దేశంలో మే 3 నుండి సంపూర్ణ లాక్ డౌన్ ... నిజమెంత !

Update: 2021-05-01 10:05 GMT
కరోనా వైరస్ దేశంలో విలయతాండవం చేస్తుంది. గత కొన్ని రోజులుగా రోజూ రికార్డు స్థాయిలో లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మే నెలలో కరోనా విలయం మరింత తీవ్రంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రం సిద్ధమైందని, మే 3 నుంచి దేశవ్యాప్తంగా మరోసారి సంపూర్ణ లాక్‌ డౌన్‌ విధిస్తుందని గత కొన్ని రోజులుగా సోషల్‌మీడియాలో జోరుగా ఓ వార్త ప్రచారం సాగుతోంది. దీనిపై తాజాగా కేంద్రం స్పందించింది. ఆ ప్రచారం ఫేక్ అని చెప్పింది. ఆ వదంతులను కొట్టిపారేసింది. ఈ మేరకు ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో  ఫ్యాక్ట్‌ చెక్‌ చేసి స్పష్టతనిచ్చింది.

మే 2న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత 3వ తేదీ నుంచి మే 20 వరకు దేశంలో పూర్తి లాక్‌ డౌన్‌ విధించనున్నారంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు వైరల్‌ అయ్యాయి. కానీ, అందులో ఏ నిజం లేదు అని వెల్లడించింది. కేంద ప్రభుత్వం అలాంటి ప్రకటనేమీ చేయలేదు అని పీఐబీ ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. దేశంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఏప్రిల్ 20న ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. లాక్‌డౌన్‌ చివరి అంశం కావాలని అన్నారు. ఆ తర్వాత నుంచి సోషల్‌ మీడియాలో దీనిపై ప్రచారం మొదలైంది. మే 3 నుంచి లాక్‌డౌన్‌ పెట్టనున్నారని ఓ టీవీ ఛానల్‌ ప్రసారం చేసినట్లుగా ఉన్న పోస్టులు ఇటీవల వైరల్‌ అయ్యాయి. అయితే తాము అలాంటి వార్తలేమీ ప్రసారం చేయలేదని సదరు ఆ  ఛానల్‌ వివరణ ఇచ్చింది.

లాక్‌ డౌన్‌ అవసరం ప్రస్తుతానికి లేదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. గత గురువారం కేంద్ర హోంశాఖ స్పందిస్తూ కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో కంటైన్‌ మెంట్‌ జోన్లు ఏర్పాటు చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. మే 31 వరకు కరోనా ఆంక్షలను అమలు చేయాలని స్పష్టం చేసింది. లాక్ డౌన్ అవసరం లేదని కేంద్రం పదే పదే చెబుతున్నా, పుకార్లు మాత్రం ఆగడం లేదు. కాగా, దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చింది. మునుపెన్నడూ లేనంత ఉద్ధృతితో వైరస్ వ్యాపిస్తుండటంతో రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో 4లక్షలు దాటాయి. ప్రపంచవ్యాప్తంగా ఒక రోజులో ఇన్ని అత్యధిక కేసులు నమోదవడం ఇదే తొలిసారి. అదీ భారత్‌లోనే చోటుచేసుకోవడం పరిస్థితి తీవ్రతను కళ్లకు కడుతోంది. అటు వరుసగా నాలుగో రోజు 3వేల మందికి పైనే కరోనాతో మృత్యువాతపడ్డారు.
Tags:    

Similar News