టీమిండియాలో ఏం జ‌రుగుతోంది? కొహ్లీపై ఫిర్యాదు!

Update: 2021-09-18 13:34 GMT
వ‌ర‌స విజ‌యాల‌తో అంతా బాగుంద‌నుకున్న టీమిండియాలో అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇంగ్లండ్-ఇండియాల జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గాల్సిన ఐదో టెస్టు అనూహ్యంగా ర‌ద్దు కావ‌డం ద‌గ్గ‌ర నుంచి టీమిండియాపై ప‌లు విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇదే స‌మ‌యంలో అన్ని ఫార్మాట్ల‌కూ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చిన కొహ్లీ ని ప‌రిమిత ఓవ‌ర్ల కెప్టెన్సీ నుంచి త‌ప్పించ‌నున్నార‌ని ప్ర‌చారం ఒక వైపు, అత‌నే త‌ప్పుకుంటున్నాడ‌నే ప్ర‌చారం మ‌రోవైపు జ‌రిగింది. మొద‌ట ఆ ప్ర‌చారాన్ని బీసీసీఐ ఖండించింది. స్వ‌యంగా జైషా ఆ ఖండ‌న ప్ర‌క‌ట‌న చేశారు. అయితే ఆ త‌ర్వాత కూడా క‌థ రివ‌ర్స్ లోనే సాగింది. టీ20 కెప్టెన్సీ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టుగా విరాట్ స్వ‌యంగా ప్ర‌క‌టించేశాడు. ఒక ర‌కంగా జై షా ప్ర‌క‌ట‌న‌కు రివ‌ర్స్ లో వ్య‌వ‌హ‌రించాడు కొహ్లీ.

ఆ సంగ‌త‌లా ఉంటే.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ జ‌ట్టు ఎంపిక‌లో కూడా చాలా ర‌చ్చ జ‌రిగిన‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌త్యేకించి రోహిత్ శ‌ర్మ‌ను త‌న‌కు వైస్ కెప్టెన్ గా నియ‌మించ‌డం ప‌ట్ల కొహ్లీ అస‌హ‌నంతో ఉన్నాడ‌ట‌. వ‌య‌సులో త‌న క‌న్నా పెద్ద వాడు అయిన రోహిత్ బ‌దులు యువ ఆట‌గాళ్ల‌ను వైస్ కెప్టెన్ గా నియ‌మించాల‌నే డిమాండ్ ను ఇటీవ‌ల కూడా బోర్డు ముందు పెట్టాడ‌ట కొహ్లీ. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ తోనే ఆ మార్పు జ‌ర‌గాల‌న్నాడ‌ట‌. అయితే బోర్డు కొహ్లీ సూచ‌న‌ను ప‌ట్టించుకోలేదు. రోహిత్ శ‌ర్మ‌నే డిప్యూటీ కెప్టెన్ గా నియ‌మించింది. ఇంత‌లోనే కొహ్లీ టీ20 ప్ర‌పంచ‌క‌ప్ త‌ర్వాత ఆ ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టుగా ప్ర‌క‌టించేశాడు.


అయితే ఇంత‌టితో కూడా ఆ ర‌చ్చ ఆగేలా లేదు. కొహ్లీ కేవ‌లం టీ20 కెప్టెన్సీని మాత్ర‌మే వ‌దులుకున్నాడు. మిగ‌తా ఫార్మాట్ల‌కు త‌నే కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించాల‌నుకుంటున్నాడు. ఈ నేప‌థ్యంలో కొహ్లీపై జై షా వ‌ద్ద‌కు ఒక ఫిర్యాదు వెళ్లింద‌ట‌. స‌హ‌చ‌ర ఆట‌గాళ్ల‌తో కొహ్లీ ప్ర‌వ‌ర్త‌న స‌రిగా లేద‌నేది ఆ ఫిర్యాదు సారాంశం. ఆట‌గాళ్ల‌పై కొహ్లీ అరుస్తున్నాడ‌ని, కోచ్ లు చెప్పిందానికి కూడా పెద్ద‌గా విలువ‌ను ఇవ్వ‌డం లేద‌ని ఒక సీనియ‌ర్ ఆట‌గాడు త‌న ఫిర్యాదులో పేర్కొన్నాడ‌ట‌. గ‌త కొన్నాళ్లుగా కొహ్లీ ఫామ్ స‌రిగా లేదు. క‌నీసం సెంచరీని సాధించి కూడా చాలా కాలం అయ్యింది. కొహ్లీ సెంచ‌రీ లేకుండా 50 ఇన్నింగ్స్ ల‌ను ఆడేశాడు!

ఈ విష‌యంలో క్రీడాప‌రిశీల‌కులు కూడా ఆశ్చ‌ర్య‌పోతూ ఉన్నారు. ప‌దే ప‌దే చేసిన త‌ప్పులే చేస్తూ కొహ్లీ ఔట్ అవుతూ వ‌స్తున్నాడు. ఈ ప‌రిణామాల్లో.. కొహ్లీ లో అస‌హ‌నం పెరిగిపోతూ ఉంద‌ట‌. దీంతో జ‌ట్టులోని స‌హ‌చ‌రుల‌పై ఆ అస‌హ‌నాన్ని చూపుతున్నాడ‌ట‌. కొహ్లీ తీరును బ‌ట్టి అది నిజ‌మే అని బ‌య‌టి వారు కూడా అనుకునే అవ‌కాశం ఉంది. ప్ర‌త్య‌ర్థి ఆట‌గాళ్ల‌పై కొన్ని సార్లు అకార‌ణంగా అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేయ‌డానికి కూడా కొహ్లీ వెనుకాడే టైపు కాదు. ఇలాంటి నేప‌థ్యంలో జ‌ట్టుపై త‌న అదుపు కోసం కొహ్లీ అస‌హ‌నం వ్య‌క్తం చేయ‌డం వంటి చేస్తూ ఉండ‌వ‌చ్చు కూడా!

ఇక జ‌ట్టులోని సీనియ‌ర్ల‌ను కూడా కొహ్లీ అంత గౌర‌వించే టైపు క‌న‌ప‌డ‌డు. త‌న‌కు మించిన ప్లేయర్ లేడ‌న్న‌ట్టుగా ఉంటుంది అత‌డి తీరు. ఇలాంటి నేప‌థ్యంలో కొహ్లీపై ఫిర్యాదు ఊహాగానాల‌కు ఊపు ల‌భిస్తూ ఉంది. మ‌రి అంతిమంగా ఈ ప‌రిణామాలు అభిమానుల్లో అస‌హ‌నాన్ని క‌లిగించ‌క‌పోతే అదే చాలు!


Tags:    

Similar News