టీ కాంగ్రెస్‌ కు మ‌రో షాక్..కారెక్కిన మాజీ స్పీక‌ర్!

Update: 2018-09-07 08:38 GMT
కాంగ్రెస్ పార్టీకి  షాకుల మీద షాకులు ఇస్తున్నారు తెలంగాణ ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. అసెంబ్లీని ర‌ద్దు చేసిన ఊపులోనే 105 మంది అభ్య‌ర్థుల జాబితాను ప్ర‌క‌టించ‌టం ద్వారా రేసులో త‌న‌కంటే ముందు మ‌రెవ‌రూ ఉండ‌లేర‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించారు. అభ్య‌ర్థుల జాబితా విష‌యంపై కాంగ్రెస్ ర‌థ‌సార‌ధి ఉత్త‌మ్ ఢిల్లీలో మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్న వేళ‌.. తెలంగాణ‌లో గులాబీ అభ్య‌ర్థులు సీన్లోకి వ‌చ్చేయ‌టం.. ప్ర‌చారం షురూ చేయ‌టం కాంగ్రెస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

ఇదిలా ఉంటే.. తాము పిల‌వాలే కానీ..బోలెడంత‌మంది కాంగ్రెస్ నేత‌లు కారు ఎక్క‌టానికి సిద్ధంగా ఉన్న‌ట్లుగా ప్ర‌క‌టించిన టీఆర్ఎస్‌.. అందుకు త‌గ్గ‌ట్లే తాజాగా విప‌క్షానికి షాకిచ్చింది. కాంగ్రెస్ స‌ర్కారు హ‌యాంలో స్పీక‌ర్ గా వ్య‌వ‌హ‌రించిన సురేష్ రెడ్డి తాజాగా టీఆర్ఎస్‌లో చేరుతున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు.ఈ రోజు చోటు చేసుకున్న నాట‌కీయ ప‌రిణామాల‌తో ఆయ‌న గులాబీ కారు ఎక్కారు.

ఈ ఉద‌యం సురేష్ రెడ్డి ఇంటికి వెళ్లారు మాజీ మంత్రి కేటీఆర్‌. అనంత‌రం వారిరువురి మ‌ధ్య కాసేపు చ‌ర్చ‌లు జ‌రిగాయి. అనంత‌రం మీడియా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన కేటీఆర్‌.. 1989 నుంచి కేసీఆర్‌.. సురేష్ రెడ్డి ఇద్ద‌రూ స్నేహితుల‌ని.. పార్టీలు వేరైనా తెలంగాణ కోసం సురేష్ రెడ్డి కృషి చేశార‌ని చెప్పారు.

త‌మ ఆహ్వానాన్ని మ‌న్నించి పార్టీలోకి వ‌స్తున్న సురేష్ రెడ్డికి త‌గిన ప‌ద‌వి ఇచ్చి గౌర‌విస్తామ‌న్నారు. ఇదిలా ఉంటే.. టీఆర్ఎస్ లోకి తాను చేర‌టంపై సురేష్ రెడ్డి మాట్లాడుతూ.. తాను ప‌ద‌వుల కోస‌మో.. రాజ‌కీయ ల‌బ్థి కోస‌మే టీఆర్ఎస్ లో చేర‌టం లేద‌ని.. టీఆర్ ఎస్ టికెట్ల పంపిణీ నిన్న‌నే పూర్తి అయ్యింద‌ని చెప్పారు. తెలంగాణలో అభివృద్ధి కొన‌సాగాలంటే టీఆర్ ఎస్ మ‌ళ్లీ అధికారంలోకి రావాల్సి ఉంటుంద‌ని.. అందుకే తాను పార్టీలో చేరనున్న‌ట్లుగా చెప్పారు. తాజా వ్య‌వ‌హారం కాంగ్రెస్ కు షాకిచ్చింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. సురేష్ రెడ్డి త‌ర‌హాలోనే మ‌రికొంద‌రు కాంగ్రెస్ నేత‌లు గులాబీ కారు ఎక్క‌టానికి సిద్ధ‌మ‌వుతున్నార‌న్న స‌మాచారం కాంగ్రెస్ వ‌ర్గాల‌ను అయోమ‌యానికి గురి చేస్తోంది.


Tags:    

Similar News