మా కేంద్ర మంత్రి తప్పిపోయారు

Update: 2016-09-13 11:06 GMT
 ఏపీ ప్రత్యేక హోదా పోరు రాష్ట్రానికి చెందిన ఎంపీలు - కేంద్ర మంత్రులకు ఇరకాటంగా మారింది. తాజాగా కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజు కనిపించడం లేదంటూ తిరుపతి ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ లో వామపక్ష నాయ‌కులు ఫిర్యాదు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ నిర‌స‌న తెలుపుతున్న వామ‌ప‌క్ష నాయ‌కులు అశోక్‌ గజపతిరాజుపై మండిప‌డ్డారు. కేంద్రం ప్ర‌త్యేక హోదా కాదంటూ ప్యాకేజీ ఇస్తామంటూ చేస్తోన్న ప్రకటనలపై ఆగ్రహించిన వామపక్ష నేతలు.. ఇంత జరుగుతున్నా కేంద్ర మంత్రి అశోక్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని... అసలు ఆయన ఏమయ్యారో తెలియడం లేదని విమర్శలు కురిపించారు.  ఈ నేప‌థ్యంలోనే పోలీస్‌ స్టేష‌న్‌ లో వారు కేంద్ర మంత్రి క‌న‌ప‌డ‌డం లేద‌ని ఫిర్యాదు చేసి వినూత్న రీతిలో నిర‌స‌న తెలిపారు.

మరోవైపు తిరుపతిలో ప్రత్యేక హోదా పోరు ఊపందుకుంటోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంతవరకు పోరాడుదామని - ఈనెల 15న సామూహిక నిరాహారదీక్షను చేపట్టనున్నట్లు అఖిలపక్ష నేతలు పిలుపునిచ్చారు. సీపీఎం ఆధ్వర్యంలో ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం... ప్రత్యేక హోదా సాధిద్దాం’ అనే అంశంపై సమావేశం కూడా నిర్వహించారు.

వైసీపీ నేతలు ఈసభలో పాల్గొని ప్యాకేజీ వల్ల నేతల జేబులు నిండడం తప్ప ప్రజలకు కలిగే ప్రయోజనమేమీ ఉండదంటూ మండిపడ్డారు. మోడీ - చంద్రబాబులు తిరుపతి ఎన్నికల సభలో ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి నేడు నిరాకరించడం దగాకోరుతనమే ఆన్నారు. ప్యాకేజీ తాత్కాలిక భిక్ష మాత్రమేనని - హోదా శాశ్వత పరిష్కారమన్నారు. ప్రత్యేక హోదా కోసం వామపక్షాలతో కలిసి పోరాడుతామని వారు స్పష్టం చేశారు. మొత్తానికి వామపక్షాలు - వైసీపీ కలిసి తిరుపతి కేంద్రంగా పోరాటాన్ని ఉద్ధృతం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
Tags:    

Similar News