టీడీపీ కంటే వైసీపీ, కాంగ్రెస్ సూప‌ర్ అట‌

Update: 2017-03-11 04:26 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం మాట త‌ప్ప‌డం - రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నాల‌ను వ‌దిలేసుకున్న విప‌క్షాలు ఈ బాధ్య‌త‌ను నెత్తిన వేసుకున్నాయి. పార్ల‌మెటు స‌మావేశాల సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వాన్ని నిల‌దీసేందుకు సిద్ధ‌మ‌య్యాయి. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక కేటగిరీ రాష్ట్ర హోదా కల్పిస్తామన్న అప్పటి ప్రధాని ప్రకటనను ఆ తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం బుట్ట దాఖలు చేసిన నేపధ్యంలో ఏపీకి పదిహేనేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పిస్తూ ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించే ప్రతిపాదనతో, అలాగే, ఒక ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఆ తర్వాత అధికారానికి వచ్చే ప్రభుత్వాలు విస్మరించే అవకాశం లేకుండా పార్లమెంట్‌ లో ప్రధాని లేదా, కేంద్ర మంత్రులు - శాసనసభల్లో ముఖ్యమంత్రులు-మంత్రులు చేసే ప్రకటనలకు రాజ్యాంగపరమైన రక్షణ - హామీ కల్పించేలా రాజ్యాంగాన్ని సవరించాలనే ప్రతిపాదనతో ఏపీకి చెందిన వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ - కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన ఇద్దరు సభ్యులు లోక్‌ సభ - రాజ్యసభల్లో రెండు అనధికార బిల్లులను ప్రవేశపెట్టారు. వీటితో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సభ్యులు ఉభయ సభల్లో మరో తొమ్మిది అనధికార బిల్లులను కూడా పార్లమెంట్‌ ముందుంచడం విశేషం.

పార్లమెంట్‌ - శాసనసభ వంటి చట్టసభల్లో ప్రభుత్వం తరఫున ప్రధాని - ముఖ్యమంత్రుల ప్రకటనలకు రాజ్యాంగబద్దమైన గ్యారంటీ కల్పించడంద్వారా వాటిని మరెవరూ విస్మరించే అవకాశం లేకుండా చూడడం లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ సభ్యుడు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ఒక రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక కేటగిరీ రాష్ట్ర హోదాతో పాటు ఎఫ్‌ ఆర్‌ ఎంబి రుణపరి మితిని అయిదు శాతానికి పెంచుతూ, రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేక రాయితీలను కల్పిస్తూ రాష్ట్ర విభజన చట్టంలోని మరో కొత్త క్లాజును పొందుపరిచే ప్రతిపాదనతో వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి లోక్‌ సభలో ప్రైవేటు మెంబర్‌ బిల్లును ప్రవేశపెట్టారు. ఏపీకి ప్రత్యేక కేటగిరీ రాష్ట్ర హోదా, ఇతర విభజన హామీల అమలు కోసం రాజ్యసభలో కాంగ్రెస్‌ సభ్యుడు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన అనధికార బిల్లును చర్చ అనంతరం ఓటింగ్‌ చేపట్టే సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ లేవనెత్తిన అభ్యంతరంతో దానిని ఆర్థిక బిల్లుగా పరిగణించి సభా కార్యక్రమాల జాబితా నుండి తొలగించిన నేపధ్యంలో అవే ప్రతిపాదనలతో లోక్‌ సభలో వై.వి.సుబ్బారెడ్డి మరో అనధికార బిల్లును ప్రవేశపెట్టడం ప్రాధాన్యతను సంతరించుకొన్నది. అలాగే, లోక్‌ సభలో తెలుగుదేశం పార్టీ సభ్యుడు గల్లా జయదేవ్‌ జంతుహింస చట్టంలోని లోపాలను సరిదిద్దేందుకు వీలుగా ఆ చట్టానికి పలు సవరణలు సూచిస్తూ - నైపుణ్యవృద్ధిని కూడా విద్యా హక్కు చట్టం పరిధిలోకి తీసుకొచ్చేలా విద్యా హక్కు చట్టాన్ని సవరించాలనే ప్రతిపాదనతో రెండు అనధికార బిల్లులను ప్రవేశపెట్టారు.

వీటితో పాటు క్రింది కోర్టు లేదా హైకోర్టులో మరణశిక్ష పడిన వారికి హైకోర్టు ముందస్తు అనుమతి లేకుండానే సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకొనే హక్కు కల్పిస్తూ రాజ్యాంగంలోని 134వ క్లాజ్‌ ను సవరించాలనే ప్రతిపాదనతో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ ఎస్‌) సభ్యుడు బి.వినోద్‌ కుమార్‌ లోక్‌ సభలో మరో అనధికార రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. క్రిందికోర్టులలో ఇతర శిక్షలకు గురైన వారెవరైనా న్యాయం కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉండగా మరణశిక్ష పడిన వారి కి మాత్రం హైకోర్టు అనుమతిస్తే తప్ప అత్యున్నత న్యాయ స్థానం తలుపు తట్టే అవకాశం లేకపోవడం సమంజసం కాదని, ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్న వాదన తో ఆయన ఈ బిల్లును ప్రవేశపెడుతున్నట్లు బిల్లు లక్ష్యాలు, ఆశయాలలో వివరించారు. బిజెపి సీనియర్‌ నాయకుడు, మాజీ ప్రధాని ఎ.బి.వాజ్‌ పేయి కూడా గతంలో 1987లో ఇదే ప్రతిపాదనతో ప్రవేశపెట్టిన ఒక అనధికార బిల్లును రాజ్యసభ రెండు రోజులపాటు సుదీర్ఘంగా చర్చించిందని, అయితే, ఈ ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తుందన్న అప్పటి కేంద్ర న్యాయశాఖ మంత్రి హెచ్‌.ఆర్‌.భరద్వాజ్‌ హామీతో ఆయన చివరకు ఆ బిల్లును ఉపసంహరించుకొన్నారని వినోద్‌ కుమార్‌ వెల్లడించారు. టీఆర్‌ ఎస్‌ నాయకుడు ఏపీ .జితేందర్‌ రెడ్డి కూడా లోక్‌ సభలో అటవీ చట్టానికి కొన్ని సవరణలు సూచిస్తూ మరో అనధికార బిల్లును ప్రతిపాదించారు. రాజ్యసభలో కాంగ్రెస్‌ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి అద్దె గర్భం చట్టానికి సవరణలతో ఒక బిల్లును, బాలబాలికలకు ఉచిత విద్యను నిర్బంధం చేస్తూ విద్యా హక్కు చట్టానికి సవరణ సూచిస్తూ మరో బిల్లును ప్రవేశపెట్టగా మరో కాంగ్రెస్ సభ్యుడు పాల్వాయి గోవర్థన్‌ రెడ్డి కూడా పార్టీ ఫిరాయింపుల చట్టంలోని లోపాలను సరిదిద్దే ఉద్దేశంతో రాజ్యాంగంలోని పదవ షెడ్యూలుకు సవరణలు ప్రతిపాదిస్తూ ఒక అనధికార రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు.

పార్లమెంట్‌ ఉభయ సభలు ప్రతి శుక్రవారం భోజన విరామం తర్వాత ప్రభుత్వం ప్రతిపాదించే బిల్లులకు బదులుగా సభ్యులు తమ వ్యక్తిగత హోదాలో వివిధ చట్టాలకు సవరణలను ప్రతిపాదించే అనధికార బిల్లులను పరిశీలనకు చేపడతాయి. ఈ రోజు సబ్యులు పెద్దసంఖ్యలో ప్రవేశపెట్టిన ఈ అనధికార బిల్లులపై వచ్చే పార్లమెంట్‌ సమావేశాలలో అనధికార కార్యకలాపాల అజెండాను చేపట్టే రోజుల్లో చర్చ జరుగుతుంది. ఈ సౌల‌భ్యాన్ని ఉప‌యోగించుకొని ఏపీ కోసం ప్రధాన‌ప్ర‌తిప‌క్షమైన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం పాటుప‌డ‌టం ప‌లువురిని ఆక‌ట్టుకుంటోంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News