తెలంగాణ అధ్యక్షుడి వేటలో బీజేపీ, కాంగ్రెస్: రేసులో వీరే..

Update: 2020-02-11 08:00 GMT
తెలంగాణ లో అధికార టీఆర్ఎస్‌ కు తామే ప్రత్యామ్నాయం అంటే తామేనని చెప్పుకుంటున్న జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు ఇప్పుడు అధ్యక్షుడి ఎంపికలో నిమగ్నమయ్యాయి. జనాల్లోకి చొచ్చుకెళ్లే వ్యక్తి, వాక్చాతుర్యం, ఫాలోయింగ్, సామాజిక సమీకరణలు, పార్టీలో ఎక్కువ మంది సమ్మతి.. ఇలా ఎన్నింటినో లెక్కించి అధ్యక్షుడిని ఎంపిక చేయాల్సిన బాధ్యత ఆయా పార్టీల అధిష్టానాలపై ఉంది.

కాంగ్రెస్ నుండి రెడ్లకు అధ్యక్ష పదవి ఇస్తే, బీజేపీ బీసీలకు.. కాంగ్రెస్ ఇతరులకు ఇస్తే, బీజేపీ రెడ్లకు ఇచ్చి వారిని మచ్చిక చేసుకునేందుకు పావులు కదుపుతోంది. కాంగ్రెస్ నుండి రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి రేసులో ముందున్నారు. బీజేపీ నుంచి బండి సంజయ్, ధర్మపురి అరవింద్ ఉన్నారు. అయితే ప్రత్యర్థి పార్టీ ఓ సామాజిక వర్గానికి పదవిని ఇస్తే మరో పార్టీ ఇంకో సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఈసారి బీసీలకు లేదా మరో సామాజిక వర్గానికి ఇచ్చే అంశంపై కాంగ్రెస్ తర్జన భర్జన పడుతోంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి రెడ్డి సామాజిక వర్గం నుండి మంచి మద్దతు ఉంది. ఈ నేపథ్యంలో వారిని కాదని మరొకరికి ఇస్తే ఏ మేరకు ప్రయోజనం ఉంటుంది లేదా నష్టం ఉంటుందా అనే డైలమాలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. ఎవరికి ఇస్తే పార్టీ బలపడుతుందనే విషయమై లెక్కలు వేసుకుంటోంది. మళ్లీ రెడ్డి సామాజిక వర్గానికే ఇచ్చే పరిస్థితి ఉంటే రేవంత్, కోమటి రెడ్డి లు ముందంజ లో ఉన్నారు.

రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వచ్చారు. కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నారు. సీనియర్లను కాదని పార్టీలోకి వచ్చిన వెంటనే రేవంత్‌ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడాన్ని కాంగ్రెస్ పార్టీలోని చాలామంది సీనియర్లు జీర్ణించుకోలేకపోయారు. ఇప్పుడు అధ్యక్ష పదవి ఇస్తే ఊరుకునే పరిస్థితులు ఉండవని అంటున్నారు. కోమటి రెడ్డి పై పెద్దగా అభ్యంతరాలు లేవు. రెడ్లకు కాకుండా మరో సామాజిక వర్గానికి అవకాశమిస్తే ఎవరికి దక్కుతుందనేది కూడా ఆసక్తికరంగా మారింది.

కాంగ్రెస్ అధ్యక్షుడిని ఎంపిక చేసే వరకు వేచి చూడాలని బీజేపీ భావిస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ ఇతర సామాజిక వర్గానికి పదవి కట్టబెడితే రెడ్లకు అధ్యక్షుడి బాధ్యతలు ఇవ్వడం ద్వారా ఆ సామాజిక వర్గాన్ని దరి చేర్చుకోవాలని భావిస్తోంది. అలా అయితే డికె అరుణ వంటి నేతలు ఉన్నారు. కాంగ్రెస్ రెడ్లకు ఇస్తే అప్పుడు బీజేపీ బీసీల వైపు మొగ్గు చూపుతుందని అంటున్నారు.

విభజనకు ముందు వరకు బీసీలు ఎక్కువగా టీడీపీకి అండగా ఉండేవారి. ఇప్పుడు బీసీలకు అధ్యక్ష పదవి ఇస్తే వారిని దరి చేర్చుకోవచ్చునని భావిస్తోంది. ప్రస్తుతం మున్నూరు కాపు వర్గానికి చెందిన డాక్టర్ లక్ష్మణ్ అధ్యక్షుడిగా ఉన్నారు. అదే సామాజిక వర్గానికి చెందిన ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్‌లలో ఒకరికి ఈసారి అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. వారికి యువతలోను మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.

దక్షిణాదిన బీజేపీకి కర్ణాటక తర్వాత తెలంగాణ లో క్రమంగా బలం పెరుగుతోంది. కర్ణాటక, కేరళ తర్వాత తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీకి కేడర్ ఉంది. విభజన అనంతరం ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి పూర్తిగా రివర్స్ అయింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో అధ్యక్ష పదవి పై జాతీయ పార్టీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి.
Tags:    

Similar News