కేసీఆర్ రూటే సపరేటు.. అభియోగాల ఎమ్మెల్యేలకు అభినందనలు

Update: 2022-10-27 04:06 GMT
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్ని ఎర వేసేందుకు ప్రయత్నాలు జరగటం.. జంప్ అయ్యేందుకు సిద్ధమైనట్లే సిద్ధమై.. తమకు ఎర వేసిన వారికి దిమ్మ తిరిగేలా షాకిచ్చినట్లుగా జరుగుతున్న ప్రచారం వేళ.. ఆసక్తికర పరిణామాలు.. అంతుచిక్కని ప్రశ్నలెన్నో బయటకు వస్తున్నాయి. అన్నింటికి మించి.. 'ఎర' ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు ఎమ్మెల్యేలు.. పోలీసుల ఎంట్రీ తర్వాత ప్రగతిభవన్ కు బయలుదేరి వెళ్లటం తెలిసిందే. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిన ఈ వ్యవహారం రాజకీయ సంచలనంగా మారింది.

ఇక్కడ ఆసక్తికర అంశం ఏమంటే.. నలుగురు ఎమ్మెల్యేలకు ఎర వేశారు. వారు పడినట్లే పడి.. తమకు ఎర వేసిన వారిని అడ్డంగా బుక్ చేయించారన్నది. అయితే.. దీనికి సంబంధించి వినిపిస్తున్న వాదనలు కొత్త సందేహాలకు తావిస్తోంది. ఈ ఎపిసోడ్ వేళ.. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ.. తమను ప్రలోభానికి గురి చేస్తున్నట్లుగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమకు సమాచారం అందించటంతో తాము దాడి చేసి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లుగా చెప్పారు.

అయితే.. దీనికి సంబంధించి ప్రముఖ మీడియాలో వస్తున్న కథనాలు అందుకు భిన్నంగా ఉండటం గమనార్హం. తమను ప్రలోభానికి గురి చేస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెప్పటం.. ఆయన సూచించిన ప్లాన్ తోనే మొత్తం కథ నడిచినట్లుగా చెబుతున్నారు. ఒకవేళ ఈ వాదనే నిజమని అనుకుంటే.. అదే విషయాన్ని సీపీ స్టీఫెన్ రవీంద్ర చెప్పొచ్చు కదా? అలా ఎందుకు జరగలేదు? మీడియాతో మాట్లాడిన వేళలో.. ఎమ్మెల్యేలు తమకు ఫోన్ చేసి సమాచారం అందించటంతో తాము రియాక్టు అయినట్లుగా పేర్కొన్నారు.

సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర చెప్పిన మాటల ప్రకారం.. ఎమ్మెల్యేలు ట్రాప్ నకు గురయ్యారు. తమకు సమాచారం ఇవ్వటంతో ఫాంహౌస్ లో జరుగుతున్న కుట్రను చేదించామని చెబుతున్నారు. అయితే.. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే ప్రగతిభవన్ నుంచి పిలుపు రావటం.. 'ఎర' బారిన పడ్డ ఎమ్మెల్యేలు ఒకే వాహనంలో ప్రగతిభవన్ కు వెళ్లి.. ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు.

ఆ సందర్భంగా నలుగురు ఎమ్మెల్యేలను కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎర బారిన పడిన ఎమ్మెల్యేలను అత్యవసరంగా ప్రగతిభవన్ కు పిలిపించుకొని మాట్లాడే కన్నా.. కాస్తంత ఎదురుచూసే ధోరణిని ఎందుకు ప్రదర్శించలేదన్న ప్రశ్నఎదురవుతోంది. ఏమైనా.. అంచనాలకు భిన్నంగా వ్యవహరించే సీఎం కేసీఆర్ తన చేష్టలతో తాను రోటీన్ కు భిన్నమైన ముఖ్యమంత్రి అన్న పేరును నిలబెట్టుకున్నారని చెప్పక తప్పదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News