మరీ ఇంత నీరసంగా పని చేస్తారా?

Update: 2015-04-15 06:20 GMT
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తే కొత్త రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి తిరుగు ఉండదంటూ భారీగానే అంచనాలు వ్యక్తమయ్యాయి. దీనికి తగ్గట్లే.. విభజన వాదాన్ని చాలా హుషారుగా వినిపించారు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు. వారి దూకుడ్ని చూసిన చాలామంది తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ చెలరేగిపోతుందని భావించారు.

అందరూ సీమ టపాకాయలే కానీ.. ఆటంబాంబు లాంటి నాయకుడు లేని లోటు ఏమిటో ఇప్పుడిప్పుడే కాంగ్రెస్‌ అధినాయకత్వానికి తెలిసి వస్తోంది. ఎవరికి వారు సీమ టపాకాయలే కావటంతో వారి ప్రభావం పరిమితంగా ఉంటోంది. వీరందరిని ఒకచోట చేర్చి నడిపించే నాయకుడు లేని కారణంగా.. తెలంగాణ కాంగ్రెస్‌ రోజురోజుకీ బలహీనంగా మారుతోంది.

నాయకత్వ లేమితో.. ప్రజాకర్షణ ఉన్న కాంగ్రెస్‌ నేతలు సైతం ఇళ్లకే పరిమితం కావటం పార్టీకి శాపంగా మారింది. ఈ కారణంతో పార్టీ ఎంతో ఆర్భాటంగా స్టార్ట్‌ చేసిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నీరసంగా సాగుతోంది. పాతిక లక్షల మందిని పార్టీలో చేర్చుకునే లక్ష్యంగా స్టార్ట్‌ చేసిన సభ్యత్వ నమోదు.. అనుకున్న లక్ష్యంలో సగం కూడా పూర్తి కాకపోవటంపై అధినాయకత్వం సీరియస్‌గా ఉంది.

తాజాగా తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ఏఐసీసీ అసంతృప్తి వ్యక్తం చేయటమే కాదు.. తెలంగాణ నాయకత్వంపై ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. సభ్యత్వ నమోదు అంశంపై జరిగిన తాజా సమీక్ష సందర్భంగా అధినాయకత్వ ప్రతినిధిగా హాజరైన కుంతియా.. తెలంగాణ నేతలు చూపించిన అంకెల్ని చూసి ఆశ్చర్యపోయారని చెబుతున్నారు.

కొత్త రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ భారీగా సభ్యత్వ నమోదు ఉంటుందని సోనియాగాంధీ ఆశిస్తున్నారని.. అందుకు భిన్నంగా సభ్యత్వ నమోదు ఉండటంపై కుంతియా.. రాష్ట్ర నేతలపై సీరియస్‌ అయ్యారని చెబుతున్నారు. అధికారం ఉన్నప్పుడు ఫోజులు కొట్టే నేతలు.. అధికారం చేజారిన తర్వాత ఎవరికి వారుగా ఉండిపోవటం.. పార్టీ కంటే సొంత ప్రయోజనాలపై దృష్టి సారించటంతో తెలంగాణలో పార్టీ పరిస్థితి రోజురోజుకీ దయనీయంగా మారుతుందన్న భావన వ్యక్తమవుతోంది. తాజాగా అధినాయకత్వం ఆగ్రహం తెలంగాణ కాంగ్రెస్‌ నేతల్లో కదిలిక ఏమైనా తీసుకొస్తుందో చూడాలి.
Tags:    

Similar News