కవిత రిసార్ట్స్ రాజకీయం.. కాంగ్రెస్ తీవ్ర విమర్శలు?

Update: 2020-03-21 12:01 GMT
కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమవుతున్న వేళ ప్రజలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం చేస్తున్నాయి. సామూహిక కార్యక్రమాలు, సమావేశాలు, సభలు, శుభకార్యాలు వాయిదా వేసుకోమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ పిలుపును.. ఆ సూచనలను మీ కూతురు కవితకు పట్టవా? కవిత సమావేశాలు నిర్వహిస్తే చర్యలు తీసుకోరా? అని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. కవిత సమావేశం నిర్వహించి వందల మందికి విందు ఇస్తే దాన్ని పట్టించుకోరా? ప్రజలకో న్యాయం.. మీ కూతురుకు ఒక న్యాయమా? అని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసలు ఏం జరిగిందంటే.. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ తన కుమార్తె కవితకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేశారు.. ఆమె నామినేషన్ కూడా వేశారు. ఈ సమయంలో ఆమె గెలుపు కోసం క్యాంప్ రాజకీయాలకు తెర దీశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ శివారులోని ఓ రిసార్ట్స్‌కు జెడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను తరలించారంట. ఆ రిసార్ట్స్‌లో ఏకంగా దాదాపు 500 మందికి పైగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. వారికి రిసార్ట్స్ లో ముక్క, చుక్క అందిస్తూ వారు చిందులేస్తున్నారని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఓ వీడియో విడుదల చేసింది. స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కరోనా వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటే ఆయన కూతురు కవిత వాటిని బేఖాతర్ చేసిందని విమర్శిస్తున్నారు.

ప్రజలంతా గుమిగూడి ఉండొద్దని కేసీఆర్ పలుమార్లు చెప్పారని గుర్తుచేస్తూ అవి కవితకు వర్తించవా అని ప్రశ్నిస్తున్నారు. టీఆర్ఎస్ నిర్వహిస్తున్న రిసార్ట్స్‌లో మాత్రం ఒకేచోట 500 మంది మందు చిందులతో హల్‌చల్ చేస్తుండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ప్రజల ప్రాణాల కన్నా కవితకు రాజకీయాలే ముఖ్యమా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు కవిత నిర్వహిస్తున్న క్యాంప్ రాజకీయాలకు సంబంధించిన వీడియో వైరలైంది. ప్రజలంతా కరోనా వైరస్ కట్టడికి సామాజిక దూరం పాటిస్తుంటే కవిత మాత్రం భారీ విందును ఏర్పాటు చేయడంతో విమర్శలు వస్తున్నాయి.
Tags:    

Similar News