విప‌క్షాలకు బాంబులా మారిన ఆ సీఎం మాట‌

Update: 2017-07-03 08:44 GMT
కేంద్రంలోని విపక్షాల టైం ఏమాత్రం బాగోలేదు. సాధార‌ణంగా అధికార ప‌క్షానికి వ్య‌తిరేకంగా విపక్షాలు జ‌త క‌డుతుంటాయి. పాల‌న మీద ప్ర‌జ‌ల్లో పెరిగే అసంతృప్తికి త‌గ్గ‌ట్లుగా విప‌క్షాల బ‌లం అంత‌కంత‌కూ పెరుగుతుంటుంది. కానీ.. తాజాగా మాత్రం అందుకు భిన్న‌మైన ప‌రిస్థితి. మ‌రింత విచిత్ర‌మైన విష‌యం ఏమిటంటే.. 2014 ఎన్నిక‌ల్లో ఏ మోడీకి అయితే వ్య‌తిరేకంగా నిలిచారో.. ఇప్పుడు ఆయ‌న‌కు బాస‌టగా నిలుస్తాన‌న్న మాట మాట్లాడుతున్నారు.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీ త‌న ప్ర‌ధాన‌మంత్రి అభ్య‌ర్థిగా మోడీని ఎంపిక చేయ‌టంపై త‌న అస‌హ‌నాన్ని.. ఆగ్ర‌హాన్ని దాచుకోకుండా బ‌య‌ట‌కు చెప్పేసి సంచ‌ల‌నం సృష్టించారు. అంతేనా.. అప్ప‌టివ‌ర‌కూ బీజేపీతో ఉన్న మిత్ర‌త్వాన్ని తెంచుకున్నారు కూడా.

ఇంత‌కీ ఆయ‌న ఎవ‌రంటారా? అక్క‌డికే వ‌స్తున్నాం. మోడీ అన్నా.. ఆయ‌న్ను తాకిన గాలి అన్న అస్స‌లు ప‌డ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్‌. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు త‌ర్వాతా కూడా మోడీ వ్య‌తిరేక‌త‌ను ఏ మాత్రం దాచుకోకుండా ఉన్న నితీశ్‌.. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల సంద‌ర్భంగా మాత్రం అందుకు భిన్న‌మైన నిర్ణ‌యాన్ని తీసుకొని అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.

రాష్ట్రప‌తి ఎన్నిక‌ల‌కు బిహార్ గ‌వ‌ర్న‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న రామ్ నాథ్ కోవింద్‌ ను ఎంపిక చేయ‌టంతో.. సంకీర్ణ ప్ర‌భుత్వంలోని లాలూ మాట‌కు భిన్నంగా బీజేపీ అభ్య‌ర్థికి త‌న మ‌ద్ద‌తు ప్ర‌క‌టించి వార్త‌ల్లోకి వ‌చ్చారు. తాజాగా ఆయ‌న నోటి వెంట మ‌రో కీల‌క‌మైన వ్యాఖ్య వ‌చ్చింది. రానున్న 2019 సార్వ‌త్రి ఎన్నిక‌ల స‌మ‌యానికి బీజేపీని వ్య‌తిరేకించే విపక్షాల్ని ఏక‌తాటికి తీసుకురావాల‌ని ఆలోచిస్తున్న కాంగ్రెస్ అండ్ కోల‌కు క‌రెంట్ షాకిచ్చేలా నితీశ్ వ్యాఖ్యానించారు. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ‌లో తాను విప‌క్షాల అభ్య‌ర్థిని కాదంటూ స్ప‌ష్టం చేయ‌ట‌మే కాదు.. ముందు సొంత ఇంటిని చ‌క్క‌దిద్దుకోవాలి.. స్ప‌ష్ట‌మైన ఎజెండాను ప్ర‌క‌టించాలంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రప‌తి అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ఇచ్చే విష‌యంలో నితీశ్‌ ను మ‌రోసారి ఆలోచించుకోవాల‌ని కాంగ్రెస్ వ్యాఖ్యానించిన వేళ‌లో.. కాంగ్రెస్ పార్టీ మీద ఆయ‌న విమ‌ర్శ‌లు చేయ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో విప‌క్షాల ప్ర‌ధాని అభ్య‌ర్థిగా నితీశ్ అంటే పెద్ద ఎత్తున వార్త‌లు వ‌స్తున్న వేళ‌.. వాటిని కొట్టి పారేస్తూ ఆయ‌న ఇచ్చిన క్లారిటీ కాంగ్రెస్ అండ్ కోల‌కు శ‌రాఘాతం లాంటిదేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News