జానారెడ్డి వర్సెస్ కోదండ‌రాం...కొత్త రచ్చ

Update: 2018-11-17 08:34 GMT
కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డి కొత్త రాజ‌కీయం మొద‌లుపెట్టారా?  త‌మ మిత్ర‌ప‌క్షంగా ఉన్న తెలంగాణ జనసమితి నాయ‌కుడు ప్రొఫెస‌ర్ కోదండ‌రాంకు ఆయ‌న త‌న మార్క్ రాజ‌కీయాన్ని రుచి చూపిస్తున్నారా? అంటే అవుననే స‌మాధానం వ‌స్తోంది. తాజాగా ఆయ‌న చేస్తున్న ఎత్తుగ‌డతో ఈ చ‌ర్చ తెర‌మీద‌కు వ‌స్తోంది. మ‌హాకూట‌మిలో భాగ‌స్వామ్యంగా ఉన్న తెలంగాణ జన సమితికి కూటమిలో 8 సీట్లు ఇస్తామని అంగీకారం కుదిరిన సంగ‌తి తెలిసిందే. అయితే జనసమితి అడిగే సీట్లలో ప్రాధాన్యత ఉన్న సీటు మిర్యాలగూడ. కానీ ఆ సీటును ఇచ్చేందుకు కాంగ్రెస్ ససేమిరా అంటోంది. ఆ సీటులో మాజీ మంత్రి - కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి కోసం చివరి వరకు ప్రయత్నాలు చేశారు జానారెడ్డి.

మిర్యాలగూడ నియోజకవర్గంలో జానారెడ్డికి పట్టుంది. ఆయన పోటీ చేస్తున్న నాగార్జున సాగర్ పక్కనే ఈ నియోజ‌క‌వ‌ర్గం చేయ‌కుంది. గతంలో చలకుర్తి నియోజకవర్గంగా ఉన్నప్పటి నుంచి జానాకు మిర్యాలగూడ బెల్ట్ లో బలం ఉంది. అందుకే మిర్యాలగూడ సీటును తన కొడుకు రఘువీర్ రెడ్డికి - నాగార్జున సాగర్ తనకు కావాలని అడుగుతూ వచ్చారు. కానీ అధిష్టానం ససేమిరా అంది. ఒక కుటుంబానికి ఒక సీటు ఇస్తామని తేల్చింది. సీటు నీకా? నీ కొడుకుకా? తేల్చుకో అంటూ రాహుల్ స్పష్టం చేశారు. ఢిల్లీకి వెళ్లి మరీ జానారెడ్డి ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో జానారెడ్డి ప్లాన్ బి బయటకు తీశారు. అదేమంటే? మిర్యాలగూడ సీటు కూటమిలో భాగంగా తెలంగాణ జన సమితికి ఖరారైంది. కానీ ఆ సీటులో తెలంగాణ జన సమితి చెబుతున్న అభ్యర్థి కాకుండా తాను సూచించిన అభ్యర్థిని నిలబెట్టాలంటూ జానారెడ్డి కోదండరాంపై ఒత్తిడి తెస్తున్నట్లు జన సమితి వర్గాల్లో టాక్ నడుస్తోంది. అలా అయితేనే మిర్యాలగూడ సీటును గెలిపించేదుకు తాను పూచీ తీసుకుంటానని ఆయన అంటున్నట్లు వార్తలొస్తున్నాయి. లేకపోతే తనకు సంబంధం లేదని చెబుతన్నట్లు కూడా అంటున్నారు.

అయితే మిర్యాలగూడ సీటులో జన సమితి నేత విద్యాధరర్ రెడ్డి కి టికెట్ కావాలని కోదండరాం పట్టుపడుతున్నారు. ఆ సీటు కోసం కోదండరాం సీరియస్‌ గా ప్రయత్నాల్లో ఉన్నారు. విద్యాధర్ రెడ్డి జేఏసీలో కీలక భూమిక పోశించినట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయనకు సీటు ఇవ్వకుండా జనసమితిలోనే తన వియ్యంకుడి సోదరుడైన మేరెడ్డి  విజయేందర్ రెడ్డికి ఇవ్వాలని జానారెడ్డి ఇన్‌ సైడ్ పాలిటిక్స్ చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే తన కొడుకుకు లేదంటే తన వియ్యంకుడి సోదరుడికి కూటమి టికెట్ ఇప్పించుకోవాలన్న ప్రయత్నాల్లో జానారెడ్డి తలమునకలయ్యారు.

చివరి వరకు తన కుమారుడికి టికెట్ కోసం ప్రయత్నాలు చేసి విఫలమైన జానారెడ్డి తాజాగా తన కొడుకుకు లేకపోయినా కనీసం తన వియ్యంకుడి సోద‌రుడికి అయినా జన సమితిలో టికెట్ ఇవ్వాలంటూ ప్రయత్నాలు చేయడం జన సమితికి ఇబ్బందికరంగా మారింది. కానీ జన సమితి మాత్రం విద్యాధర్ రెడ్డినే బరిలోకి దింపేందుకు పావులు కదుపుతోంది. మరి కూటమి రెబెల్ గా మిర్యాలగూడలో జానారెడ్డి బంధువు బరిలోకి దిగుతాడా అన్న చర్చ ఇప్పుడు షురూ అయింది.
Tags:    

Similar News