వైసీపీలో విభేదాలా? అవంతి అలక?

Update: 2021-03-03 11:39 GMT
విశాఖలో తాజా పరిణామం  వైసీపీలో విభేదాలకు కారణమైందన్న చర్చ సాగుతోంది. మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే  గంటా శ్రీనివాస్ ప్రధాన అనుచరుడిగా భావిస్తున్న కాశీ విశ్వనాథ్ తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో అధికార పార్టీలో చేరడం చర్చనీయాంశమైంది.

అయితే  శిష్యుడి బాటలోనే గంటా కూడా వైసీపీలో చేరబోతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈరోజు టీడీపీ నేత, గంటా ప్రధాన అనుచరుడు అయిన కాశీ విశ్వనాథ్ వైసీపీలో ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో చేరారు. కాశీ విశ్వనాథం వైసీపీలో చేరడం సంతోషమని విజయసాయిరెడ్డి అన్నారు. అయితే ఈయన బాటలోనే గంటా కూడా చేరుతాడని..  కొన్ని కండీషన్లు పెట్టాడని.. అవి జగన్ ఆమోదిస్తే చేరుతాడనే ప్రచారం సాగుతోంది.

అయితే అధికారికంగా మాత్రం గంటా చేరికపై విజయసాయిరెడ్డి స్పందించలేదు.గంటా ప్రధాన అనుచరుడు రాకను మంత్రి అవంతి శ్రీనివాస్ జీర్ణించుకోవడం లేదని.. అందుకే ఈ చేరిక కార్యక్రమానికి అవంతి దూరంగా ఉన్నారన్న ప్రచారం విశాఖలో జోరుగా సాగుతోంది.  

ట్విస్ట్ ఏంటంటే ఈ చేరిక అనంతరం గంటా అనుచరుడు కాశీ విశ్వనాథం మీడియాతో మాట్లాడారు. మంత్రి అవంతిని కలిసి ఆయన ఆశీస్సులు తీసుకుంటానని తెలిపాడు. దీంతో గంటా అనుచరుడు.. తర్వాత గంటా రాకతో తనకు ప్రాధాన్యం తగ్గిపోతుందనే కారణంతోనే మంత్రి అవంతి ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై అసలు నిజాలు వెల్లడి కావాల్సి ఉంది. మంత్రి అవంతి ఈ చేరికలపై స్పందించలేదు.
Tags:    

Similar News