కరోనా వ్యాక్సిన్ లో పంది మాంసం.. జోరుగా పుకార్లు.. నిజమెంత?

Update: 2020-12-22 16:00 GMT
కరోనా వైరస్.. ఈ పేరు వింటే ప్రపంచం మొత్తం చిగురుటాకులా వణికిపోతోంది. ఇప్పటి వరకూ వరల్డ్ వైడ్ గా 18 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక, వైరస్ సోకిన వారి సంఖ్య దాదాపు 8కోట్లు. ఇంత విపత్తు సంభవిస్తున్నా.. ప్రపంచ దేశాలు చేష్టలుడిగి చూడడం తప్ప, ఏమీ చేయలేకపోతున్నాయి. వైరస్ నివారణకు వ్యాక్సిన్ తయారు చేస్తున్నా.. వాటి ప్రభావ శీలతపై ఎవరి సందేహాలు వారివే. అయినా.. గుడ్డిలో మెల్ల అన్నచందంగా వైరస్ ను అడ్డుకునేందుకు వ్యాక్సిన్లు తప్పక తీసుకోవాల్సిన పరిస్థితి. అయితే.. ఈ వ్యాక్సిన్ తయారీపై పలు పుకార్లు చెలరేగాయి. ఇందులో అవాంఛితమైన పదార్థాలు వినియోగించారంటూ ప్రచారం మొదలవడంతో.. వ్యాక్సిన్ తీసుకునేందుకు కొన్ని దేశాలు కూడా సంశయిస్తున్నాయని సయమాచారం.

వ్యాక్సిన్‌లో పంది మాంసం..
ప‌్ర‌పంచ‌వ్యాప్తంగా ఒక్కో వ్యాక్సిన్ వాడకానికి సిద్ధమవుతోంటే ఇక కరోనా అంతానికి దారులు ఏర్పడ్డట్టేనని చాలా మంది సంతోషిస్తున్నారు. కానీ.. ఇందులో పంది మాంసం కలిపారంటూ మొదలైన ప్రచారంతో ఓ వర్గానికి చెందిన వారు వ్యతిరేకిస్తున్నారు. పంది మాంసంతో చేసిన ఉత్ప‌త్తులు వాడితే.. అవి తమ మత సంప్రదాయాలకు విరుద్ధమని చెబుతున్నారు. అవి కొవిడ్ టీకాలైనా సరే.. హలాల్(పవిత్ర పదార్థం)గా కాకుండా హరామ్(అపవిత్ర పదార్థం)గా భావిస్తామని అంటున్నారు. ఈ నేపథ్యంలో పలు ఇస్లామిక్ దేశాలు టీకా వాడకంపై తర్జనభర్జనలు పడుతున్నాయని సమాచారం.

ఆ జంతువును ముట్టుకోరు..
సాధార‌ణంగా వ్యాక్సిన్ జీవిత‌కాలం పెంచ‌డానికి.. సుర‌క్షితంగా, స‌మ‌ర్థ‌వంతంగా ఉండ‌టానికి పలు వ్యాక్సిన్లలో పంది మాంసంతో చేసిన ‘జెలటిన్’‌ను వాడుతుంటారు. ఇప్పుడు.. దీన్నే చూపుతూ ప‌లు ముస్లిం దేశాలు వ్యాక్సిన్ వాడేందుకు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నాయట. ఇస్లాం, యూదు మతాలు పందిని అపవిత్ర జంతువుగా చూస్తారు. ఆ మతస్థులు ఆ జంతువును ముట్టుకోరు. అలాంటి జంతువు మాంసం నుంచి సేకరించిన జెలటిన్ ను వ్యాక్సిన్ తయారీలో వాడటాన్ని కొందరు తప్పుబడుతున్నారట.

‘తబ్లిగీ జమాత్’ తరహాలో పుకార్లు..
కరోనా విలయం తొలినాళ్లలో తబ్లిగీ జమాత్ సభ్యుల వల్లే ఇండియాలో వైరస్ వ్యాప్తి చెందిందనే విద్వేష పుకార్లు వ్యాపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ విషయంలోనూ ఒక వర్గాన్ని టార్గెట్ గా చేసుకుని కొందరు పుకార్లు రేపుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

వ్యాక్సినే ముఖ్యమంటున్న ముస్లిం పెద్దలు..
అయితే.. పలువురు ముస్లిం మత పెద్దలు మాత్రం వ్యాక్సిన్లకు మతంతో సంబంధం లేద‌ని, వ్యాక్సిన్ అందరూ తీసుకోవాల్సిందేనని చెబుతున్నారు. మతాచారాల కన్నా మనిషి ప్రాణాలే ముఖ్యమని పలువురు గుర్తుచేస్తున్నారు. పోలియో వ్యాక్సిన్ సంద‌ర్భంగా కూడా ఇస్లామిక్ సెంట‌ర్ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తుగా నిలిచింద‌ని, ఇప్పుడూ అదే చేస్తామ‌ని అంటున్నారు పలువురు.

ఈ ప్రచారాన్ని నమ్మొద్దు..
ఒక మ‌నిషి ప్రాణాల‌ను కాపాడ‌టానికి హ‌రామ్(అపవిత్ర) ప‌దార్థాల‌ను వాడ‌టం త‌ప్పేమీ కాద‌ని గ్రంథాలు చెబుతున్నాయని కూడా పలువురు పెద్ద‌లు అంటున్నారు. పంది మాంసం పేరు చెబుతూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవద్దంటూ కొందరు చేస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని, ముస్లింలంతా విధిగా వ్యాక్సిన్‌లు తీసుకోవాల‌ని ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన మ‌త పెద్ద మౌలానా ఖాలిద్ ర‌షీద్ ఫిరంగీ మ‌హాలి పిలుపునిచ్చారు. యూదు మత పెద్దలు కూడా ఇదే తరహా పిలుపునిస్తున్నారు.

పంది మాంసం వాడలేదు..
అయితే.. కరోనా వ్యాక్సిన్లలో పంది మాంసం వాడకంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ ఫార్మా కంపెనీలు స్పందించాయి. వరుస ప్రకటనలు చేశాయి. త‌మ క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్‌ల‌లో పంది మాంసంతో చేసిన ఉత్ప‌త్తులు ఏవీ వాడ‌లేద‌ని ఫైజ‌ర్, మోడెర్నా, ఆస్ట్రాజెనెకా సంస్థ అధికార ప్ర‌తినిధులు స్ప‌ష్టం చేశారు. అందరూ నిరభ్యంతరంగా వ్యాక్సిన్ తీసుకోవచ్చని చెబుతున్నారు.
Tags:    

Similar News