బెయిల్‌ ఓకే: స్వేచ్ఛాగాలులు పీల్చుకోనున్న గాలి!!

Update: 2015-01-20 07:09 GMT
గాలి జనార్దనరెడ్డి ఎట్టకేలకు జైలు గోడల నుంచి బయటకు రానున్నారు. ఆయన మీద ప్రస్తుతం న్యాయస్థానాల ఎదుట ఉన్న ఏడు కేసుల్లోనూ ఆయనకు బెయిల్‌ లభించింది. దీంతో ప్రస్తుతం పరప్పన జైలులో రిమాండులో ఉన్న గాలి జనార్దనరెడ్డి బయటకు రావడానికి మార్గం సుగమం అయింది. గాలిపై అనేక కేసులు విచారణలో ఉండగా.. ఆయనకు కొన్ని కేసుల్లో ఇదివరకే బెయిల్‌ లభించింది. అయినప్పటికీ.. మిగిలిన కేసుల తీవ్రత దృష్ట్యా ఆయన బయటకు రావడానికి వీలు లేకుండా పోయింది. తర్వాత ఆయన ఏకంగా సుప్రీం కోర్టులోనే బెయిల్‌కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ కేసులో మంగళవారం నాడు తీర్పు వెలువడింది.

ముప్పయి లక్షల రూపాయల పూచీకత్తు సమర్పించాలని ఆదేశిస్తూ సుప్రీం న్యాయస్థానం గాలి జనార్దనరెడ్డికి బెయిల్‌ మంజూరు చేసేసింది. గనుల అక్రమరవాణాకు సంబంధించిన ఓఎంసీ కేసులో తాజాగా బెయిల్‌ రావడంతో.. దాదాపుగా అన్ని కేసుల్లోనూ ఆయనకు బెయిల్‌ లభించినట్లే. దీంతో ఆయన సుప్రీం ఆదేశాలు జైలుకు అందిన వెంటనే బయటకు రావచ్చునని అంచనా వేస్తున్నారు.

2011లో గాలి జనార్దనరెడ్డి అరెస్టు అయ్యారు. అప్పటినుంచి ఆయన అనేక కేసుల్లో నిందితుడిగా దాదాపు జైల్లోనే గడుపుతూ వస్తున్నారు. మధ్యలో బెయిల్‌పై బయటకు వచ్చినప్పటికీ.. లంచం ఇచ్చి బెయిల్‌ తెచ్చుకున్నట్లుగా తేలిపోవడంతో.. ఆయన మళ్లీ జైల్లోకి వెళ్లారు. ఆ కేసుల్లో న్యాయమూర్తి కూడా ఇరుక్కున్నారు. ప్రస్తుతం సుప్రీం కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరుచేసింది. విచారణ సందర్భంగా... సీబీఐ కూడా అభ్యంతరాలు తెలియజేయకపోవడంతో.. బెయిల్‌కు మార్గం సుగమం అయింది. గాలి జనార్దనరెడ్డి త్వరలోనే బయటకు రాబోతున్నారు.
Tags:    

Similar News