టీఆర్ఎస్ లో బయటపడ్డ విభేదాలు

Update: 2021-10-20 05:37 GMT
తెలంగాణాలో రాజధాని తరువాత.. రాజధాని అంతటి నగరం.. పోరాటాల గడ్డ.. అయిన ఓరుగల్లులో నిత్యం రాజకీయ పోరు కొనసాగుతూనే ఉంటుంది. నాటి నుంచి నేటి వరకు ఇక్కడ రాజకీయంగా, సామాజికంగా వివాదాలు ఏర్పడినా వాటిని పరిష్కించుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా రాజకీయంగా అధికార, ప్రతిపక్షాల మధ్య నిత్యం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఈ జిల్లాలో నిత్యం ఉంటుంది. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి ఆకర్ష్ లో భాగంగా వివిధ పార్టీల్లోని నేతలంతా గులాబీ గూటికి చేరారు. విపక్ష నాయకులంతా ఒక్క ఒకే గొడుగు కిందికి వచ్చారు. అయితే వీరంతా ఒకే పార్టీలో ఉన్నా కుమ్ములాటలో మాత్రం కొనసాగుతూనే ఉంటాయని నిరూపిస్తున్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం టీఆర్ఎస్ ఆధీనంలో ఉంది. ఇతర పార్టీల్లో ఇమడలేని వారు, పదవులు ఆశించిన వారు రకరకాలుగా గులాబీ గూటికి చేరారు. తామంతా కలిసికట్టుగా పనిచేస్తామని, ఒకరినొకరు సహకరించుకుంటామని కారు కండువా కప్పుకున్న సమయంలో సీఎంతో చెప్పారు. కానీ ఆ తరువాత ఆధిపత్యం కోసం సొంత పార్టీ నాయకులతోనే యుద్దం చేస్తూ పార్టీ పరువు తీస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు..మేయర్, ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య ఆధిపత్య పోరుతో అంతర్గతంగా ఉన్న కుమ్ములాటలు ఒక్కసారిగా బహిర్గతం అయ్యాయి.

ఇటీవల జరిగిన దసరా వేడుకల్లో వరంగల్ జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకుల్లో ఆధిపత్య పోరు కనిపించింది. దసరా పండుగ సందర్భంగా మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత వర్గీయులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఎమ్మెల్యే అనుచరులు వాటిని చింపివేశారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవ పెద్దగిగా మారింది. ఆ తరువాత తోపులాట జరిగింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. గత కొన్నేళ్లుగా ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ ల మధ్య పోరు కొనసాగుతూనే ఉంది. ఇటీవల అది తారాస్థాయికి చేరింది.

వరంగల్ జిల్లా కేంద్రంలోనూ ఇదే ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఇక్కడ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్థానిక ఎమ్మెల్యేల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. స్టేజీ పైన అందరూ ఒక్కటిగానే కనిపించినా స్టేజీ దిగగానే ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటారు. అంతేకాకుండా మంత్రి దయాకర్ రావు పై ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, నన్నపనేని నరేందర్, ఆరూరి రమేశ్ లు ఫిర్యాదు కూడా చేశారు. తాము చేసే పనుల్లో మంత్రి సాగనివ్వడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కు మధ్య పోరు కొనసాగుతూనే ఉంది. ఇటీవల దసరా వేడుకల్లో భాగంగా మేయర్ గుండు సుధారాణి రావణ దహన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేను కాదని మంత్రి దయాకర్ రావును పిలిపి కార్యక్రమాన్ని నిర్వహించిందట. అంతేకాకుండా దసరా ఉత్సవాలకు నిధుల విడుదల, ఇతర అభివృద్ధి పనుల్లోనూ ఎమ్మెల్యే లేకుండానే కొనసాగిస్తున్నారనట. దీంతో మేయర్ వెళ్లిన చోటుకు ఎమ్మెల్యే వెళ్లడం లేదని టాక్ వినిపిస్తోంది.

రాష్ట్రంలో ఓ వైపు టీఆర్ఎస్ తీరుపై బీజేపీ విమర్శలు కొనసాగిస్తున్న తరుణంలో ఇలా అంతర్గత పోరుతో పార్టీకి తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని దిగువ శ్రేణి నాయకులు ఆందోళన చెందుతున్నారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం, ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం పోరాటం చేడయంతో విభేదాలు బయటపడుతున్నాయి. ఓ వైపు టీఆర్ఎస్ లో పనిచేస్తున్న వాళ్లంతా సమన్వయంతో ఉన్నారని అధిష్టానం చెబుతున్న సమయంలో ఇలా ఇంటిపోరుతో పార్టీకి చెడ్డపేరు తీసుకొచ్చే విధంగా నేతలు ప్రవర్తిస్తున్నారని అనుకుంటున్నారు.
Tags:    

Similar News