రాహుల్ పాదయాత్ర గాలి తీసేలా మాట్లాడిన కాంగ్రెస్ మాజీ సీఎం

Update: 2022-12-02 03:02 GMT
అమ్మ అన్నం పెట్టదు. అడుక్కోనివ్వదన్న సామెత వినే ఉంటారు. కాంగ్రెస్ పార్టీ నేతల తీరు చూస్తే ఇలానే ఉంటుంది. వారికంటూ వారు పార్టీ తీరు కోసం కష్టపడటం కానీ.. పార్టీ పూర్వ వైభవం కోసం తహతహలాడటం కానీ కనిపించదు. ఎవరైనా అందుకు తగ్గ సంకల్పం తీసుకుంటే.. బాగు పడిపోతున్న పార్టీని చూసి భరించలేనట్లుగా వ్యవహరిస్తుంటారు. ఇదే కాంగ్రెస్ కు ఇప్పుడున్న అతి పెద్ద మైనస్. కాంగ్రెస్ రూపురేఖల్ని మార్చటం కోసం నడుం బిగించిన పార్టీముఖ్యనేత రాహుల్ గాంధీ.. ఓపక్క చెమటలు చిందిస్తున్నా.. ఆయన శ్రమకు తగ్గ గుర్తింపు దేశ ప్రజల్లో తర్వాత సొంత పార్టీ నేతల్లోనూ లేకపోవటం ఇప్పుడు షాకింగ్ గా మారింది.

ఒక నిజాయితీ.. ప్రజల పట్ల కమిట్ మెంట్.. దేశం బాగు కోసం తపించే గుణం ఉన్న ఒక ముఖ్యనేతను అర్థం చేసుకోవటంలో దేశ ప్రజలు ఎంత పెద్ద తప్పు చేశారన్న విషయం ఇప్పటికే పలువురికి అర్థమవుతున్నా.. కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఇంకా అర్థం కావటం లేదనే చెప్పాలి. ఒక వ్యూహంలో భాగంగా.. అమూల్ బేబీ.. పప్పు.. యువరాజు అంటూ ప్రచారం సాగించి.. పదవుల మీద ఆశలేని రాహుల్ ను పనికిమాలిన వ్యక్తిగా చూపించిన మీడియా చేసిన తప్పులకు ప్రజలు మాత్రమే కాదు దేశం కూడా భారీ మూల్యం చెల్లిస్తుందని చెప్పక తప్పదు.

దేశం ఎదుర్కొంటున్న సమస్యల్ని మరింత బాగా అర్థం చేసుకోవటానికి.. తానేమిటో దేశ ప్రజలకు మరింత దగ్గరగా పరిచయం చేయాలని తపిస్తున్న రాహుల్.. జోడో యాత్ర పేరుతో దేశ మంతా పర్యటిస్తున్నారు. అన్నీ ఉండి కూడా తన ప్రజల కోసం అతగాడు పడుతున్న తపన అంతా ఇంతా కాదు. ఇప్పటికి పదవి కోసం వ్యూహాలు పన్నకుండా నిజాయితీగా వ్యవహరిస్తున్న అతగాడిని అర్థం చేసుకోవటంలో అందరూ తప్పులు చేస్తున్నారు. అందరికంటే ఎక్కువగా కాంగ్రెస్ నేతలు చేస్తున్నారు.

పార్టీ పునర్ వైభవం కోసం నడుం బిగించిన అతగాడి ప్రయత్నం కాంగ్రెస్ కు చెందిన కొందరికి ఎంత చిరాగ్గా మారిందన్న విషయాన్ని తెలిపే వీడియో ఒకటి బయటకు వచ్చింది. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి.. పార్టీ సీనియర్ నేత కమల్ నాథ్ చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడురాజకీయ సంచలనంగా మారింది. ప్రస్తుతం రాహుల్ మధ్యప్రదేశ్ లో పర్యటిస్తుననారు. ఈ సందర్భంగా ఆయన ఒక పండితుడితో మాట్లాడిన వీడియో క్లిప్ బయటకు వచ్చి సంచలనంగా మారింది.

అందులో.. రాహుల్ జోడో యాత్ర కారణంగా తాము వారం నుంచి చచ్చిపోతున్నామని పేర్కొనటం గమనార్హం. బయటకు వచ్చి వైరల్ అవుతున్న వీడియోలో.. కమల్ నాథ్ మాట్లాడుతూ.. ''గత ఏడు రోజులుగా మేం చచ్చిపోతున్నాం. రోజూ ఉదయాన్నే ఆరు గంటలకే యాత్ర ప్రారంభించాలి.

కనీసం 2- 4 గంటల పాటు నడవాలి'' అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. దీనిపై పలువురు కాంగ్రెస్ అసహనం వ్యక్తం చేస్తుంటే.. కమల్ నాథ్ మాటల్ని విన్న వారంతా కాంగ్రెస్ నేతల తీరును చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. పార్టీ కోసం శ్రమిస్తున్న రాహుల్ శ్రమను సింఫుల్ గా తీసి పారేయటమే కాదు.. పుసుక్కున ఎంత మాట అనేశాడన్న భావన కలుగక మానదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News