1996లో గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వాన్ని అప్పటి ప్రధాని దేవెగౌడ సూచనతో రాష్ట్రపతి రద్దు చేశారు.. అప్పటికి గుజరాత్ బీజేపీ అధ్యక్షుడిగా వాజుభాయ్ వాలా ఉన్నారు. 2018లో సీన్ రివర్సయింది.. వాజూభాయి కర్ణాటక గవర్నరు.. దేవెగౌడ పార్టీ జేడీఎస్ కు కాంగ్రెస్ మద్దతు పలకడంతో రెండు పార్టీలకు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగలిగేంత బలం ఉంది. కానీ, గవర్నరు ఏం చేస్తారో అంటూ.. కర్మ ఫలితం అని ముక్తాయిస్తూ బీజేపీ నేత రామ్ మాధవ్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఆయన అన్నట్లుగానే గవర్నరు యడ్డీతో ప్రమాణం స్వీకారం చేయించడంతో దేవెగౌడ కర్మఫలితం అనుభవించినట్లుగానే కనిపిస్తోంది. కానీ... అదే సమయంలో బీజేపీ కూడా కర్మ ఫలితం అనుభవించేలా గోవా - బిహార్లలో రాజకీయ కదలిక వస్తోంది. అక్కడ అతి పెద్ద పార్టీలైన కాంగ్రెస్ - బీజేపీలు కర్ణాటకలో బీజేపీ లాజిక్ నే ఉదాహరణగా చూపుతూ తమతమ రాష్ట్రాల్లో ఇప్పుడు తమనే ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలంటూ డిమాండ్ చేస్తున్నాయి.
కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలా నిర్ణయం పట్ల దేశవ్యాప్తంగా రాజకీయ అలజడి రేగింది. అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలన్న రూల్ రాజ్యాంగంలోనే ఉందని బీజేపీ చెబుతుండగా.. ఆ పాయింటే ఇప్పుడు బీజేపీని ఇరకాటంలో పడేసేలా కనిపిస్తోంది. అనూహ్యంగా గోవా, బిహార్ రాజకీయాలు తెరపైకి వచ్చాయి. ఆయా రాష్ట్రాల్లో అతిపెద్ద పార్టీలు తమవేనంటూ కాంగ్రెస్ - ఆర్జేడీ లు తమకు అవకాశం ఇవ్వాలని వాదిస్తున్నాయి.
ఇంతకుముందు జరిగిన గోవా - బిహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ - ఆర్జేడీలు అతిపెద్ద పార్టీలుగా అవతరించినా అక్కడి గవర్నర్లు వారిని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవలేదు. గోవాలో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు సాధించినా బీజేపీ రాజకీయం చేసి సీఎం సీటు కొట్టేసింది. ఇక బిహార్లో తొలుత బీజేపీ అధికారం అందుకోలేకపోయినా ఆ తరువాత జేడీయూ ప్రభుత్వంలో ఉన్న ఆర్జేడీని బయటకు పంపి తాను జేడీయూతో కలిసి ప్రభుత్వం లో కూర్చుంది. కానీ.. కర్ణాటకలో మాత్రం కాంగ్రెస్ - జేడీఎస్ లకు కలిపి ఎక్కువ సీట్లు వచ్చినా తమదే అతిపెద్ద పార్టీ అన్న లాజిక్ తో ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఇప్పుడు అదే లాజిక్ ను కాంగ్రెస్ - ఆర్జేడీలు ప్రయోగిస్తున్నాయి.
కర్ణాటక పరిణామాల నేపథ్యంలో గోవాలో కాంగ్రెస్ అడ్డం తిరిగింది. గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో గోవాలోని 40 సీట్లలో బీజేపీ 13 మాత్రమే సాధించగా కాంగ్రెస్ 17 సాధించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు సహా అక్కడి ఇతర పార్టీల - ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలను అందరిని కలిపి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ.. కర్ణాటక లాజిక్ ప్రకారం ఇప్పుడు కూడా 16 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ అతిపెద్ద పార్టీ కావడంతో వారినే ప్రభుత్వం ఏర్పాటుకు పిలవాలి. ఈ లెక్క చెబుతూ కాంగ్రెస్ తన 16 మంది ఎమ్మెల్యేలతో రేపు(శుక్రవారం) రాజ్ భవన్ లో పేరేడ్ కు సిద్ధమైపోయింది. శుక్రవారం గోవా కాంగ్రెస్ నేతలు గవర్నర్ మృదులా సిన్హాను కలిసి ఎమ్మెల్యేల సంతకంతోపాటు కూడిన లేఖను సమర్పించబోతున్నారు.
మరోవైపు బిహార్ లో ఆర్జేడీ కూడా బీజేపీపై ఇదే లాజిక్ వినిపిస్తోంది. ఆర్జేడీ నేత - బిహార్ మాజీ మంత్రి తేజస్వి యాదవ్ బీజేపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించినట్లు బీజేపీ చెబుతోంది. ఆ లెక్కన్న బిహార్ లో ఆర్జేడీనే అతిపెద్ద ప్రభుత్వం. మరి నితీశ్ కుమార్ సర్కార్ ను రద్దు చేసి మమల్ని బిహార్ గవర్నర్ ఆహ్వానిస్తారా?’ అని తేజస్వి ట్వీట్ చేశారు. అంతేకాదు.. శుక్రవారం ఆర్జేడీ ఎమ్మెల్యేలంతా కలిసి గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరతామని ఆయన అంటున్నారు.