కోవాగ్జిన్ ఫార్ములా షేరింగ్ పై అయోమయం

Update: 2021-05-23 10:30 GMT
‘కో వాగ్జిన్ ఫార్ములాను ఇతర ఫార్మా కంపెనీలకు షేర్ చేసేది లేదు’.. ఇది తాజాగా భారత్ బయోటక్ జేఎండి సుచిత్రా ఎల్లా చేసిన ప్రకటన. టీకా తయారీలో ఎవరి సహకారం లేదు కాబట్టి, నూరుశాతం తమ కృషే కాబట్టి ఫార్ములాను ఇతరులతో పంచుకునే ప్రసక్తే లేదని సుచిత్ర తెగేసి చెప్పారు. అయితే కొద్దిరోజుల క్రితమే కోవాగ్జిన్ టీకా తయారీ ఫార్ములాను ఇతర కంపెనీలతో కూడా షేర్ చేసుకోవటం ద్వారా ఉత్పత్తిని బాగా పెంచవచ్చని జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోడికి సూచించారు.

తర్వాత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇలాంటి ప్రకటనే చేశారు. తర్వాత చాలామంది శాస్త్రజ్ఞులు, వైద్య నిపుణులు కూడా ఇదే విధమైన సూచనలిచ్చారు. తర్వాత కేంద్రం స్పందిస్తు కోవాగ్జిన్ ఫార్ములను ఇతర ఫార్మా కంపెనీలతో షేర్ చేసుకునేందుకు భారత్ బయోటక్ రెడీగా ఉందన్నారు. ఈ ఫార్ములాను ఇతర ఫార్మాకంపెనీలతో షేర్ చేసుకుని ఉత్పత్తిని పెంచేందుకు కేంద్రం ప్రయత్నాలు మొదలుపెట్టిందని కూడా ప్రకటనలు వచ్చాయి.

అయితే ఇదే విషయమై సుచిత్ర మాట్లాడుతు తాము కష్టపడి తయారుచేసిన టీకా ఫార్ములాను ఏ ఫార్మాకంపెనీతో కూడా షేర్ చేసుకునే ప్రసక్తేలేదని చెప్పేశారు. తాము అంత కష్టపడి ఫార్ములాను తయారుచేసింది ఇతర ఫార్మా కంపెనీలతో షేర్ చేసుకునేందుకా అని కూడా ఎదురు ప్రశ్నించారు. అంటే సుచిత్ర చేసిన తాజా ప్రకటన ప్రకారం కోవాగ్జిన్ టీకాల కొరత ఇప్పట్లో తీరేట్లులేదు. టీకా తయారీలో  ఐసీఎంఆర్, ఎన్ఐవీ పరిజ్ఞానమేది అందించలేదన్నారు.

జంతువులపై ప్రయోగాలు చేయటంలో ఇబ్బందులు ఉన్న కారణంగా ఆ విషయంలో మాత్రమే తమకు ఐసీఎంఆర్, ఎన్ఐవీలు సహకరించాయన్నారు. ఈ రెండు సంస్ధల నుండి కరోనా స్ట్రెయిన్ మాత్రమే అందిందన్నారు. తర్వాత జరిగిన కృషంతా నూరుశాతం తమదే అన్నారు. మరి ఇదే సమయంలో భారత్ బయెటెక్ సంస్ధ బిజినెస్ హెడ్ రేచస్ ఎల్లా మాట్లాడుతూ ఐసీఎంఆర్ తో కలిసి కోవాగ్జిన్ టీకాను డెవలప్ చేసినట్లు చెప్పారు.

మరి ఇద్దరిలో ఎవరి ప్రకటన కరెక్టో తెలీటంలేదు. అదే సమయంలో ఫార్ములాను షేర్ చేసుకోవటంలో భారత్ బయెటెక్ యాజమాన్యం అంగీకరిచిందని కేంద్రం చేసిన ప్రకటన మాటేమిటి ? అన్నదే అర్ధం కావటంలేదు. మొత్తంమీద జనాలవసరాలకు సరిపడా టీకాలను ఉత్పత్తి చేసే సామర్ధ్యం భారత్ బయెటక్ కు లేదని అర్ధమవుతోంది. మరి సుచిత్ర తాజా ప్రకటనపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
Tags:    

Similar News