ఫేస్‌ బుక్ ఓన‌ర్‌ కు ఇంటి స‌మ‌స్య‌

Update: 2016-01-20 08:08 GMT
ఫేస్‌ బుక్‌..ప్ర‌పంచం అంత‌టినీ క‌నెక్ట్ చేస్తున్న సోష‌ల్ మీడియా దిగ్గ‌జం. ఈ ఆలోచ‌న‌తో ప్ర‌పంచం చూపును త‌న‌వైపు తిప్పుకున్న మార్క్‌ జుక‌ర్‌ బ‌ర్గ్ ఇటీవ‌ల పాప పుట్టిన సంద‌ర్భంగా భారీ విరాళంతో అంద‌రి మ‌న‌సుల‌ను దోచుకున్నాడు. ఇలా ప‌దుగురికి ఆద‌ర్శ‌మ‌యిన జుక‌ర్‌ బ‌ర్గ్ ఇపుడు వివాదంలో ప‌డ్డాడు. త‌న‌ ఇంటి కార‌ణంగా ఇక్క‌ట్ల పాల‌య్యాడు.

ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌న‌వంతుల్లో ఒక‌రైన జుక‌ర్‌ బ‌ర్గ్ శాన్‌ ప్రాన్సిస్కోలోని లిబర్టీ హిల్ కమ్యూనిటీలో త‌న సొంత ఇంట్లో ఉంటున్నారు. అయితే  ఇటీవ‌ల జుక‌ర్‌బ‌ర్గ్ చ‌ర్య‌ల వ‌ల్ల ఆయ‌న కాల‌నీవాసుల‌కు కోపం న‌షాళానికి అంటింది. ఏకంగా జుక‌ర్‌ బ‌ర్గ్‌ పై కంప్లైంట్ చేసే స్థాయికి చేరింది. ఇంత‌కీ జుక‌ర్‌ బ‌ర్గ్ ఏం చేశాడంటే...ఒక‌టి కాదు రెండు ర‌కాలుగా మార్క్ వారిని బాధ‌పెడుతున్నాడ‌ట‌.

జుక‌ర్‌ బ‌ర్గ్ తానుంటున్న విలాస‌వంత‌మై ఇంటిని మ‌రింత సుంద‌రంగా తీర్చిదిద్దేందుకు మార్పులు చేస్తున్నాడు. అయితే కాల‌నీవాళ్ల‌కు ఏంట‌ట బాధ అనుకునేరు. ఈ ప్ర‌క్రియ నెల‌ల త‌ర‌బ‌డి సాగ‌తూ పోవ‌డం వ‌ల్ల పెద్ద ఎత్తున శబ్దాలు వాళ్ల‌కు ప్ర‌శాంత‌త‌ను క‌రువు చేస్తున్నాయి. అంతేకాదు పున‌రుద్ధ‌ర‌ణ ప‌నుల వ‌ల్ల చెత్త‌, దుమ్ముకూడా కాల‌నీవాసుల‌కు చుక్క‌లు చూపిస్తోంది. పోనీ దీనికి ఓపిక ప‌ట్టుకుందామంటే... ఇంకో రూపంలో జుక‌ర్‌ బ‌ర్గ్ స‌తాయించేస్తున్నాడు మరి.

వెండి రంగులో మెరిసిపోయే ఆయ‌న రెండు స్పోర్ట్ యుటిలిటీ కార్లు బారెడంత ఉండి పార్కింగ్‌ కు ఇబ్బందిని క‌లిగిస్తున్నాయ‌ట‌. ఆయ‌న దారివెంట వెళ్తుంటే ఇబ్బంది అవ‌డం కాదు. కాల‌నీలో రాంగ్‌ పార్క్ చేయ‌డం ఓ అల‌వాటుగా మారిపోవ‌డం వ‌ల్ల మిగ‌తా వారికి ఇబ్బంది క‌లుగుతోంది. ఇంటి రిపేర్ల వ‌ల్ల ఒకటో రెండో రోజులంటే ఏమో అనుకోవ‌చ్చు కానీ నెల‌ల త‌ర‌బడి భారీ కార్ల‌ను రాంగ్ పార్కింగ్‌ లో ఉంచ‌డం వ‌ల్ల త‌మ‌కు తీవ్రంగా ఇబ్బందులు త‌లెత్తున్నాయ‌ని పేర్కొంటూ జుక‌ర్‌ బ‌ర్గ్ ఇంటి బాధ్య‌త‌లు చూసే మేనేజ‌ర్, న‌గ‌ర ట్రాన్స్‌ పోర్ట్ ఏజెన్సీకి కాల‌నీ వాసులు ఫిర్యాదు చేశారు.

జుక‌ర్‌ బ‌ర్గ్ రాంగ్ పార్కింగ్‌ పై గ‌తంలో కూడా ఆరోప‌ణ‌లు ఉన్నా తాము లైట్ తీసుకున్నామ‌ని చెప్తున్న కాల‌నీ వాసులు ఇపుడు రాంగ్ పార్కింగ్ త‌మ‌కు చుక్కలు చూపెట్ట‌డానికి తోడు ఇంటి రిపేరు పేరుతో దుమ్ము కొట్టుకుపోయేలా చేయ‌డం భ‌రించ‌లేని స్థాయికి చేరింద‌ని వాపోతున్నారు. అందుకే తాము పిర్యాదు చేశామ‌ని వెంట‌నే త‌గు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని డిమాండ్ చేస్తున్నారు. అమెరికా అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మ‌రి.
Tags:    

Similar News