జేడీఎస్‌.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌కు హోంసిక్!

Update: 2018-05-23 04:31 GMT
మ‌రికొద్ది గంట‌ల్లో క‌ర్ణాట‌క రాజ‌కీయం ఒక కొలిక్కి రానుంది. సినిమాటిక్ మ‌లుపులు తిరిగిన ఆ రాష్ట్ర రాజ‌కీయం.. నేడు కుమార‌స్వామి ప్ర‌మాణ‌స్వీకారంతో క‌థ కైమ్లాక్స్ కు చేరుకోనుంది. బీజేపీతో హోరాహోరీగా పోరాడిన కాంగ్రెస్‌.. జేడీఎస్ కూట‌మి చివ‌రి వ‌ర‌కూ పోరాడి అధికారాన్ని సొంతం చేసుకోనున్నారు.

ఇలాంటి వేళ తెగ సంతోషంతో ఉండాల్సిన రెండు పార్టీల ఎమ్మెల్యేలు అసంతృప్తితో ర‌గిలిపోవ‌టం ఇప్పుడో కొత్త ట్విస్ట్ గా మారింది. ఎందుకిలా అంటే.. దీనికి కార‌ణం లేక‌పోలేదు. కేవ‌లం 8 మంది ఎమ్మెల్యేల్ని త‌మ వైపున‌కు తిప్పుకోవ‌టంలో బీజేపీ ఫెయిల్ కావ‌టంతో కాంగ్రెస్‌.. జేడీఎస్ ల‌కు అధికారం సొంతం కానుంది.

ఇలాంటి వేళ‌.. త‌మ ఎమ్మెల్యేల‌లు ప్ర‌లోభాల‌కు గురి కాకుండా ఉండేందుకు.. రిసార్ట్ రాజ‌కీయాల‌కు తెర తీశాయి కాంగ్రెస్.. జేడీఎస్ లు. ఒక‌ద‌శ‌లో బెంగ‌ళూరు నుంచి హైద‌రాబాద్ కు తీసుకురావ‌టం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల నేప‌థ్యంలో రాత్రికి రాత్రే బ‌య‌లుదేరి బెంగ‌ళూరుకు చేరుకొని.. అక్క‌డి నుంచి నేరుగా అసెంబ్లీకి వెళ్లి బీజేపీ స‌ర్కారు కుప్ప‌కూలిపోయేలా చేయ‌టం తెలిసిందే.

త‌న‌కు బ‌లం లేద‌న్న విష‌యాన్ని వెల్ల‌డించి.. త‌మ‌కు అవ‌స‌ర‌మైన బ‌లాన్ని స‌మ‌కూర్చుకోవ‌టంలో విఫ‌లం చెందటంతో సీఎం ప‌ద‌వికి య‌డ్డీ రాజీనామా చేశారు. దీంతో.. కాంగ్రెస్.. జేడీఎస్ ఎమ్మెల్యేలు ఆనందంతో పండ‌గ చేసుకున్నారు. ఈ సంబరం ఇలా ఉండ‌గా.. త‌మ ఎమ్మెల్యేలు ఎక్క‌డ ప‌క్క‌దారి ప‌డ‌తార‌న్న అనుమానంతో రెండు పార్టీలు వేర్వేరు హోట‌ళ్ల‌లో క్యాంప్ రాజ‌కీయాలకు తెర తీశాయి.

క‌ర్ణాట‌క‌లో నెల‌కొన్న రాజ‌కీయం నేప‌థ్యంలో రెండు పార్టీల ఎమ్మెల్యేల్ని కుటుంబాల‌కు దూరంగా ఉంచుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని కెంపెగౌడ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్ట్‌కు ద‌గ్గ‌ర్లోని హిల్ట‌న్ హోట‌ల్లో ఉంచ‌గా.. జేడీఎస్ ఎమ్మెల్యేల్ని డొడ్డ‌బ‌ళ్లాపూర్ లోని రిసార్ట్ లో ఉంచారు. మొద‌టి రెండు రోజులు బాగున్నా.. నేత‌ల‌కు ఇంటి మీద గాలి మ‌ళ్లింది. త‌మ‌కు అవ‌కాశం ఇస్తే.. ఒక్క‌సారి త‌మ కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడి వ‌స్తామ‌ని చెబుతున్న‌ప్ప‌టికీ.. స‌ద‌రు పార్టీలు అందుకు నో చెబుతున్నాయి. దీంతో..వారంతా హోటల్‌ కు.. రిసార్ట్ కు ప‌రిమిత‌మ‌వుతున్నారు.

తిరిగే కాలు.. అరిచే నోరు ఉత్తినే ఉంటే అస్స‌లు బాగోద‌న్న చందంగా.. త‌మ కాళ్లు.. చేతులు క‌ట్టేసిన చందంగా హోట‌ళ్ల‌కే ప‌రిమితం చేయ‌టంపై రెండు పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. మొన్న‌టి వ‌ర‌కూ పార్టీ కోసం ఆ మాత్రం త్యాగం చేయ‌క‌పోతే ఎలా? అన్న క్వ‌శ్చ‌న్ నుంచి.. ఏం ఆ మాత్రం కూడా న‌మ్మ‌కం లేదా?  పార్టీకి క‌మిట్ మెంట్ తో ఉన్నా.. అనుమానంతో మ‌మ్మ‌ల్ని క‌ట్ట‌డి చేస్తారా? అంటూ వారు మీడియా ప్ర‌తినిధుల‌కు ఫోన్ చేసి ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న‌ట్లు చెబుతున్నారు.

పార్టీ నేత‌ల్లో పెరుగుతున్న అసంతృప్తిని గుర్తించిన రెండు పార్టీల ప్ర‌ముఖులు వారిని బుజ్జ‌గించే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు చెబుతున్నారు. ఎప్పుడెప్పుడో కుమార‌స్వామి ప్ర‌మాణ‌స్వీకారం అయిపోతుందా?. ఎప్పుడు త‌మ కుటుంబ స‌భ్యుల్ని క‌లుసుకుంటామా? అన్న అతృత‌తో వారు ఉన్న‌ట్లు చెబుతున్నారు.


Tags:    

Similar News