గుజ‌రాత్ ఎన్నిక‌లు.. కాంగ్రెస్‌కు ద‌డ‌పుట్టిస్తున్న ఎంఐఎం

Update: 2022-11-27 05:02 GMT
గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు దూసుకుపోతున్నాయి. ఎవ‌రికివారు ప్ర‌చార ప‌ర్వంలో ముందు న్నాయి. ఆయా వ‌ర్గాల‌ను ఆక‌ర్షిస్తూ త‌మనంటే త‌మ‌నే గెలిపించాల‌ని కోరుకుంటున్నాయి. అయితే, వీరి మధ్య ఇప్పుడు ఎంఐఎం.. ద‌డ పుట్టిస్తోంది. హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ ఇక్క‌డ కీల‌కంగా మారింది. దీంతో ఎవ‌రి ఓట్లు చీల‌తాయి..? ఎవ‌రికి ఎంఐఎంతో ల‌బ్ది చేకూరుతుంది? అనే విష‌యాలు ఆస‌క్తిగా మారాయి.

ఢిల్లీ అధికార పార్టీ ఆమ్ ఆద్మీ, హైద‌రాబాద్‌కు చెందిన ఆల్ఇండియా మజ్లిస్ ఇ ఇత్తెహదుల్ ముస్లిమీన్(ఎంఐఎం) పార్టీలు తొలిసారి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచాయి. ముస్లిం జనాభా అధికంగా ఉన్న సీట్లలో ఎంఐఎం తమ అభ్యర్థులను నిలబెట్టింది. మొత్తం 14 సీట్లలో పోటీ చేస్తోంది. ఇందులో 12 నియోజకవర్గాల్లో ముస్లింలకే సీట్లు కేటాయించింది. అయితే, ఈ పరిణామం అధికార బీజేపీకే లాభం చేకూర్చేలా కనిపిస్తోందని అంటున్నారు ప‌రిశీల‌కులు.

గుజరాత్లోని ముస్లింలను బీజేపీ వ్యతిరేక ఓటర్లుగా పరిగణిస్తుంటారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వైపే ఇన్నాళ్లూ వీరంతా మొగ్గుచూపారు. ఇప్పుడు కాంగ్రెస్కు పోటీగా ఆమ్ ఆద్మీ రంగంలోకి దిగింది. మరోవైపు, ముస్లిం వర్గాల ప్రతినిధిగా చెప్పుకొనే మజ్లిస్ సైతం బరిలో నిలిచింది. దీంతో ముస్లింల ఓట్లు మూడు పార్టీల మధ్య చీలే అవకాశం కనిపిస్తోంది. ఇది పరోక్షంగా బీజేపీకి లాభం చేకూర్చేదేన‌ని విశ్లేష‌కుల అభిప్రాయం.

ఆది నుంచి ఎంఐఎం ఇంతే!

ఇటీవల బిహార్లోని గోపాల్గంజ్ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో ఏఐఎంఐఎం పోటీలో ఉండడం వల్ల బీజేపీ లబ్ధి పొందింది. ఆర్జేడీ అభ్యర్థిపై 1,794 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. ఆ ఎన్నికలో మజ్లిస్ తరఫున పోటీ చేసిన అబ్దుల్ సలాం 12,214 ఓట్లు సాధించారు. ఈయన చీల్చిన ఓట్లే.. ఆర్జేడీ ఓటమికి కారణయయ్యాయి. అచ్చం అలాంటి పరిస్థితే గుజరాత్.. అహ్మదాబాద్ జిల్లాలోని జమల్పుర్ ఖడియా నియోజకవర్గంలో ఎదురుకానుందని అంటున్నారు.

ఈ నియోజకవర్గంలో ఛిపా(ముస్లింలో ఓ వర్గం) ఓటర్లు అధికంగా ఉన్నారు. వీరంతా.. మూకుమ్మడిగా అదే వర్గానికి చెందిన అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తూ వస్తున్నారు. అయితే ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున ఇమ్రాన్ ఖేదీవాలా.. మజ్లిస్ తరపున సాబిర్ కబ్లివాలా బరిలో దిగుతున్నారు. వీరిద్దరూ ఛిపా వర్గానికి చెందినవారే. సాబిర్.. ఎంఐఎం రాష్ట్ర అధ్యక్షుడు. ఇమ్రాన్.. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈ నేపథ్యంలో ముస్లిం ఓట్లు ఇరు ముస్లిం అభ్యర్థుల మధ్య చీలిపోయి.. బీజేపీ లాభవడే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

గుజరాత్‌లో దాదాపు 11 శాతం ముస్లిం ఓటర్లు  25 అసెంబ్లీ స్థానాల్లో  గణనీయ సంఖ్యలో ఉన్నారు. ఆ నియోజకవర్గాల్లో గెలుపు- ఓటములపై ముస్లిం ఓటర్లు ప్రభావం ఉంటుంది. ఎంఐఎం పార్టీ.. ముస్లింలు, దళితులు అధికంగా ఉన్న నియోజకవర్గాలపైనే ఈ సారి శాసనసభ ఎన్నికల్లో దృష్టి సారించింది. దీంతో గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లను ఆప్,  ఎంఐఎం చీల్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News