సిద్దూపై కేసుల‌ చిట్టా 44కు పెరిగింది!

Update: 2017-06-21 04:24 GMT
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌ లో నిబ‌ద్ధత క‌లిగిన నేత‌గానే కాకుండా ద‌క్షిణాది రాష్ట్రం క‌ర్ణాట‌క‌కు సీఎంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ సిద్దరామ‌య్య‌కు ఇటీవ‌లి కాలం ఏమంత మంచిగా లేదు. దేనిని ముట్టుకున్నా కూడా ఆయ‌న చేతులు కాలిపోతున్నాయి. స్వ‌త‌హాగా చేసిన పొర‌పాట్లు కొన్ని అయితే... అనుకోకుండా క‌ర్ణాట‌క‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేస్తున్న పొర‌పాట్లు కూడా ఆయ‌న మెడ‌కే చుట్టుకుంటున్నాయి. ఖ‌రీదైన వాచీ ద‌గ్గ‌ర నుంచి బ‌హిరంగ స‌భ‌లో ఓ మ‌హిళ‌ను సిద్దూ చెంప‌ను ముద్దు పెట్టుకోవ‌డం, మ‌రో బ‌హిరంగ స‌భ‌కు వెళ్లిన సంద‌ర్భంగా ఓ సీనియ‌ర్ అదికారిపై అంతెత్తున ఎగిరిన సిద్దూ ఆయ‌న చెంప‌ను చెళ్లుమ‌నిపించ‌డం... ఇలా వ‌రుస పెట్టి వివాదాల‌న్నీ ఆయ‌న‌ను చుట్టుముట్టాయి. వీటి నుంచి తేరుకుని కాస్తంత ఊపిరి పీల్చుకుందామంటే ఆయ‌న‌కు ఏమాత్రం అవ‌కాశం చిక్క‌డం లేదు.

ఇప్ప‌టికే సిద్ద‌రామ‌య్యపై వివిధ అంశాల‌కు సంబంధించి ఆయా వ‌ర్గాలు, వ్య‌క్తులు క‌ర్ణాట‌క లోకాయుక్త‌కు ఫిర్యాదు మీద ఫిర్యాదులు చేశారు. నిన్న‌టిదాకా ఇలా లోకాయుక్త‌లో సిద్దూపై దాఖ‌లైన ఫిర్యాదుల సంఖ్య 43గా లెక్క తేలింది. తాజాగా నిన్న కూడా ఆయ‌న‌పై లోకాయుక్త‌కు మ‌రో ఫిర్యాదు అందింది. దీంతో సిద్దూపై లోకాయుక్త‌లో న‌డుస్తున్న కేసుల సంఖ్య 44కు చేరింది. ఈ తాజా వివాదం విష‌యంలోకి వెళితే... సిద్దూ చేసిన త‌ప్పేమీ లేదు గానీ... ఆయ‌న నేతృత్వంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం అనాలోచితంగా చేసిన ఓ ప‌నిని బీజేపీ నేత‌ - బృహత్ బెంగ‌ళూరు న‌గ‌ర పాలికే మాజీ కార్పొరేట‌ర్‌ గా ప‌నిచేసిన ఎన్ ఆర్ ర‌మేశ్ వెతికి మ‌రీ ప‌ట్టేశారు. పొర‌పాటు దొరికిందే త‌డ‌వుగా... సిద్ద‌రామ‌య్య‌పైనే కాకుండా  ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, బెంగ‌ళూరు అభివృద్ధి శాఖ‌ను ప‌ర్య‌వేక్షిస్తున్న మంత్రి కేజే జార్జిపైనా అవినీతి, మోసం సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేయాల‌ని ర‌మేశ్ ఫిర్యాదు చేశారు.

ఇందుకు ర‌మేశ్ ఓ పెద్ద కార‌ణాన్నే చూపించారు. బెంగ‌ళూరు న‌గ‌రంలోని 439 బ‌స్ షెల్ట‌ర్ల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం త‌న కార్య‌క్ర‌మాల ప్ర‌చారం కోసం వినియోగించుకుంద‌ట‌. ఈ క్ర‌మంలో స‌ద‌రు బ‌స్ షెల్ట‌ర్ల‌పై ప్ర‌భుత్వం హోర్డింగ్‌ల‌ను ఏర్పాటు చేసింది. బ‌య‌టి వ్య‌క్తులు ఈ హోర్డింగ్‌ ల‌ను వినియోగించుకుంటే... న‌ర‌గ పాల‌క సంస్థ‌కు నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంది. అయితే ప్ర‌భుత్వం ఈ రుసుమును న‌గ‌ర‌పాల‌క సంస్థ‌కు చెల్లించ‌లేదు. 2015 నుంచి ఈ బ‌స్ షెల్ట‌ర్ల‌ను ప్ర‌చారం కోసం వాడుకున్న ప్ర‌భుత్వం న‌గ‌ర పాల‌క సంస్థ‌కు చిల్లి గ‌వ్వ కూడా ఇవ్వ‌లేద‌ట‌. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం న‌గ‌ర పాల‌క సంస్థ‌కు రూ.68.15 కోట్లు బ‌కాయి ప‌డింద‌ని ర‌మేశ్ వాదిస్తున్నారు. ఉద్దేశ‌పూర్వ‌కంగానే ఈ మొత్తాన్ని ప్ర‌భుత్వం న‌గ‌ర పాల‌క సంస్థ‌కు చెల్లించ‌లేద‌ని త‌న ఫిర్యాదులో ఆరోపించిన ర‌మేశ్‌... సిద్ద‌రామ‌య్య‌తో పాటు కేజే జార్జి, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిపైనా క‌ర‌ప్ష‌న్‌, చీటింగ్ కేసుల‌ను న‌మోదు చేయాల‌ని డిమాండ్ చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News