగూడెం రిజర్వాయర్‌ నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈ పథకం వడివడిగా సాగుతున్నా.. నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కావడం లేదు. ప్రత్యేక ప్యాకేజీ అమలవుతుందని గత కొంత కాలంగా వారు ఆశపడుతున్నారు తప్ప ఆ దిశగా కేంద్రం నుంచి ఎలాంటి హామీ లభించడం లేదు. ప్రాజెక్టు మీరు క‌ట్టండి.. నిర్వాసితుల ప‌రిహారం మేమిస్తామ‌న్న బీజేపీ నేత‌ల హామీ బుట్ట‌దాఖ‌లైంది. వీటినే ఇప్పుడు ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి వీటికి స‌మాధానం చెప్పి.. త‌ర్వాత ఓట్లు అడ‌గాల‌ని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Tags:    

Similar News