వ్యాక్సిన్ రాలేదు గానీ... అప్పుడే ధరలపై యుద్ధం షురూ

Update: 2020-07-30 01:30 GMT
మానవాళిని తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చేయడమే లక్ష్యంగా ప్రపంచ దేశాలన్నీ తమదైన శైలి వ్యూహాలు రచిస్తూ ఉంటే... ఔషధ తయారీ సంస్థలు మాత్రం కరోనా నివారణకు వ్యాక్సిన్ కనుగొనే పనిని ఎప్పుడో మొదలెట్టేశాయి. ఈ వ్యాక్సిన్ కు సంబంధించి వివిధ సంస్థలు వివిధ రకాల ప్రయోగాలు చేస్తున్నాయి. అయితే వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందో తెలియదు గానీ... అప్పుడే వ్యాక్సిన్ ధరలపై ఆయా కంపెనీల మద్య యుద్ధ వాతావరణం నెలకొందని మాత్రం చెప్పక తప్పదు. తమ వ్యాక్సిన్ ముందు వస్తుందంటే... కాదు తమ వ్యాక్సినే అందరికంటే ముందు వస్తుందంటూ ఆయా కంపెనీలు చేస్తున్న ప్రకటనలు ఓ వైపు, ఆయా కంపెనీల వ్యాక్సిన్ ధరలపై పోటా పోటీ లీకులు మరోవైపు రసవత్తరంగా సాగుతున్నాయి.

ఇలాంటి కీలక తరుణంలో అసలు కరోనా విరుగుడుకు వినియోగించే వ్యాక్సిన్ తయారీలో ఏఏ సంస్థలు పనిచేస్తున్నాయి? ఆయా సంస్థల ప్రయోగాలు ఎంతదాకా వచ్చాయన్న విషయాలు పక్కనపెడితే... ఆయా కంపెనీలు తయారు చేయనున్న వ్యాక్సిన్ కు సంబంధించిన ధరలపై ఇప్పుడు భారీ యుద్ధమే మొదలైపోయింది. ఈ వివరాల్లోకి వెళితే... ఫైజర్‌, మోడర్నా ఇంక్‌, ఆస్ట్రాజెనెకా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, సనోఫీ- జీఎస్‌కే, మెర్క్‌ తదితర గ్లోబల్‌ ఫార్మా దిగ్గజాలు కోవిడ్‌-19 కట్టడికి వ్యాక్సిన్ల అభివృద్ధిలో పోటీ పడుతున్నాయి. ఇందుకు వీలుగా ఇప్పటికే క్లినికల్‌ పరీక్షలను వేగవంతం చేశాయి. ప్రస్తుతం పలు ఔషధాల ప్రయోగాలు రెండు, మూడో దశ పరీక్షలకు చేరుకున్నాయి. సాధారణంగా నాలుగు దశల తదుపరి ఔషధ పరీక్షల ఫలితాలను విశ్లేషించాక సంబంధిత ఔషధ నియంత్రణ సంస్థలు అనుమతులు మంజూరు చేస్తాయని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. ఇందుకు రోగుల భద్రత, వ్యాక్సిన్‌ పనితీరు తదితర పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయని తెలియజేశాయి.

ఇదిలా ఉంటే... 2020 డిసెంబర్‌లోగా మోడర్నా... వ్యాక్సిన్‌ను విడుదల చేసే అంచనాలు వేస్తుంటే.. సనోఫీ, జీఎస్‌కే 2021 తొలి అర్ధభాగంలో ప్రవేశపెట్టే వీలున్నట్లు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు దేశ, విదేశీ కంపెనీలు భారీ స్థాయిలో వ్యాక్సిన్లను తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం విదితమే. ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ప్రజలకు ఆరోగ్యపరమైన సవాళ్లు విసురుతున్న కరోనా వైరస్‌ కట్టడికి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ల ధరలపై వెలువడుతున్న అంచనాలు ఆసక్తికరంగా మారాయి. కరోనా కట్టడికి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌కు యూఎస్‌, తదితర సంపన్న దేశాలలో 50-60 డాలర్ల చొప్పున ధరను మోడార్న్‌ ఇంక్‌ ప్రతిపాదించనున్నట్లు తెలుస్తోంది. అయితే జర్మన్‌ కంపెనీ బయోఎన్‌టెక్‌ భాగస్వామ్యంతో ఫైజర్‌ రూపొందిస్తున్న వ్యాక్సిన్‌కు 39 డాలర్లను ప్రకటించే యోచనలో ఉన్నట్లు విదేశీ మీడియా పేర్కొంది. కాగా.. లక్షలాది మంది రోగులకు వినియోగించగల వ్యాక్సిన్ల ధరలపై ప్రభుత్వంతో తొలుత సంప్రదింపులు జరిపాకే ధరలు నిర్ణయమవుతాయని మోడర్నా ఇంక్‌ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.

మరోవైపు యూఎస్‌ ప్రభుత్వం నుంచి ముందస్తుగా అందుకోనున్న 120 కోట్ల డాలర్ల చెల్లింపులకుగాను ఆస్ట్రాజెనెకా 4 డాలర్ల ధరలో 30 కోట్ల డోసేజీలను సరఫరా చేయవచ్చని తెలుస్తోంది. యూఎస్‌ ప్రభుత్వం మోడర్నాకు సైతం 100 కోట్ల డాలర్ల ఫండింగ్‌ను అందించిన విషయం విదితమే. కోవిడ్‌-19కు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేందుకు తొలిసారి ఏప్రిల్‌లో చేతులు కలిపిన ఫార్మా దిగ్గజాలు సనోఫీ, జీఎస్‌కే.. 2021 తొలి అర్ధభాగంలో ఔషధ నియంత్రణ సంస్థల అనుమతి పొందగలమని భావిస్తున్నట్లు పేర్కొంటున్నాయి. క్లినికల్ పరీక్షలు విజయవంతమైతే 6 కోట్ల డోసేజీలను సరఫరా చేసేందుకు బ్రిటన్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఆ సంస్థలు పేర్కొన్నాయి. ఈ బాటలో యూరోపియన్‌ యూనియన్‌, ఇటలీ, ఫ్రాన్స్‌ ప్రభుత్వాలతోనూ చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశాయి. తద్వారా 30 కోట్లకుపైగా డోసేజీలను సరఫరా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందోనన్న అంశంపై స్పష్టమైన సమాచారమేమీ లేకుండానే ఆయా కంపెనీలు వ్యాక్సిన్ ధరలపై పోటాపోటీ ప్రకటనలు చేస్తున్నాయని చెప్పక తప్పదు.
Tags:    

Similar News