సీఎం కేసీఆర్ కు మావో నేత అజాద్ నుంచి 3 పేజీల సీరియస్ లేఖ

Update: 2022-07-21 05:16 GMT
గడిచిన ఎనిమిదేళ్లలో ఎప్పుడూ జరగనిది తాజాగా చోటు చేసుకుంది. భారత కమ్యూనిస్టుపార్టీ (మావోయిస్టు)నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మూడు పేజీల లేఖ రాశారు. అందులో భద్రాచలం పరిధిలోని ముంపు ప్రాంతాల్లోని ప్రజల వెతల గురించి వెల్లడించిన వారు.. బాధితుల్ని ఆదుకోవటంలో రెండు తెలుగురాష్ట్రాల్లోని ప్రభుత్వాలు విఫలమైనట్లుగా పేర్కొన్నారు. అయితే.. ఫోకస్ తెలంగాణ మీద పెడుతూ.. సీఎంకేసీఆర్ ను ఉద్దేశిస్తూ పలు అంశాల్ని ప్రస్తావించారు. వరద కారణంగా రెండు తెలుగురాష్ట్రాల్లో మొత్తం 500 గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉందన్నారు. గోదావరి వరద ముంచెత్తటంతో ఆయా గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినట్లుగా పేర్కొన్నారు.

గోదావరి పరివాహాక ప్రాంత ప్రజలు సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారని.. వారి కష్టాలు తీర్చటంలో రెండు తెలుగురాష్ట్రాలు ఫెయిల్ అయినట్లుగా స్పష్టం చేశారు. కనీసం బాధితుల సామర్థ్యానికి తగ్గట్లు పునరావాస కేంద్రాల్ని ఏర్పాటు చేయలేకపోయారన్నారు. పునరావాస కేంద్రాల్లో సమయానికి ఆహారం.. మంచినీటిని కూడా ఇవ్వకుండా ప్రజలను ఆకలితో చంపుతున్నారన్నారు.

సమయానికి ఆహారం ఇవ్వని పరిస్థితుల్లో పెద్దలు తమకు ఇచ్చిన ఆహారాన్ని దాచి.. వారు పస్తులు ఉండి పిల్లలకు పెడుతున్నట్లుగా వెల్లడించారు. చాలా చోట్లకు అధికారులు ముంపు గ్రామాల వైపు వెళ్లలేదన్న విస్మయకర ఆరోపణ చేశారు. చివరకు ప్రజలే ఎత్తైన ప్రదేశాల్లో అవాసాలు ఏర్పాటు చేసుకున్నారన్నారు. ప్రజల పరిస్థితి ఇలా ఉంటే.. నేతలు మాత్రం 24 గంటలు బాధితులకు సేవ చేస్తున్నట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. రేగా కాంతారావులు భద్రాచలం పట్టణంలో అన్ని సౌకర్యాలతో ఏసీ రూముల్లో ఉంటూ గ్రామాలను.. గ్రామాల్లో వరద బాధితుల కష్టాలను గాలికి వదిలేసి మీడియానువెంటేసుకొని తాము బాగాపని చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. ‘‘అధికారులను వారి పనులు వారిని చేయనివ్వకుండా.. తమ వెంటే ఉండాలంటూ హుకుం జారీ చేసి సహాయక చర్యలు చేయనివ్వటం లేదు. తెలుగురాష్ట్రాల్లో విపత్తు నిర్వహణలో పూర్తిగా విఫలమయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ప్రాజెక్టు పంప్ హౌస్ లు అన్ని పూర్తిగా వరదల్లో మునిగిపోవటం చూస్తే ఎంత మూర్ఖత్వంగా.. ధన దాహంతో ఈ నిర్మాణాలు చేపట్టారో అర్థమవుతుంది. అనేక చోట్ల మిషన్ భగీరథ పంప్ హౌస్ లు కూడా మునిగిపోయాయి. కేసీఆర్ ధనదాహాన్ని వెక్కించాయి’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

గతంలో ముంపు ప్రాంతాల్లోని వారి వెతలు తీర్చటానికి రూ.100 కోట్ల హామీ ఇచ్చి గాలికి వదిలేశారని.. ఇప్పుడు రూ.వెయ్యి కోట్లు ఇస్తానంటున్నారు. రాష్ట్ర విభజన సమయంలోనూ కేసీఆర్ స్వార్థంమూలంగా భద్రాచలం పరిధిలోని గ్రామాల్ని ఏపీకి విడిచిపెట్టి భద్రాద్రిని వేరు చేశారు. ఇప్పుడు భద్రాచలం రెక్కలు తెగిన పక్షిలా విలవిలలాడుతోంది. ఈ పాపం నూటికి నూరుపాళ్లు కేసీఆర్ దే.

రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి భద్రాద్రి డెవలప్ మెంట్ ను గాలికి వదిలేసి.. టెంపుల్ సిటీ చేస్తానని ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? వీటిని ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. నిజంగా కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే హామీ ఇచ్చిన రూ.వెయ్యి కోట్లను వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లను తెర మీదకు తీసుకొచ్చారు. బాధితుల్ని వెంటనే ఆదుకోవాలని.. వారికి తక్షణ పరిహారంతో పాటు నష్ట పరిహారం అందించాలంటూ డిమాండ్లు చేస్తూ పార్టీ కార్యదర్శి ఆజాద్ పేరుతో లేఖ విడుదలైంది.
Tags:    

Similar News