కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోమారు తన చిత్రమైన ప్రవర్తనతో ఆకట్టుకున్నారు. కొద్దికాలం క్రితం లోక్ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పార్లమెంటు వేదికగా కౌగిలించుకొని - తర్వాత కన్నుకొట్టడం ఎంత దుమారం రేపిందో మనకు తెలుసు. ఆ వివాదం ఇంకా సద్దుమణగనే లేదు.. రాహుల్ మరోసారి కన్నుకొట్టారు. అయితే ఈసారి జైపూర్ లో జరిగిన ఓ సభలో ఆయన కన్నుకొడుతూ కెమెరాకు చిక్కారు. ఇప్పుడీ చిత్రం వైరల్ అయింది.
రాజస్థాన్‌లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల నేపథ్యంలో పార్టీ తరఫున ప్రచారం చేయడానికి రాహుల్ గాంధీ వెళ్లారు. ఈ సందర్భంగానే రాహుల్ మళ్లీ కన్నుకొట్టారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సచిన్ పైలట్ ను చూసి జాతీయ అధ్యక్షుడైన రాహుల్ కన్నుకొట్టడం కెమెరాకు చిక్కింది. ఆ తర్వాత రాహుల్ పక్కనే ఉన్న పార్టీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ ను సచిన్ పైలట్ ఆలింగనం చేసుకున్నారు. రాహుల్ తన ప్రసంగం తర్వాత ఈ ఇద్దరిని ఒక దగ్గరికి తీసుకొచ్చారు. ఎన్నికల ముందు పార్టీలో ఎలాంటి చీలికలు - విభేదాలు లేవని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే, పార్టీలో లుకలుకలు సెట్ అవడం కంటే...కన్నుకొట్టడమనే ఎపిసోడ్ ఎక్కువగా హైలెట్ అవడం గమనార్హం.
కాగా, గతంలో మోడీని కౌగిలించుకుని వెళ్లిన తర్వాత తన చైర్ లో కూర్చుకున్న రాహుల్ తమ సభ్యులతో మాట్లాడుతూ కన్ను కూడా కొట్టారు. ఆ కన్ను కొట్టే ఫోటోలను కూడా వార్తపత్రికలు ప్రధానంగా ప్రచురించాయి. మోడీని రాహుల్ అలా హత్తుకున్నారో లేదో.. సోషల్ మీడియాలో ఆ వార్త గుప్పుమంది. ట్విట్టర్ - ఎఫ్ బీలో ఆ హగ్ ఫోటోలు హోరెత్తాయి. హ్యాష్ ట్యాగ్ లు - సెటైర్ కామెంట్లతో ఆన్ లైన్ రీడర్స్ చెలరేగిపోయారు. మళయాళం హీరోయిన్ ప్రియా వారియర్ కన్ను కొట్టిన సందర్భాన్ని కొందరు తమ ట్వీట్లలో గుర్తు చేశారు.