గుజ‌రాత్ కాంగ్రెస్ సీఎం అభ్య‌ర్థి అయ‌నా?

Update: 2017-12-07 10:58 GMT
రాజ‌కీయాలు మ‌హా చిత్రంగా ఉంటాయి. అంచ‌నాల‌కు  అంద‌ని  ప‌రిణామాలు.. ఊహించ‌ని  రీతిలో ఫ‌లితాలు వెలువ‌డ‌టం మామూలే. తాజాగా గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఇలాంటి ప‌రిస్థితే నెల‌కొంది. గ‌డిచిన రెండు ద‌శాబ్దాలుగా ఆ రాష్ట్రంలో అల‌వాటైన ఫ‌లిత‌మే తాజా ఎన్నిక‌ల్లోనూ వ‌స్తుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మైంది. గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌లు షురూ అయిన స‌మ‌యంలో బీజేపీకి తిరుగులేద‌ని.. ఆ పార్టీ విజ‌యం త‌థ్య‌మ‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి.

అయితే.. చెప్పినంత ఈజీగా గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో విజ‌యం బీజేపీ సొంతం కాద‌న్న అభిప్రాయాలు ఇప్పుడు  వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మోడీపైనా.. మోడీ విధానాల మీదా గుజ‌రాతీల్లో అసంతృప్తి ఉంద‌ని.. ఇప్పుడున్న సీట్లు వ‌చ్చే అవ‌కాశం లేద‌ని.. బీజేపీకి కాంగ్రెస్ కు మ‌ధ్య టైట్ ఫైట్ జ‌రుగుతుంద‌న్న అంచ‌నాలు ఈ మ‌ధ్య‌న వ‌స్తున్నాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా గుజ‌రాత్ కాంగ్రెస్ సీఎం అభ్య‌ర్థిగా రాజ్య‌స‌భ స‌భ్యుడు అహ్మ‌ద్ ప‌టేల్ అంటూ పోస్ట‌ర్లు వెలువ‌డ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధిస్తే.. గుజ‌రాత్ సీఎంగా అహ్మ‌ద్ ప‌టేల్ ను నియ‌మిస్తార‌ని.. ముస్లింలు కాంగ్రెస్ కు ఓట్లు వేయాలంటూ సూర‌త్ లో పోస్ట‌ర్లు వెలిశాయి. దీంతో.. ఈ వ్య‌వ‌హారం కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్ప‌టివ‌ర‌కూ గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌ఫు ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి ఫ‌లానా అంటూ ఎవ‌రి పేరును ప్ర‌క‌టించ‌లేదు.

ఇలాంటి వేళ‌.. అహ్మ‌ద్ ప‌టేల్ పేరు తెర మీద‌కు రావ‌టంతో ఆయ‌న స్పందించారు. తాను ముఖ్య‌మంత్రి రేస్ లో లేన‌ని స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉంటే.. గుజ‌రాత్ లో కాంగ్రెస్ పార్టీ బ‌లం పుంజుకుందంటూ స‌ర్వే ఫ‌లితాలు కాంగ్రెస్ వ‌ర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ప్ర‌ధాని మోడీకి సొంత రాష్ట్రంలోనే మ‌ట్టి క‌రిపిస్తామ‌ని.. ఈ ఓట‌మితో బీజేపీకి తిరోగ‌మ‌నం మొద‌ల‌వుతుంద‌న్న ధీమాను కాంగ్రెస్ నేత‌లు వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ అందుతున్న స‌మాచారం ప్ర‌కారం బీజేపీపై కాంగ్రెస్ పైచేయి సాధించ‌లేద‌ని.. కాకుంటే.. గ‌ట్టి పోటీ ఇస్తుంద‌న్న అంచ‌నాలు వినిపిస్తున్నాయి. మ‌రి.. గుజ‌రాతీలు ఎలాంటి తీర్పునిస్తారో చూడాలి.
Tags:    

Similar News