కాంగ్రెస్ ను స‌రికొత్త‌గా ఏసుకున్న మోడీ!

Update: 2018-07-15 04:58 GMT
మాట‌ల‌తో ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్క‌లు చూపించే క‌ళ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి అవ‌స‌రానికి మించినంత ఉంద‌న్న విష‌యం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ పార్టీపై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల్ని చూస్తే.. ఈ విష‌యం ఇట్టే అర్థం కాక మాన‌దు. ట్రిపుల్ త‌లాక్ విష‌యంలో కాంగ్రెస్ బ‌ల‌హీన‌త‌ను గుర్తించిన మోడీ.. ఆ పార్టీపై వినూత్న రీతిలో దాడి షురూ చేశారు.

ట్రిపుల్ త‌లాక్ ను నిషేధించే బిల్లుతో కాంగ్రెస్ లాంటి విప‌క్షాల రూపం ఏమిటో బ‌య‌ట‌ప‌డింద‌న్న ఆయ‌న‌.. కాంగ్రెస్ కేవ‌లం ముస్లిం పురుషుల పార్టీగా మారిందంటూ తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ట్రిపుల్ త‌లాక్ విష‌యంలో మోడీ అండ్ కో అనుస‌రిస్తున్న వైఖ‌రిని స‌మ‌ర్థించ‌లేని కాంగ్రెస్ త‌న సంప్ర‌దాయ ధోర‌ణిలోనే సాగుతోంది.

ఈ విష‌యాన్ని గుర్తించిన మోడీ తాజాగా కాంగ్రెస్ పై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ముస్లిం మ‌హిళ‌ల జీవితాల్ని మెరుగుప‌ర్చేందుకు బీజేపీ ప్ర‌య‌త్నిస్తుంటే.. కాంగ్రెస్ తో పాటు మ‌రికొన్ని పార్టీలు మాత్రం మ‌హిళ‌లు.. ముఖ్యంగా ముస్లిం మ‌హిళ‌ల జీవితాల్ని ప్ర‌మాదంలో ప‌డేసే ప్ర‌య‌త్నం చేస్తున్నాయ‌ని మండిప‌డ్డారు.

త‌లాక్ చెప్పి విడాకులు ఇచ్చే ప‌ద్ద‌తిని ఇస్లామిక్ దేశాలు సైతం నిషేధిస్తుంటే.. కోట్లాది మంది ముస్లిం మ‌హిళ‌లు ఈ త‌ర‌హా నిషేధం మ‌న దేశంలో కూడా ఉండాల‌ని డిమాండ్ చేస్తున్నార‌న్నారు.

ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ అధ్య‌క్షుడురాహుల్ గాంధీపై మోడీ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. "కాంగ్రెస్ అంటే ముస్లింల పార్టీ అని ఆ పార్టీ అధినేత చెప్పిన‌ట్లు ప‌త్రిక‌ల్లో చ‌దివా. స‌హ‌జ వ‌న‌రుల‌పై తొలిహ‌క్కు ముస్లింల‌కే  ఉంటుంద‌ని మ‌న్మోహ‌న్ సింగ్ ప్ర‌ధానిగా ఉన్న‌ప్పుడు చెప్ప‌టం నాకేమీ ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించ‌లేదు. కాంగ్రెస్ కేవ‌లం ముస్లిం పురుషుల పార్టీయా? మ‌ఉస్లిం మ‌హిళ‌ల గౌర‌వం.. హ‌క్కుల‌కు విలువ లేదా?  ట్రిపుల్ త‌లాక్ చ‌ట్టాన్ని వారు పార్ల‌మెంటులో ఆపేశార‌ని.. పార్ల‌మెంటును జ‌ర‌గ‌నీయ‌కుండా అడ్డుకున్నారు. పార్ల‌మెంటు స‌మావేశాలు మొద‌లు కావ‌టానికి ఇంకా నాలుగైదు రోజులు వ్య‌వ‌ధి ఉంది. ఈ లోపు త‌లాక్.. హ‌లాలా బాధితుల్ని క‌లిసి.. వారి వేద‌న విన్న త‌ర్వాత కాంగ్రెస్‌.. ఇత‌ర విప‌క్ష నేత‌లు స్పందించాలి" అంటూ మోడీ వ్యాఖ్యానించారు.

ట్రిపుల్ త‌లాక్ విష‌యంలో మోడీ అండ్ కో వినిపిస్తున్న వాద‌న‌తో ముస్లిం మ‌హిళ‌లు ప‌లువురు బీజేపీ ప‌ట్ల సానుకూలంగా ఉండ‌టం తెలిసిందే. ట్రిపుల్ త‌లాక్ ఇష్యూ బీజేపీ మైనార్టీ ఓటుబ్యాంకును అంత‌కంత‌కూ పెంచుతుంద‌న్న అభిప్రాయం ఉంది. ఇలాంటి వేళ‌.. త‌మ వాద‌నకు మ‌రింత మ‌సాలా ద‌ట్టిస్తూ ప్ర‌ధాని మోడీ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి. 21వ శ‌తాబ్దంలోనూ విప‌క్షాలు ఇంకా 18వ శ‌తాబ్ద‌పు ఆలోచ‌న‌ల్లోనే ఉన్న‌ట్లుగా ప్ర‌ధాని మండిప‌డ‌టం చూస్తుంటే.. తన తాజా వాద‌న‌తో కాంగ్రెస్ అండ్ కోలు ఇర‌కాటంలోప‌డే ప‌రిస్థితిని మోడీ తీసుకొచ్చార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News