అర్జెంట్ గా ఆ కంపెనీలో పని చేయించాలట!

Update: 2020-03-30 01:30 GMT
కరోనా కారణంగా ప్రపంచమంతా కొత్త సమస్యల్ని ఎదుర్కొంటోంది. వినేందుకు విచిత్రంగా అనిపించినా.. ప్రాణాలు పోయే వేళ.. ప్రపంచ ప్రజల అలవాట్లలో వచ్చిన ఒక మార్పు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే.. అంతగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు నిపుణులు. తీవ్రమైన ఒత్తిడి.. అంతులేని సమయం.. ఇంటికే పరిమితమైన ప్రత్యేక పరిస్థితుల వేళ.. రొమాన్స్ కు ఎక్కువ సమయం కేటాయించటం మామూలే అంటున్నారు. ఎవరికి వారు స్వీయ సంరక్షణ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే కరోనా ముప్పు చాలావరకూ తగ్గిపోయినట్లే. అలాంటప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదంటున్నారు.

ఇదిలా ఉంటే.. ప్రపంచవ్యాప్తంగా అవసరమైన కండోమ్ ల్ని తయారు చేసే కంపెనీల్లో కీలకమైనది మలేషియాకు చెందిన కారెక్స్ బీహెచ్ డీ. ప్రపంచ వ్యాప్తంగా వినియోగమయ్యే  ప్రతి ఐదు కండోమ్ లలో ఒక కండోమ్ సదరు కంపెనీ తయారీనే కావటం గమనార్హం. అన్ని దేశాల్లో మాదిరే మలేషియాలోనూ గడిచిన మూడు వారాలుగా లాక్ డౌన్ చేయటంతో.. ఆ దేశంలో ఈ సంస్థకు చెందిన మూడు ప్రధాన ఫ్యాక్టరీలు ఏ ఒక్కటి పని చేయలేదు.

దీంతో..దగ్గర దగ్గర కోటి కండోమ్ ల ఉత్పత్తి ఆగిపోయింది. దీంతో.. ప్రపంచ వ్యాప్తంగా వెళ్లాల్సిన కండోమ్ లు రవాణా కావటం లేదు. సాధారణ రోజులతో పోలిస్తే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో సెక్స్ ఎక్కువ కావటం.. అందుకు తగ్గట్లు కండోమ్ ల వినియోగం ఎక్కువగా సాగుతోంది. దీంతో.. కండోమ్ లకు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కొరత ఏర్పడుతోంది. మలేషియాలోని ఈ కంపెనీలో తయారయ్యే కండోమ్ ల్ని డ్యూరెక్స్ లాంటి సంస్థలు వివిధ దేశాలకు సరఫరా చేస్తుంటాయి.

ఇప్పుడున్న పరిస్థితులు ఇదే రీతిలో సాగి.. కండోమ్ ల కొరత అంతకంతకూ పెరిగితే.. కొత్త తరహా ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందంటున్నారు. అందునా ఆఫ్రికా దేశాల్లో ఇలాంటివి ఇష్యూగా మారుతాయని చెబుతున్నారు. దీంతో.. మిగిలిన వాటి సంగతి తర్వాత.. మలేషియాలోని సదరు కండోమ్ కంపెనీల ఫ్యాక్టరీల్ని వెంటనే తెరిపించి..ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలని కోరుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న వినతులు తీరే అవకాశం కనిపించటం లేదంటున్నారు. సీత కష్టాలు సీతవైతే.. పీత కష్టాలు పీతవని ఊరికే అనలేదేమో?


Tags:    

Similar News